నెల్లూరు డైకస్ రోడ్ లోని ఒవెల్-14 స్కూల్ లో పీఆర్వోగా పని చేసే బ్రహ్మయ్య స్కూల్ లోని విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన నెల్లూరులో సంచలనంగా మారింది. వెంటనే ఆ చిన్నారి తల్లిదండ్రులు స్కూల్ కి వచ్చి ఫిర్యాదు చేశారు. అతడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయం ఆనోటా ఈనోటా అందరికీ తెలియడంతో, ఆ స్కూల్ లో తమ పిల్లలను చేర్పించిన తల్లిదండ్రులంతా ఒక్కసారిగా అక్కడకు వచ్చారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.


ఇటీవల హైదరాబాద్ లోని డీఏవీ స్కూల్ లో ఎల్కేజీ విద్యార్థినిపై జరిగిన లైంగిక దాడి రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. సరిగ్గా అలాంటి ఘటనే నెల్లూరులో జరిగింది. అక్కడ కారు డ్రైవర్ ఆ దారుణానికి ఒడిగడితే, ఇక్కడ స్కూల్ పీఆర్వో విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. డైకస్ రోడ్డులోని ఒవెల్ -14 స్కూల్ పీఆర్వో బ్రహ్మయ్య.. విద్యార్థినిపై లైంగిక దాడి చేశారు. ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఆ విద్యార్థిని ప్రవర్తన అనుమానంగా ఉండటంతో తల్లిదండ్రులు ఆరా తీశారు. తల్లిదండ్రుల్ని చంపేస్తానంటూ బ్లాక్ మెయిల్ చేసి అసభ్యంగా ప్రవర్తించేవాడని తేలింది. పోలీసులు కేసు నమోదు చేశారు. స్కూల్ ఎదుట పేరెంట్స్ ఆందోళన చేపట్టారు.


ఇటీవల నెల్లూరులోని మరో స్కూల్ లో ఓ లేడీ టీచర్ పిల్లవాడిని కొట్టినందుకు అతని కంటిపై గాయమైంది. దీంతో తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. ఆ స్కూల్ టీచర్ పై నేరుగా పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. రోజుల వ్యవధిలోనే ఇప్పుడు మరో ఘటన జరిగింది. ఇక్కడ స్కూల్ పీఆర్వో లైంగిక వేధింపులకు పాల్పడటం దారుణం.


గతంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగినా స్కూల్ యాజమాన్యం దాచిపెట్టిందని, అప్పుడే ఇలాంటి చర్యలు తీసుకుంటే ఇప్పుడిలా జరిగేది కాదని అంటున్నారు తల్లిదండ్రులు. స్కూల్ దగ్గర  ఆందోళనకు దిగారు. పీఆర్వో బ్రహ్మయ్యపై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ వారు ఆందోళన చేపట్టారు.


పోక్సో కేస్..


స్కూల్ లో  బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ముద్దాయిని అదుపులోకి తీసుకున్నారు నెల్లూరు పోలీసులు. పోక్సో చట్టంతోపాటు, ఎస్సీ, ఎస్టీ కేసు కూడా నమోదు చేశారు. నెల్లూరు వేదాయపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. సమాచారం తెలిసిన వెంటనే నెల్లూరు వేదాయపాలెం పోలీసులు స్కూల్ వద్దకు చేరుకున్నారు. పీఆర్వోగా పనిచేస్తున్న ముద్దాయిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని జ్యుడీషియల్ రిమాండ్ కి పంపిస్తున్నట్టు తెలిపారు పోలీసులు. ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టామన్నారు. మైనర్ బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే సహించేది లేదన్నారు జిల్లా ఎస్పీ విజయరావు. మహిళలైనా, బాలికలైనా.. వారితో అసభ్యంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. స్కూల్ యాజమాన్యంపై కూడా చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. తమకు జరిగిన అన్యాయం ఇంకెవరికీ జరగకూడదని, నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూడాలని అంటున్నారు.