Patanjali Drugs Ban: 


ఐదు మందులపై బ్యాన్..


ఉత్తరాఖండ్‌ ఆయుర్వేదిక్, యునానీ సర్వీస్ విభాగ అధికారులు పతంజలికి చెందిన ఐదు మందులపై నిషేధం విధించారు. ఈ ఔషధాల ఉత్పత్తిని వెంటనే నిలిపివేయాలని పతంజలి దివ్య ఫార్మసీకి తేల్చి చెప్పారు. మీడియాలోనూ ఎక్కడా ప్రచారం చేసుకోకూడదని స్పష్టం చేశారు. బాబా రాందేవ్‌ స్థాపించిన ఈ దివ్య ఫార్మసీని Drugs and Magic Remedies చట్టాన్ని ఉల్లంఘిస్తూ మందులు తయారు చేస్తోందని అధికారులు వెల్లడించారు.  Uttarakhand Ayurvedic and Unani Services లైసెన్స్ ఆఫీసర్ డాక్టర్ జీసీఎస్ జంగపంగి ఈ మేరకు ఓ లేఖ కూడా రాశారు. దివ్య మధుగ్రిట్, దివ్య ఐగ్రిట్ గోల్డ్, దివ్య థైరోగ్రిట్, దివ్య బీపీగ్రిట్, దివ్య లిపిడమ్ మందుల తయారీని తక్షణమే నిలిపివేయాలని స్పష్టం చేశారు. పతంజలి చెబుతున్న ప్రకారం...ఈ ఔషధాలతో మధుమేహం, కంటి ఇన్‌ఫెక్షన్లు, థైరాయిడ్‌ సమస్యలు, బీపీ, కొలెస్ట్రాల్‌ సమస్యలూ తగ్గిపోతాయి. కానీ...ఇవి చట్టప్రకారం తయారు కాలేదని అధికారులు తేల్చి చెబుతున్నారు. 


మండి పడుతున్న పతంజలి..


"ఈ డ్రగ్స్‌కు సంబంధించిన ఫార్ములేషన్ షీట్‌లను రివ్యూ చేస్తాం. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ టీమ్‌ని ఏర్పాటు చేశాం. దివ్యఫార్మసీ మాకు సహకరించి ఆ ఫార్ములేషన్ షీట్‌ను మాకు అందించాల్సి ఉంటుంది. వారం రోజుల్లోగా రివైజ్డ్‌ లేబుల్‌ని కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది" అని ఓ ఉన్నతాధికారి చెప్పారు. అధికారులు ఫార్ములేషన్ షీట్‌ను పరిశీలించి అప్రూవ్ చేసేంత వరకూ ఈ ఔషధాల ఉత్పత్తిని నిలిపివేయాలిని పతంజలికి ఇప్పటికే లేఖ పంపారు. దివ్యఫార్మసీ చేస్తున్న ప్రకటనలనూ పరిశీలించి వాటిని అప్రూవ్ చేస్తాం అని చెప్పారు. అప్రూవల్ లేకుండానే ప్రకటనలు కొనసాగిస్తే మాత్రం..Drugs and Magic Remedies చట్టం కింద కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. కేరళకు చెందిన ఓ ఆప్తమాలజిస్ట్ దివ్యఫార్మసీపై కేసు వేయగా...అధికారులు సమీక్షించి ఈ నిర్ణయం తీసుకున్నారు. "కంటి సమస్యలన్నింటినీ పోగొట్టే ఐ డ్రాప్స్‌ తయారు చేశామని దివ్య ఫార్మసీ ప్రకటించుకుంది. ఒకవేళ ఈ సమస్యలేమీ తీరకుండా సైడ్ ఎఫెక్ట్స్ వస్తే పూర్తిగా కంటిచూపు కోల్పోయే ప్రమాదముంది" అని కేసు వేసిన ఆప్తమాలజిస్ట్ అన్నారు. అయితే...అటు దివ్య ఫార్మసీ మాత్రం అన్ని నిబంధనలకు లోబడే మందులు తయారు చేస్తున్నామని చెబుతోంది. తమపై కావాలనే బురదజల్లే ప్రయత్నాలు జరుగుతున్నాయని మండి పడింది. "యాంటీ ఆయుర్వేద డ్రగ్ మాఫియా"కు ఇది సంకేతమని విమర్శించింది. ఈ కుట్రను తప్పకుండా అడ్డుకుంటామని తేల్చిచెప్పింది. ఇప్పటికే... పతంజలి దీనిపై అధికారులు అన్ని ఆధారాలు ఇచ్చిందని వివరించింది. 


అలోపతిపై సంచలన వ్యాఖ్యలు..


అలోపతి వైద్యం...మానవత్వానికి వ్యతిరేకమని ఇటీవల సంచలన కామెంట్స్ చేశారు బాబా రాందేవ్. "అలోపతి వైద్యులు టార్గెటెడ్ మెడిసిన్ తయారు చేస్తున్నారు. మెదడు, కాలేయం, కిడ్నీలు, గుండె,ఎముకలు...ఇలా అన్ని అవయవాలకు ప్రత్యేకంగా మందులు ఇస్తారు. కేవలం ఒకే ఒక మందుతో జబ్బుని ఎలా నయం చేస్తారు..? ఇలాంటి వాళ్లు అవివేకులు. ఆధునిక వైద్యం ఇంకా పసిప్రాయంలోనే ఉంది. వాళ్లు చేసిన పనులేవీ ఆమోదయోగ్యమైనవి కావు. ఒకే ఒక ప్రోటీన్‌ను టార్గెట్‌గా చేసుకుని ఆరోగ్యంగా మార్చేస్తాం అనటం అవివేకం" అని అన్నారు రామ్ దేవ్ బాబా. ప్రపంచ వైద్య రంగం ఇప్పుడు శీర్షాసనం వేస్తోందని, టార్గెటెడ్ మెడిసిన్‌తో ప్రజల్ని అమాయకులుగా మార్చుతున్నారని అసహనం వ్యక్తం చేశారు.


Also Read: Sanjay Raut: జైల్లో చిత్రహింసలు పెట్టారు, అక్రమ అరెస్ట్‌లపై విచారణ జరిపించాలి - సంజయ్ రౌత్