ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విచారణ ముగిసింది. లిక్కర్ స్కామ్ పై సీబీఐ అధికారులు 9 గంటలపాటు కేజ్రీవాల్ ను ప్రశ్నించారు. ఆదివారం ఉదయం విచారణకు హాజరైన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ విచారణ అనంతరం రాత్రి ఎనిమిదన్నర గంటల ప్రాంతంలో సీబీఐ ఆఫీసు నుంచి బయటకు వచ్చారు. అనంతరం అక్కడి నుంచి తన నివాసానికి కారులో బయలురేరారు. ఉదయం నుంచి ఆప్ నేతలు, కార్యకర్తలు సీబీఐ ఆఫీసు ఏరియాకు భారీ సంఖ్యలో తరలివచ్చారు. పోలీసులు కొందరు నేతలు, కార్యకర్తల్ని అదుపులోకి తీసుకుని పీఎస్ కు తరలించారు. కాగా, సీబీఐ విచారణ ముగిసిన తరువాత రాత్రి 8.30 గంటలకు సీబీఐ ఆఫీసు నుంచి కేజ్రీవాల్ బయటకు వచ్చారు. ఢిల్లీ సీఎం తన నివాసానికి బయలుదేరగానే ఆప్ కార్యకర్తలు అక్కడి నుంచి వెళ్లిపోయారు.


సీబీఐ విచారణ అనంతరం నివాసానికి చేరుకున్నాక కొన్ని కీలక విషయాలు మాట్లాడారు. ఉదయం 11 గంటల నుంచి దాదాపు 9.5 గంటల పాటు సీబీఐ తనను ప్రశ్నించిందన్నారు. సీబీఐ అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానమిచ్చాను. రాజకీయ దురుద్దేశంతోనే ఆప్ ప్రభుత్వంపై లిక్కర్ పాలసీ ఆరోపణలు, అక్రమ కేసులు బనాయించారని చెప్పారు. మేం చావనైన చస్తాం కానీ, నిజాయితీ విషయంలో తగ్గేదే లేదన్నారు కేజ్రీవాల్. విచారణలో పాల్గొన్న సీబీఐ అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. తనను గౌరవపూర్వకంగా వ్యవహరించి విచారణలో భాగంగా ప్రశ్నలు అడిగారని చెప్పారు.






ఢిల్లీలో విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చాం, పంజాబ్ లో ఇప్పుడిప్పుడే మార్పు మొదలైంది. కానీ 30 ఏళ్లుగా గుజరాత్ లో బీజేపీ ప్రభుత్వం ఏం చేసింది. ఆప్ కేవలం కొన్నేళ్లలో ఢిల్లీలో అద్భుతమైన పాలన అందించింది. మిగతా పార్టీలకు ఎందుకు సాధ్యం కాలేదని ప్రజల నుంచి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వీటిని తట్టుకోలేక ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వాన్ని కూలదోయాలని, నేతల్ని అక్రమ కేసుల్లో ఇరికించి ఇబ్బందులకు గురిచేసి వారి దారికి తెచ్చుకోవాలని కేంద్ర ప్రభుత్వం యత్నిస్తుందని కేజ్రీవాల్ ఆరోపించారు.


సీబీఐ విచారణకు హాజరైన కేజ్రీవాల్..
లిక్కర్ పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు సీబీఐ ఇప్పటికే సమన్లు జారీ చేసింది. విచారణకు రావాలని నోటీసులిచ్చింది. ఈ మేరకు కేజ్రీవాల్ సీబీఐ కార్యాలయానికి ఆదివారం ఉదయం వెళ్లారు. సీఎం కేజ్రీవాల్ సీబీఐ ఆఫీసుకు వస్తారన్న క్రమంలోనే దాదాపు 1000 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతంలో ఎలాంటి అల్లర్లు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా 144 సెక్షన్ అమలు చేశారు. సీబీఐ ఆఫీస్‌కు వెళ్తున్న సమయంలో ఆయనతో పాటు పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కూడా ఉన్నారు. ఈ విచారణకు నిరసనగా ఆప్ కార్యకర్తలు ఢిల్లీ వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చారు. విచారణకు హాజరయ్యే ముందు కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. కార్యకర్తలను ఉద్దేశిస్తూ ఓ వీడియో విడుదల చేశారు. తాను అరెస్ట్ అయ్యే అవకాశముందని చెప్పారు. బీజేపీ ఆదేశిస్తే సీబీఐ అధికారులు తనను అదుపులోకి తీసుకుంటారని ఆరోపించారు. 






"సీబీఐ నన్ను అరెస్ట్ చేసే అవకాశముంది. బీజేపీ ఏం చెబితే అది చేస్తుంది సీబీఐ. కచ్చితంగా విచారణకు హాజరవుతాను. వాళ్ల చేతుల్లో పవర్ ఉంది. ఎలాంటి వాళ్లనైనా జైలుకు పంపుతారు. ఒకవేళ నన్ను అరెస్ట్ చేయమని బీజేపీ ఆదేశిస్తే అధికారులు తప్పకుండా నన్ను అరెస్ట్ చేస్తారు. వాళ్లేం చెబితే అది చేయడమేగా సీబీఐ పని" అని కేజ్రీవాల్ అన్నారు.