Nalini Sriharan Release :  రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషి నళిని శ్రీహరన్  జైలు నుంచి విడుదలయ్యారు.  31 ఏళ్ల నుంచి ఆమె జైల్లో ఉన్నారు. రాజీవ్ గాంధీ హత్య కేసు దోషులను విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో.. వేలూరు జైలు నుంచి విడుదలయ్యారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యకేసులో   మొత్తం ఆరుగురు దోషులను నవంబర్ 11 శుక్రవారం విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. నళిని శ్రీహరన్ జైలు నుంచి విడుదలకు ముందు తమిళనాడులోని వెల్లూరు పోలీసులు సాధారణ ప్రక్రియను చేపట్టారు. జైలు నుండి విడుదలకు ముందు, పెరోల్ షరతులతో కొన్ని లాంఛనాలను పూర్తి చేయడానికి  నళిని ని వేలూరు పోలీసు స్టేషన్‌కు వెళ్లారు. ప్రక్రియ పూర్తి చేయడంతో విడుదల చేశారు. 


సుప్రీంకోర్టు ఆదేశంలో రాజీవ్ హత్య కేసు దోషులకు  జైలు నుంచి విముక్తి 


తాను ఉగ్రవాదిని కానని నళిని స్వయంగా చెప్పారు. రాజీవ్ గాంధీ హత్య కేసులో యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న నళిని శ్రీహరన్, ఆర్పీ రవిచంద్రన్‌ల ముందస్తు విడుదలకు తాము అనుకూలమని తమిళనాడు ప్రభుత్వం గతంలో సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ దరఖాస్తును మద్రాసు హైకోర్టు తిరస్కరించడంతో  నళిని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మరో దోషి ఏజీ పరివాలన్ కేసులో సుప్రీంకోర్టు నిర్ణయాన్ని జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ బీవీ నాగరత్నతో కూడిన ధర్మాసనం ఆశ్రయించింది. మే 18న, రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 కింద  అధికారాలను ఉపయోగించి పెరివాలన్‌ను విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. 


ఈ ఏడాది మేలోనే పేరరివాలన్ విడుదలకు ఉత్తర్వులు - మిగతా వారికీ చాన్స్ 


ఈ ఏడాది మే నెలలో సుప్రీంకోర్టు ఈ కేసులో మరో నిందితుడైన పెరరివాలన్ ను తమ అత్యున్నత అధికారాన్ని ఉపయోగించి విడుదలకు ఆదేశించింది. అనంతరం మిగతా నిందితులు కూడా తమను కూడా విడుదల చేయాలని సుప్రీంకోర్టును కోరారు. ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు.. నళినీ శ్రీధరన్ తో పాటు శ్రీహరన్, శాంతన్, మురుగన్, రాబర్ట్ పయాస్, ఆర్పీ రవిచంద్రన్ ను విడుదల చేయాలని  ఆదేశాలు ఇచ్చింది. వాస్తవానికి తమిళనాడులో ఏ పార్టీ అధికారంలో ఉన్నా రాజీవ్ హంతకుల విడుదల వ్యవహారం భావోద్వేగపరమైన అంశంగా మారిపోయింది. రాజీవ్ హత్యకు కుట్ర చేసి అమలు చేశారన్న ఆరోపణలు రుజువుకావడంతో మొత్తం ఏడుగురికి గతంలో ఉరిశిక్ష విధించారు.


నళినిని గతంలోనే క్షమించిన సోనియా గాంధీ కుటుంబం 


 అయితే ఇందులో నళినిని క్షమిస్తున్నట్లు రాజీవ్ భార్య సోనియాగాంధీ, పిల్లలు రాహుల్, ప్రియాంక జైల్లో ఆమెను కలిసిన తర్వాత ప్రకటించారు. దీంతో సుప్రీంకోర్టు 2000 సంవత్సరంలో ఆమె ఉరిశిక్షను కాస్తా జీవితకాల ఖైదుగా మార్చింది. 2014లో మిగిలిన దోషులకు కూడా ఉరిశిక్ష జీవితఖైదుగా మారింది. అప్పటి నుంచి విడుదల కోసం వీరు చేస్తున్న ప్రయత్నాలు ఇప్పటికి ఫలించాయి. వరుసగా అందరూ విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే వీరి విడుదలను కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది.