Somireddy On Ysrcp : వైజాగ్ స్టీల్‌ ప్లాంట్ విషయంలో  తెలంగాణ నేతలను అభినందించాలని మాజీ మంత్రి, టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. తెలంగాణ, ఏపీ బీజేపీ నాయకులు విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కలిసి పనిచేయాలన్నారు. ఆత్మాభిమానం ఉన్న వారు వైసీపీలో ఎమ్మెల్యేలుగా కొనసాగలేరన్న ఆయన.. కోడికత్తి కేసుపై స్పందించారు. గుంటూరులో మీడియాతో మాట్లాడిన సోమిరెడ్డి...  కోడి కత్తి కేసులో కుట్ర లేదని తేలిపోయిందన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కేవలం ముడి ఇనుము కొనుగోలు చేసుకోవటానికి 5000 కోట్ల రూపాయలు కావాలని అడిగారన్నారు. సీఎం జగన్ డబ్బులివ్వకుండా గాలికొదిలేసిన అంశంలో కేసీఆర్ ముందుకొచ్చారన్నారు. వైసీపీ నేతలు వైజాగ్ స్టీల్ ప్లాంట్ భూములు కాజేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఏపీ మంత్రులు చెత్త భాష మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీలో ఎమ్మెల్యేలు దిక్కులేని వాళ్లు అయిపోయారని ఎద్దేవా చేశారు. పద్దతిగా ఉండాలనుకునే వారు వైసీపీలో ఇమడలేకపోతున్నారన్నారు. లిక్కర్, మైనింగ్ వ్యాపారాల్లో ఎమ్మెల్యేలది రిటైల్ అయితే జగన్ ది హోల్ సేల్ వ్యాపారం అని ఆరోపించారు.


జగన్ నేరాల చిట్టా కేంద్రం వద్ద ఉంది 


 జగన్మోహన్ రెడ్డి పాపాలు పరాకాష్టకు చేరాయాని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దుయ్యబట్టారు.  కోడికత్తి కేసులో టీడీపీ హస్తం లేదు, హోటల్ యజమాని ప్రమేయం కూడా లేదని సీబీఐ తేల్చి చెప్పిందని స్పష్టం చేశారు. ఆనాడు ఎన్ఐఏ విచారణ కావాలని జగన్మోహన్ రెడ్డి కోరారని, అందుకు టీడీపీ ప్రభుత్వం ఒకే చెప్పిందన్నారు.
కోడికత్తి, గొడ్డలి పోటు రెండూ కూడా జగన్  స్వయంకృతాపరాధం అని తేల్చేశారు. ఇంత దారుణాలు జరుగుతున్నా  కూడా వైసీపీ నేతలు కడుపు మంటతో ప్రవర్తిస్తున్నారని ఎద్దేవా చేశారు. జగన్  ప్రభుత్వం మార్గదర్శి, సంగం డెయిరీ వంటి సంస్థలను మూసివేయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ ఉక్కు విషయంలో కూడా వైసీపీ ప్రభుత్వం తప్పుడు ప్రకటనలు చేస్తోందన్నారు. ఇనుప ఖనిజం కొనుగోలుకు రూ 5 వేల కోట్లు వెచ్చించలేని స్థితిలో జగన్ ప్రభుత్వం ఉందని తెలిపారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కు వచ్చిన ఆలోచన కూడా జగన్  కు రాలేదని అన్నారు. జగన్ నేరాల చిట్టా కేంద్రం వద్ద ఉంది కాబట్టి భయంతో ఏం అడగలేని స్థితిలో ఉన్నారన్నారు.  


వైసీపీలో ఎమ్మెల్యేలకు విలువలేదు 


కేంద్ర మంత్రి వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో తడవకొక  మాట మార్చడం సరికాదన్నారు సోమిరెడ్డి. విశాఖ ఉక్కును కాపాడటం కంటే పరిశ్రమ మూసేయాలనే జగన్ చూస్తున్నారని వ్యంగ్యాస్త్రం విసిరారు. విశాఖ ఉక్కు కర్మాగారం భూములను కాజేయటానికి జగన్ కుట్ర పన్నారని, అందుకోసమే స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. తెలుగు వారి సెంటిమెంట్ తో ముడిపడి ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ జోలికి రావొద్దని కేంద్రాన్ని కోరుతున్నామని తెలిపారు. 2లక్షల కోట్ల విలువైన భూమి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి సొంతమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.5 వేల కోట్లు ఖర్చు చేసి కర్మాగారాన్ని కాపాడలేరా అని ప్రశ్నించారు.  రెండు రాష్ట్రాల్లో బీజేపీ నాయకులు విశాఖ ఉక్కు కోసం పోరాడాలని కోరారు. మోదీ, అమిత్ షా కాళ్లకు దండం పెట్టడం తప్ప జగన్ సాధించిందేం లేదని విమర్శించారు.  వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో తెలంగాణ నేతలను అభినందించాల్సింది పోయి వైసీపీ నేతలు విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు‌‌. వైసీపీ ఎమ్మెల్యేలకు పార్టీలో విలువ లేదని కేవలం దోపిడీకి పరిమితం చేశారని అన్నారు. ఎమ్మెల్యేలుగా చేయాల్సిన పనులు మాత్రం చేయనివ్వటం లేదని, అందుకే వైసీపీలో ఇమడలేక చాలా మంది బయటకు వస్తున్నారని స్పష్టం చేశారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.