గోధుమలు ఆరోగ్యానికి మంచివి. మరి ఎమ్మెర్ గోధుమలు ఇంకా మంచివని పోషకాహార నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. ఈ రకమైన గోధుమలు ఇప్పుడిప్పుడే జనాదరణ పొందుతున్నాయి. ఎందుకంటే ఇవి సాధారణ గోధుమల కంటే తక్కువ గ్లూటెన్ కలిగి ఉంటుంది. బహుముఖ ప్రయోజనాలని అందిస్తుంది.


ఎమ్మెర్ గోధుమ అంటే ఏంటి?


దీన్ని ఫారో అని కూడా పిలుస్తారు. శతాబ్దాలుగా సాగు చేయబడిన పురాతన ధాన్యం. మధ్యప్రాచ్యానికి చెందిన వ్యక్తి క్రీ. పూ. 10,200 నుంచి 9500 వరకు వీటిని వేటగాళ్ళు సేకరించి వినియోగించారని చెప్తారు. ఇది నియోలిథిక్ పురావస్తు ప్రదేశాల్లో కనుగొన్నారు. ఎమ్మెర్ ఆఫ్రికా, స్పెయిన్, యూఎస్, అల్బేనియా, టర్కీ, స్విట్జర్లాండ్, జర్మనీ, గ్రీస్, ఇటలీలోని కొన్ని ప్రాంతాల్లో పెరుగుతుంది. కొన్ని పరిశోధనల ప్రకారం పెద్ద పేగు క్యాన్సర్ నివారణకు దీన్ని ఉపయోగిస్తారని ఇటలీలో దీనికి భారీ డిమాండ్ ఉంటుంది. దీనితో చేసిన రొట్టె చాలా రుచిగా ఉంటాయి. ఎమ్మెర్ బ్రెడ్ జర్మనీ, స్విట్జర్లాండ్, నెదర్లాండ్స్ సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. అర్మేనియన్ వంటకాలలో దానితో గంజి చేసుకుని తాగుతారు. ఇది బాగా ప్రాచుర్యం పొందింది.


ఆరోగ్య ప్రయోజనాలు


⦿ ఇది సాధారణ గోధుమల కంటే ఎక్కువ ప్రోటీన్ ని కలిగి ఉంటుంది. ఫైబర్ తో పాటు ఇనుము, మెగ్నీషియం అందిస్తుంది.


⦿ ఎమ్మెర్ గోధుమలు సాధారణ గోధుమల కంటే తక్కువ గ్లూటెన్ ఉంటుంది. మధుమేహులకి చక్కని ఎంపిక.


⦿ ఎమ్మెర్ గోధుమలు సాధారణ గోధుమల కంటే తక్కువ గ్లూటెన్ కంటెంట్ కారణంగా సులభంగా జీర్ణమవుతుంది.


⦿ అధిక పీచు పదార్థం కారణంగా ఎక్కువ సేపు పొట్ట నిండుగా ఉంచుతుంది. మధ్యాహ్న అల్పాహారాన్ని నివారిస్తుంది. బరువు తగ్గాలని అనుకునే వాళ్ళకి ఆరోగ్యకరమైన ఎంపిక.


⦿ కొన్ని అధ్యయనాల ప్రకారం పెద్ద పేగు క్యాన్సర్ నివారణకు ఇది పని చేస్తుంది. అంతే కాదు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అయితే ఈ విషయంలో మరింత పరిశోధన అవసరమని నిపుణులు భావిస్తున్నారు.


⦿ వీటిని తక్కువ రకం నేలలో కూడా పండించుకోవచ్చు. తక్కువ నీటితో పెరిగే పంట. కరువు సమయాల్లో సైతం తట్టుకుని నిలబడే పంటగా పేరు ఉంది.


భారత్ లో సాగు


భారతదేశంలో దీన్ని ఖప్లీ అని పిలుస్తారు. ఈ ఎమ్మెర్ గోధుమలను ఇక్కడ చాలా తక్కువగా పండిస్తారు. కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, ఆంధ్ర, తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో పరిమిత స్థాయిలో సాగు చేయబడుతుంది. దీని ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకున్న తర్వాత వీటికి మార్కెట్లో డిమాండ్ పెరిగిపోయింది. భారతదేశంలో పండే మొత్తం గోధుమలలో ఖప్లీ గోధుమలు కేవలం 1 శాతం మాత్రమే.


శుద్ది చేసిన పిండితో పోలిస్తే ఎమ్మెర్ గోధుమల్లో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. కేలరీలు తక్కువ. విటమిన్ బి3, మెగ్నీషియం, సెలీనియం, ఐరన్ గొప్ప మూలం. ఫైబర్, ప్రోటీన్, ఇతర విటమిన్లు, ఖనిజాలు అందించే మొక్కల ఆధారిత ప్రోటీన్ వనరు. సూప్ లో విస్తృతంగా ఉపయోగిస్తారు. జీర్ణం చేయడం సులభం. చపాతీలు, పరోటా, ఫులావ్, సలాడ్ వరకు అన్నీ విధాలుగా ఈ ధాన్యాన్ని వినియోగించుకోవచ్చు.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.


Also Read: ఉప్పు, కారం అద్దుకుని పండ్లు తింటున్నారా? అయితే ఈ సమస్యలు ఎదుర్కోవాల్సిందే