Earthquake in Delhi-NCR :  దిల్లీ నగరాన్ని భూకంపం కుదిపేసింది. నగరంలోని పలు ప్రాంతాల్లో భూప్రకంపనలు వచ్చాయి. శనివారం సాయంత్రం 7:57 గంటలకు నేపాల్‌లో రిక్టర్ స్కేల్ పై 5.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూకంప కేంద్రం భూమికి 10 కి.మీ దిగువన ఉందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. దిల్లీలోని పలు ప్రాంతాల్లో శనివారం రాత్రి స్వల్ప భూకంపం వచ్చింది. దీంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి రోడ్లపైకి పరుగులు పెట్టారు. రిక్టర్‌ స్కేల్‌పై భూకంప తీవ్రత 5.4గా నమోదైందని అధికారులు స్పష్టం చేశారు. ఈనెల 9న అర్ధరాత్రి సమయంలో దిల్లీలో భూమి స్వల్పంగా కంపించింది. రిక్టర్‌ స్కేల్‌పై 6.3 భూకంప తీవ్రతగా నమోదైంది. దీంతో దిల్లీ సరిహద్దుల్లోని నోయిడా, గుడ్‌గావ్‌ ప్రాంతాల్లో 10 సెకన్ల పాటు భూమి కంపించింది. 4 రోజుల వ్యవధిలోనే మళ్లీ భూమి కంపించడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. 










వారం వ్యవధిలో మూడోసారి


ఇటీవల నేపాల్‌లో 6.3 తీవ్రతతో సంభవించిన భూకంపం వల్ల పొరుగు దేశంలో ఆరుగురు మరణించారు. తిరిగి అదే ప్రాంతంలో శనివారం రాత్రి మరోసారి భూకంపం సంభవించింది. వారం వ్యవధిలో నేపాల్‌లో భూకంపం రావడం ఇది మూడోసారి. IMD అధికారిక సమాచారం ప్రకారం, భూకంపం నేపాల్‌లో 10 కిలోమీటర్ల లోతులో అక్షాంశం 29.28 N, 81.20 E రేఖాంశంలో ఏర్పడింది. ఉత్తరాఖండ్‌లోని పితోర్‌గఢ్, మున్సియారీ, గంగోలిహట్ వంటి ప్రాంతాల్లో ప్రకంపనలు సంభవించాయి. 'భూకంప కేంద్రం నేపాల్‌లోని సిలంగా పట్టణానికి మూడు కిలో మీటర్ల దూరంలో... 10 కి.మీ లోతులో ఏర్పడింది. భూకంప ప్రభావం భారతదేశం, చైనా, నేపాల్' అని పితోర్‌ఘర్ విపత్తు నిర్వహణ అధికారి బrఎస్ మహర్ నివేదించారు. అయితే ఎలాంటి నష్టం జరిగినట్లు ప్రాథమిక నివేదికలు అందలేదు.


నేపాల్ లో వరుస భూకంపాలు 


బుధవారం సంభవించిన భూ ప్రకంపనలతో నేపాల్‌లో 24 గంటల్లో రెండో భూకంపాలు వచ్చాయి. NCS ప్రకారం, నేపాల్‌లో మంగళవారం తెల్లవారుజామున 4.5 తీవ్రతతో భూకంపం వచ్చింది. అంతకుముందు అక్టోబర్ 19న ఖాట్మండు సమీపంలో 5.1 తీవ్రతతో భూకంపం వచ్చింది. NCS ప్రకారం, భూకంపం ఖాట్మండుకు తూర్పున 53 కిలోమీటర్ల దూరంలో మధ్యాహ్నం 2:52 గంటలకు సంభవించింది. భూకంపం లోతు భూమికి 10 కి.మీ. జాతీయ భూకంప పర్యవేక్షణ పరిశోధన కేంద్రం (NEMRC) ప్రకారం, జులై 31న  ఖోటాంగ్ జిల్లా మార్టిమ్ బిర్తా చుట్టూ ఉదయం 8.13 గంటలకు ఖాట్మండుకు 147 కి.మీ దూరంలో 6 తీవ్రతతో భూకంపం సంభవించింది. 2015లో  ఖాట్మండు పోఖారా మధ్య రిక్టర్ స్కేలుపై 7.8 తీవ్రతతో కూడిన భూకంపం సంభవించింది. ఈ భూకంపంలో 8,964 మంది మరణించారని దాదాపు 22,000 మంది గాయపడ్డారని అంచనా.