ATS Raids in Gujarat:
100కి పైగా ప్రాంతాల్లో సోదాలు..
గుజరాత్ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ..రాష్ట్రంలో భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రభుత్వం జాగ్రత్త పడుతోంది. ఇందులో భాగంగానే...యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ATS) రాష్ట్రవ్యాప్తంగా సోదాలు నిర్వహించింది. 13 జిల్లాల్లోని 100 కుపైగా ప్రాంతాల్లో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. నిన్న (నవంబర్ 11) రాత్రి నుంచి ఇవి మొదలయ్యాయి. జీఎస్‌టీ విభాగంతో
కలిసి ATS సంయుక్తంగా ఈ సోదాలు చేపడుతోంది. సూరత్, అహ్మదాబాద్, జామ్‌నగర్, బరూచ్, భావ్‌నగర్‌లో దాదాపు 150 ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నాయి. ఆర్థిక లావాదేవీలు, పన్ను ఎగవేతలపై ముఖ్యంగా దృష్టి సారించారు. ABP Newsకి వచ్చిన సమాచారం ప్రకారం...సాజిద్ అజ్మల్, షేక్, షెహజాద్ అనే ముగ్గురు వ్యక్తులపై యాంటీ టెర్రరిజం స్క్వాడ్ నిఘా పెడుతున్నట్టు తెలుస్తోంది. చాలా రోజులుగా వీరి కదలికల్ని గమనిస్తోంది. ఇప్పటికే వీళ్లలో ఇద్దరిని అరెస్ట్ చేశారు. రాష్ట్రంలో జీఎస్‌టీ ఎగవేతకు సంబంధించి పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడినట్టు తేలింది. కోట్ల రూపాయల పన్ను కట్టకుండా ఎగవేసినట్టు అధికారులు చెబుతున్నారు. ఇప్పుడు అరెస్ట్ అయిన వారికి
నిషేధిత PFI సంస్థతో పాటు హవాలా రాకెట్‌కు సంబంధాలున్నట్టు అనుమానిస్తున్నారు. రెండున్న వారాల్లో గుజరాత్‌లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ లోగా...ATS సోదాలు నిర్వహించటం రాష్ట్రంలో రాజకీయ వేడిని పెంచింది. అయితే...ఇప్పుడు పట్టుబడ్డ వాళ్లకు, రాజకీయ నేతలకు సంబంధాలున్నాయని తేలితే తప్ప..ఇది ఎన్నికల అంశం కాకపోవచ్చు. అటు ఐటీ విభాగం కూడా సోదాలు చేపడుతోంది. భుజ్, రాజ్‌కోట్, గాంధీధామ్‌లో దాదాపు 30 చోట్ల సోదాలు చేపట్టింది. ఫైనాన్స్ బ్రోకర్స్, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎక్కువగా ఉన్న చోటే ఈ సోదాలు జరిగాయి. డ్రగ్స్ సరఫరాపైనా నిఘా ఉంచారు ATS అధికారులు. పక్కా సమాచారం ప్రకారం అఫ్ఘనిస్థాన్‌కు చెందిన ఓ వ్యక్తిని ఢిల్లీలో అరెస్ట్ చేశారు. 8 కేజీల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.56 కోట్లు.
రెండు విడతల్లో ఎన్నికలు..
గుజరాత్‌లోని మొత్తం 182 అసెంబ్లీ స్థానాలకు రెండు విడతల్లో ఎన్నికలు జరపనున్నట్లు ఈసీ ప్రకటించింది. గుజరాత్ శాసనసభ పదవీకాలం 2023, ఫిబ్రవరి 18తో ముగియనుంది.డిసెంబర్ 1న గుజరాత్ తొలి దశ ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 5న రెండో విడత పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 8న కౌంటింగ్, ఫలితాలు వెల్లడించనుంది. గుజరాత్‌లో ప్రస్తుతం భాజపా ప్రభుత్వం అధికారంలో ఉంది. గుజరాత్‌లో 182 శాసనసభ స్థానాలుండగా.. 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా నేతృత్వంలోని ఎన్‌డీఏ కూటమి 99 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ 77 స్థానాలు సాధించింది. ఆ తర్వాత రాష్ట్రంలో పలుమార్లు ఉప ఎన్నికలు జరగడంతో ప్రస్తుతం కాషాయ పార్టీ బలం 111కు పెరిగింది. గుజరాత్ ఎన్నికల బరిలోకి దిగే అభ్యర్థుల రెండో జాబితాను బీజేపీ విడుదల చేసింది. ఇప్పటికే 160 మంది అభ్యర్థుల జాబితాను ఒకేసారి ప్రకటించిన కాషాయ పార్టీ.. ఈసారి ఆరుగురితో కూడిన మరో లిస్ట్‌ని ప్రకటించింది.
Also Read: Akhil Giri Remarks: సారీ చెప్పిన అఖిల్ గిరి, ఆయన వ్యాఖ్యలతో సంబంధం లేదన్న తృణమూల్