వేసవిలో శరీరం అనేక సవాళ్ళని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఉష్ణోగ్రత, డీహైడ్రేషన్, హీట్ స్ట్రోక్ వంటి అనేక రకాల సమస్యలకు దారితీస్తుంది. వడదెబ్బ, వేడి దద్దుర్లు సాధారణ సమస్యలు. వీటికి తోడు శ్వాసకోశ సమస్యలు తీవ్రమవుతాయి. వేసవి కారణంగా చెమట రూపంలో సోడియం, పొటాషియం వంటి అవసరమైన పోషకాలు క్షీణించిపోతాయి. ఈ సమస్యలను ఎదుర్కోవడానికి హైడ్రేట్ గా ఉండటం, కాటన్ వస్త్రాలు ధరించడం, పీక్ అవర్స్ లో ఎండకు దూరంగా ఉండటం వంటి జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. ఎక్కువ మంది ఈ టైమ్ లో జీర్ణక్రియ, చర్మం సమస్యలు, కాలానుగుణ ఫ్లూ, ఇన్ఫెక్షన్స్ బారిన పడుతూ ఉంటారు. వాటిని ఎదుర్కోవాలంటే సమతుల్య ఆహారం తీసుకోవాలి. అటువంటి సమస్యలను పరిష్కరించగలిగే వంటింటి చిట్కాలు మీ కోసం..


అసిడిటీ కోసం లవంగం


అసిడిటీ సమస్య ఉన్నప్పుడల్లా ఒక లవంగం ముక్కని తీసుకుని చప్పరించండి. లవంగంలో ఉండే సహజ నూనె వల్ల అసిడిటీ సమస్యని తగ్గించడంలో సహాయపడుతుంది.


దగ్గు తగ్గించేందుకు ఖర్జూరాలు


పొడి దగ్గుతో బాధపడుతుంటే మీరు రెమిడీని ప్రయత్నించవచ్చు. 6 ఖర్జూరాలు తీసుకుని అర లీటరు పాలలో 25 నిమిషాల పాటు తక్కువ మంట మీద మరిగించాలి. పాలు బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారనివ్వాలి. ఈ మిశ్రమాన్ని రోజుకి కనీసం మూడు సార్లు తీసుకుంటే మంచిది.


మైగ్రేన్ కోసం యాపిల్


రోజుకొక యాపిల్ తింటే డాక్టర్ కి దూరంగా ఉండవచ్చని అందరూ చెప్తుంటారు. మైగ్రేన్ నొప్పిని తగ్గించడంలో యాపిల్ సహాయపడుతుంది. అయితే దీన్ని ఖాళీ కడుపుతో మాత్రమే తినాలి.


మొటిమలు తగ్గించే దోసకాయ


దోసకాయలో నీరు సమృద్ధిగా ఉంటుంది. ఖనిజాలు, విటమిన్లతో లోడ్ చేయబడి ఉంటాయి. ఇది చర్మానికి మేలు చేస్తుంది. తురిమిన దోసకాయని మెడ, మొహం, కళ్ళపై అప్లై చేసుకోవచ్చు. ఇది మొటిమలు, బ్లాక్ హెడ్స్ ని తొలగించడంలో సహాయపడుతుంది.


దగ్గుకి తులసి


అధిక వేడి కారణంగా చాలా మందికి వేసవిలో వేడి జలుబు చేస్తుంది. దీన్ని తగ్గించుకునేందుకు తులసి చక్కని హోమ్ రెమిడీ. వెల్లుల్లి రసం, తేనె సమాన పరిమాణంలో తీసుకుని అందులో తులసి రసాన్ని కలపాలి. ఈ మిశ్రమాన్ని రోజుకి మూడు సార్లు తీసుకుంటే దగ్గుని తగ్గిస్తుంది.


అల్సర్ కి తులసి ఆకులు


తులసిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఆయుర్వేదంలో ఎన్నో సంవత్సరాలుగా ఉపయోగిస్తున్నారు. ఇందులో యాంటాసిడ్ గుణాలు ఉన్నాయి. రోజుకి కొన్ని తులసి ఆకులు నమిలి మింగితే మంచిది. గ్యాస్ ఉబ్బరం, కడుపులో మంట, అల్సర్లు ఏర్పడకుండా నిరోధించేందుకు సహాయపడుతుంది. ఆహారాన్ని సులభంగా జీర్ణం చేయడంలో దోహదపడుతుంది.


తలనొప్పికి పుచ్చకాయ


ఎండ నుంచి రాగానే కొంతమందికి భరించలేనంత తలనొప్పి వస్తుంది. అటువంటప్పుడు ఒక గ్లాసు పుచ్చకాయ రసం తీసుకోండి. వేసవిలో వచ్చే వేడి తలనొప్పికి కారణమవుతుందని శాస్త్రీయంగా రుజువు చేయబడింది. ఈ జ్యూస్ శరీరాన్ని హైడ్రేట్ చేయడానికి సహాయపడుతుంది. శరీరానికి అవసరమైన ఖనిజాలు, విటమిన్లను అందిస్తుంది.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.


Also Read: ఎమ్మెర్ గోధుమలు గురించి మీకు తెలుసా? దీని వల్ల బోలెడు ఆరోగ్య ప్రయోజనాలున్నాయ్