నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. సీఎం జగన్ పై ఒత్తిడి పెంచేలా ప్రణాళికలు రచిస్తున్నారు. ఆమధ్య అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్లకార్డులు పట్టుకుని రాష్ట్రవ్యాప్తంగా నెల్లూరు రూరల్ సమస్యలపై అటెన్షన్ క్రియేట్ చేశారాయన. వాటిలో ఒకదాన్ని ఆల్రడీ సాధించారు. బారాషహీద్ దర్గా అభివృద్ధి, మసీదు నిర్మాణానికి రాష్ట్రప్రభుత్వం 15 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసింది. దీన్ని తన విజయంగానే చెప్పుకుంటున్న కోటంరెడ్డి, ఇప్పుడు మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. స్వర్ణలా చెరువు చుట్టూ నెక్లెస్ రోడ్, గణేష్ ఘాట్ నిర్మాణానికి నిధులు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 17.55 కోట్ల రూపాయలు మంజూరు చేసిన టెండర్లు పిలిచి 6 నెలలు అవుతున్నా పనుల్లో పురోగతి లేదన్నారాయన. గణేష్ నిమజ్జన ఘాట్ పనుల ప్రారంభం కోసం ఉద్యమ కార్యాచరణ సిద్ధం చేశారు. గతంలో కేంద్ర మంత్రిగా వెంకయ్యనాయుడు కృషితో  అమృత్ పధకం ద్వారా అనుమతులు వచ్చాయని, కానీ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదని చెప్పారు. పనులు ప్రారంభించకపోతే నుడా కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. 


2014 ఎన్నికల తర్వాత ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యే కోటంరెడ్డి నెల్లూరు రూరల్ సమస్యల పరిష్కారానికి చొరవ చూపారు. అయితే అప్పట్లో ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఆయన పనులేవీ సాధించలేకపోయారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తుందని, అప్పుడు అన్ని పనులు చేయించుకుంటామని కార్యకర్తలు, ప్రజలకు చెబుతూ వచ్చారు కోటంరెడ్డి. 2019లో ఆయన మళ్లీ ఎమ్మెల్యేగా గెలిచారు. ఈసారి వైసీపీ కూడా అధికారంలోకి వచ్చింది. అయితే నిధుల కొరతతో ఈసారి కూడా సమస్యలు పరిష్కారం కాలేదు. సీఎం జగన్ సంక్షేమ కార్యక్రమాలపై ఫోకస్ పెట్టినా, స్థానికంగా రోడ్లు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు నిధుల విడుదల ఆలస్యమైంది. దీంతో అధికార పార్టీ ఎమ్మెల్యేగా కూడా చిన్న చిన్న పనుల్ని కోటంరెడ్డి చేయించుకోలేకపోయారు. కొన్నిచోట్ల సొంత నిధులు, స్నేహితుల దాతృత్వంతో చిన్న చిన్న పనులు చేయించినా.. కాంట్రాక్టర్లు చేయాల్సిన పనులు మాత్రం నెల్లూరు రూరల్ లో పూర్తి స్థాయిలో మొదలు కాలేదు. 


నెల్లూరు రూరల్ లో సమస్యలు కూడా అధికంగానే ఉన్నాయి పొట్టేపాలెం వద్ద కలుజు నిర్మాణం ఎన్నో ఏళ్లుగా వెనకపడిపోయింది. గతంలో పెన్నా వరదల సమయంలో ఈ ప్రాంత వాసులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కలుజు వద్ద నీటి ప్రవాహంలో చాలామంది జారి పడ్డారు. వాహనాల ప్రమాదాలు కూడా జరిగాయి. దీంతో ఎమ్మెల్యే అక్కడ బ్రిడ్జ్ నిర్మాణానికి ప్రతిపాదనలు చేశారు. ప్రభుత్వం ఆమోదిస్తూ జీవో కూడా ఇచ్చింది కానీ నిధులు విడుదల కాలేదు. అధికార పార్టీ ఎమ్మెల్యే అయిఉండి కూడా పనులు చేయించుకోలేకపోవడంతో ఎమ్మెల్యే అసహనానికి గురయ్యారు. ఆ తర్వాత ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలతో ఆయన పార్టీని వీడారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కారణంగా ఆయనపై పార్టీ కూడా సస్పెన్షన్ వేటు వేసింది. 


సస్పెన్షన్ వేటు తర్వాత కోటంరెడ్డి మరింత స్పీడ్ పెంచారు. ఇటీవల జలదీక్షకు పూనుకున్నారు కానీ పోలీసులు అడ్డుకట్ట వేశారు. ఆ తర్వాత బారాషహీద్ దర్గా అభివృద్ధి పనులకోసం ఆయన మెసేజ్ లు, పోస్ట్ కార్డ్ ఉద్యమం మొదలు పెట్టారు. రోజుల వ్యవధిలోనే అభివృద్ధి కార్యక్రమాల నిధులు విడుదలయ్యాయి. దీంతో ఆయన వర్గం తమ శ్రమకు ఫలితం దక్కిందని భావించింది. అయితే ఇవన్నీ పబ్లిసిటీ స్టంట్ లు అని కొట్టిపారేస్తున్నారు మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి. ఈ క్రమంలో ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. నెల్లూరు నెక్లెస్ రోడ్, గణేష్ ఘాట్ నిర్మాణానికి ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేయాలంటూ ఆయన ఒత్తిడి పెంచుతున్నారు. నిదులు విడుదల చేస్తే ఆ క్రెడిట్ కోటంరెడ్డికి వెళ్లడం గ్యారెంటీ, చేయకపోతే వివక్ష అంటూ ఆయన మరింత హడావిడి చేస్తారు. మరి ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి.