Shooting In Alabama:



20 మందికి తీవ్ర గాయాలు 


అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. అలబామాలోని డేడ్‌విల్లే ప్రాంతంలో  ఓ బర్త్‌డే పార్టీలో కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఓ చిన్నారి మృతి చెందినట్టు పోలీసులు వెల్లడించారు. బర్త్‌ డే ఫంక్షన్ జరుగుతుండగా ఉన్నట్టుండి కాల్పులు జరిగినట్టు ప్రత్యక్ష సాక్ష్యులు వెల్లడించారు. ఏప్రిల్ 15వ తేదీన రాత్రి 10.30 గంటలకు ఈ ఫైరింగ్ జరిగింది. ప్రస్తుతానికి ఒకరే చనిపోయినట్టు చెబుతున్నా...ఇది ఇంకా ఎక్కువే ఉండొచ్చని స్థానిక మీడియా అంచనా వేస్తోంది. ప్రత్యక్ష సాక్ష్యుల వివరాల ప్రకారం...గాయపడ్డ వాళ్లు ఎక్కడికక్కడే పడిపోయారు. కనీసం ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. వాళ్లు బతికే ఉన్నారా లేదా అన్న సమాచారం లేదు. గాయపడ్డ వాళ్లను దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు అధికారికంగా ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఏమీ చెప్పడం లేదు. దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగి విచారణ చేపడుతున్నాయి. ఒకరి కంటే ఎక్కువే చనిపోయి ఉంటారని స్థానికులు చెబుతున్నారు. 


రికార్డు స్థాయిలో మరణాలు..


అమెరికాలో గన్ కల్చర్ ఏ స్థాయిలో పాతుకుపోయిందో ఇటీవలి ఘటనలే స్పష్టం చేస్తున్నాయి. ఉన్నట్టుండి జేబులో నుంచి తుపాకీ తీసి ఇష్టమొచ్చినట్టు కాల్చి పడేస్తున్నారు చాలా మంది. ఈ కాల్పుల్లో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. వీరిలో చిన్నారులూ ఉంటున్నారు. ఒక్కోసారి స్కూల్స్‌పైనా దాడులు జరుగుతున్నాయి. ఈ మధ్య కాలంలో అయితే వారం రోజులకో కాల్పుల ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రాణనష్టమూ భారీగానే నమోదైంది. ఈ ఘటనలపై పూర్తి స్థాయి అధ్యయనం చేసి...ఓ రిపోర్ట్ విడుదల చేసింది JAMA Network Open మెడికల్ జర్నల్. గతేడాది అమెరికాలో కాల్పుల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్యగా రికార్డు స్థాయిలో నమోదైందని వెల్లడించింది. మూడు దశాబ్దాల రికార్డుని చెరిపేసిందని తేల్చి చెప్పింది. ఈ కాల్పుల ఘటనల్లో పురుషుల కన్నా మహిళలే ఎక్కువగా చనిపోతున్నారని తెలిపింది. 1990 నుంచి 2021 వరకూ అమెరికాలో 11 లక్షల 10 వేల 421 మంది తూటాలకు బలి అయ్యారని The Hill రిపోర్ట్ వెల్లడించింది. మహిళలు ఎక్కువగా బాధితులవుతుండగా..వీరిలో నల్లజాతికి చెందిన మహిళలనే ఎక్కువగా టార్గెట్ చేసుకుంటున్నట్టు నివేదిక తెలిపింది.


2010తో పోల్చితే...కాల్పుల ఘటనల్లో ప్రాణాలు కోల్పోయే మహిళ మూడు రెట్ల కన్నా ఎక్కువగా పెరిగింది. తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న మహిళల సంఖ్య 2015తో పోల్చుకుంటే డబుల్ అయింది. గన్ వయలెన్స్ ద్వారా చనిపోతున్న వారిలో 14% మహిళలే ఉంటున్నారు. గతేడాది లెక్కలు చూస్తే..ప్రతి లక్ష మంది అమెరికన్ మహిళలకు ఏడుగురు తుపాకీ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. 2010లో ఈ సంఖ్య 4గా ఉంది. చేతిలో లైసెన్స్‌డ్ తుపాకీ ఉండటాన్ని హోదాగా భావించే ధోరణి పెరిగింది. ఫలితంగా కుటుంబంలో కనీసం ఒక్కరైనా తుపాకీ కొనుగోలు చేస్తున్నారు. తమ కుటుంబాన్ని రక్షించుకోవాలంటే గన్ తప్పనిసరిగా ఉండాల్సిందే అనుకునే వారి సంఖ్య పెరగటం వల్ల క్రమంగా గన్‌ కల్చర్‌ దారి తప్పింది. 


Also Read: Atiq Ahmed Murder: నీట్‌గా టక్‌ చేసుకుని వచ్చారు, సింపుల్‌గా కాల్చి పారేశారు - అతిక్‌ మర్డర్‌కి పక్కా స్కెచ్