Akhil Giri Remarks:
టీఎమ్‌సీ ప్రతినిధి వివరణ..
తృణమూల్ కాంగ్రెస్ మంత్రి అఖిల్ గిరి..రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఇప్పటికే బీజేపీ ఆయనపై మండి పడుతున్నాయి. అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. అయితే...ఈ వివాదంపై తృణమూల్ కాంగ్రెస్ స్పందించింది. టీఎమ్‌సీ ప్రతినిధి సాకేత్ గోఖలే వివరణ ఇచ్చారు. "మంత్రి అఖిల్ గిరి చేసిన వ్యాఖ్యలతో పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. ఇది కచ్చితంగా బాధ్యతారాహిత్యమే. తృణమూల్ కాంగ్రెస్ అభిప్రాయాలతో ఆయన వ్యాఖ్యలకు ఎలాంటి సంబంధం లేదు. భారత రాష్ట్రపతి పట్ల మాకు ఎనలేని గౌరవం ఉంది" అని వెల్లడించారు. టీఎమ్‌సీ ఎంపీ సుస్మితా దేవ్ కూడా దీనిపై స్పందించారు. అఖిల్ గిరి బాధ్యతారాహిత్య వ్యాఖ్యలు చేశారని మండి పడ్డారు. "ఉన్నతమైన పదవిలో ఉన్న వ్యక్తిపై అలాంటి వ్యాఖ్యలు చేయటం చాలా దురదృష్టకరం. ఈ కామెంట్స్‌తో తృణమూల్ కాంగ్రెస్‌కు ఎలాంటి సంబంధం లేదు. పరస్పరం గౌరవం ఇచ్చిపుచ్చుకోవాలనే వైఖరికి మేము ఎప్పుడూ కట్టుబడి ఉంటాం" అని సుస్మితా దేవ్ స్పష్టం చేశారు. ఈ వివాదంపై అఖిల్ గిరి వివరణ ఇచ్చారు. "నేను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెబుతున్నాను. నేను రాష్ట్రపతిని గౌరవిస్తాను. సువేందు అధికారిని విమర్శించేందుకు మాత్రమే నేను రాష్ట్రపతి పేరుని ప్రస్తావించాను. సువేందు అధికారి గతంలో నాపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. నేను చూడటానికి బాగుండనని అన్నారు. నేనో మంత్రిని. రాజ్యాంగబద్ధంగా ప్రమాణస్వీకారం చేసి ఈ పదవిని చేపట్టాను. నాకు వ్యతిరేకంగా ఏం మాట్లాడినా..అది రాజ్యాంగాన్ని అవమానించడమే అవుతుంది" అని అన్నారు అఖిల్ గిరి.
అభ్యంతరకర వ్యాఖ్యలు..
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై తృణమూల్ కాంగ్రెస్ మంత్రి అఖిల్ గిరి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. నందిగ్రామ్‌లోని ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన అక్కడి స్థానికులతో మాట్లాడుతున్నారు. ఆ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. "నేను అందంగా లేనని సువేందు అధికారి నన్ను కించపరిచారు. ఆయన మాత్రం అందంగా ఉన్నాడా..? ఎవరినైనా సరే ఆహార్యాన్ని బట్టి జడ్జ్ చేయటం నాకు ఇష్టం ఉండదు. రాష్ట్రపతి అంటే మాకెంతో గౌరవం ఉంది. కానీ ఆమె చూడటానికి ఎలా ఉంటారు?" అని చుట్టూ ఉన్న వారిని అడిగారు. అక్కడి జనమంతా ఒక్కసారిగా గొల్లుమన్నారు. ఇప్పుడీ కామెంట్స్‌పైనే పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది.