Shah Rukh Khan stopped at Airport:
దుబాయ్ నుంచి ముంబయికి..
బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్‌కు చేదు అనుభవం ఎదురైంది. ముంబయి ఎయిర్‌పోర్ట్‌లో ఆయనను, ఆయన టీమ్‌ని కస్టమ్స్ అధికారులు ఆపారు. దాదాపు గంటసేపు విచారించి తరవాత వదిలేశారు. షారుఖ్ ఖాన్, ఆయన మేనేజర్ పూజ దడ్లానీ ఎయిర్‌పోర్ట్ నుంచి దాదాపు గంట తరవాత బయటకు వచ్చారు. కానీ...బాడీగార్డ్ రవితో పాటు షారుఖ్ ఖాన్ టీమ్‌ని ఆపేశారు కస్టమ్స్ అధికారులు. లక్షల రూపాయల విలువైన వాచ్‌లను షారుఖ్ తీసుకొచ్చారని, వాటికి కస్టమ్స్ డ్యూటీ చెల్లించలేదని అధికారులు వివరించారు. షారుఖ్‌ను అందుకే విచారించామని వెల్లడించారు. ఓ బుక్ లాంచ్ కోసం షారుఖ్ ఖాన్ తన టీమ్‌తో కలిసి ఓ ప్రైవేట్ చార్టర్‌లో దుబాయ్‌కు వెళ్లారు. ముంబయికి శుక్రవారం అర్ధరాత్రి తిరిగి వచ్చారు. రెడ్ ఛానల్‌ను దాటే సమయంలో వాళ్ల బ్యాగ్స్‌లో లక్షల రూపాయల విలువ చేసే వాచ్‌లను కస్టమ్స్ అధికారులు గమనించారు. వెంటనే అందరినీ ఆపి బ్యాగ్‌లు చెక్ చేశారు. విచారణలో భాగంగా ఎన్నో విలువైన వాచ్‌లను గుర్తించారు.
రూ.కోట్ల విలువైన వాచ్‌లు
Babun & Zurbk వాచ్‌లతో పాటు 6 బాక్సుల రోలెక్స్ వాచ్‌లు, స్పిరిట్ బ్రాండ్ వాచ్‌లు ఆ బ్యాగ్‌లలో ఉన్నాయి. వీటితో పాటు యాపిల్ సిరీస్ వాచ్‌లనూ గుర్తించారు. వీటి విలువను లెక్కించిన అధికారులు పన్ను రూపంలో రూ.17 లక్షల 60 వేల 500 చెల్లించాలని చెప్పారు. కోట్ల రూపాయల విలువ చేసే వాచ్‌లపై లక్షల రూపాయల పన్నులేంటి అని కాసేపు వాళ్ల మధ్య వాగ్వాదం జరిగినట్టు సమాచారం. ఓ గంట సేపు విచారణ తరవాత షారుఖ్ ఖాన్, ఆయన మేనేజర్ పూజ దడ్లాని బయటకు వచ్చారు. కానీ...బాడీగార్డ్ రవితో పాటు టీం అంతా అక్కడే ఉండి పోయారు. అయితే..షారుఖ్ టీం కస్టమ్స్ అధికారులతో మాట్లాడింది. ఈ వాచ్‌ల విలువ రూ.18 లక్షలు మాత్రమేనని వివరించింది.
వీటిపై రూ.6.83 వేల కస్టమ్స్ పన్నుని చెల్లించేందుకు అంగీకరించింది. షారుఖ్ బాడీగార్డ్ రవి పేరిటే బిల్ ఇచ్చినప్పటికీ...ఖాన్ క్రెడిట్ కార్డ్‌తోనే డబ్బు కట్టినట్టు తెలుస్తోంది. ఈ బిల్ చెల్లించాక ఉదయం 8 గంటలకు టీమ్‌ని విడిచిపెట్టారు కస్టమ్స్ అధికారులు. అయితే...షారుఖ్ ఖాన్ కస్టమ్స్ పన్ను కట్టకుండానే అధికారులు ఆయన బయటకు వెళ్లిపోవటానికి ఎలా అనుమతినిచ్చారన్న ప్రశ్న తెరపైకి వస్తోంది. అంతే కాదు. షారుఖ్ పేరు మీద కాకుండా ఆయన బాడీగార్డ్ రవి పేరుపై బిల్ ఎందుకు ఇచ్చారని కొందరు వాదిస్తున్నారు. ఒకవేళ ఆ వాచ్‌లు బాడీగార్డ్‌వే అయితే...వాటిపై కస్టమ్స్ డ్యూటీని షారుఖ్ ఎందుకు కట్టాడని ఇంకొందరు ప్రశ్నిస్తున్నారు. వీటిని దుబాయ్ నుంచి స్మగుల్ చేసి తీసుకొచ్చారా అన్న వాదనా వినిపిస్తోంది. ఏదేమైనా...స్టార్ హీరో కనుక ఈ మాత్రం ఆసక్తి ఉండకపోదు. అధికారులు స్వయంగా వచ్చి వివరిస్తే తప్ప లోపల ఏం జరిగిందన్నది స్పష్టత రాదు.
Also Read: Patanjali Drugs Ban: పతంజలికి షాక్ ఇచ్చిన అధికారులు, ఆ మందులపై నిషేధం