Twitter suspends $8 subscription: ట్విట్టర్‌ కొన్న తర్వాత చాలా మార్పులు చేసిన హెడ్‌ ట్విట్‌ ఎలాన్‌ మస్క్‌, ప్రీమియం బ్లూ టిక్‌ వెరిఫికేషన్‌ కోసం 8 డాలర్లు వసూలు చేయాలని నిర్ణయించిన సంగతి మనందరికీ తెలుసు. ఇప్పుడు ఆ నిర్ణయాన్ని ఎలాన్‌ మస్క్‌ వెనక్కు తీసుకున్నారు. 8 డాలర్లు అడిగిన అపర కుబేరుడు కొన్ని రోజులకే  వెనక్కు తగ్గడం వెనక ఒక పెద్ద రచ్చ జరిగింది. 


కథ చాలా ఉంది
ప్రీమియం బ్లూ టిక్ వెరిఫికేషన్ బ్యాడ్జ్ కావాలనుకున్న వినియోగదారుల నుంచి 8 డాలర్లు వసూలు చేయాలని సోషల్ ఈ మీడియా ప్లాట్‌ఫారమ్ నిర్ణయించిన తర్వాత, మస్క్‌ మీద చాలా విమర్శలు వచ్చాయి. సామాన్యుల నుంచి అసామాన్యుల వరకు అంతా తమకు తోచిన భాషల్లో తిట్ల దండకం అందుకున్నారు. అయినా మస్క్‌ మామ వెనక్కు తగ్గలేదు. కొన్ని రోజులుగా అనూహ్యంగా "నకిలీ వెరిఫైడ్‌ అకౌంట్లు" ట్విట్టర్‌లో అమాంతం పెరిగాయి. ముఖ్యంగా గత రెండు రోజులుగా నకిలీ వెరిఫైడ్‌ అకౌంట్లు వరదలా వచ్చి పడ్డాయి. అప్పుడు కూడా మస్క్‌ అదరలేదు, బెదరలేదు. అయితే ఈ నకిలీ ఖాతాల నుంచి విపరీతార్థాలతో ట్వీట్లు మొదలయ్యాయి. అసభ్య సంజ్ఞలను షేర్‌ చేయడం మొదలు పెట్టారు. 



ఇక్కడితో కథ అయిపోలేదు. ఎలాన్ మస్క్ సొంత కంపెనీలయిన టెస్లా, స్పేస్‌ఎక్స్‌కు నకిలీ ఖాతాలను క్రియేట్‌ చేశారు. వాటికి బ్లూ టిక్‌ పెట్టారు. దీంతో, అవి కూడా ఆయా కంపెనీల ఒరిజినల్‌ అకౌంట్ల కిందకు మారిపోయాయి. ఒక నకిలీ వెరిఫైడ్‌ ఖాతా 'ఇన్సులిన్ ఉచితం' అని ట్వీట్ చేసింది. ఆ తర్వాత ఫార్మాస్యూటికల్ దిగ్గజం ఎలి లిల్లీ & కో క్షమాపణలు చెబుతూ ట్వీట్ చేయాల్సి వచ్చింది.


ఇంత జరిగాక ట్విట్టర్‌ పిట్టకు తత్వం బోధపడింది. తిక్క నిర్ణయాలు తీసుకుంటే నెటిజన్లు ఎలా రియాక్ట్‌ అవుతారో మస్క్‌కు బాగా అర్ధమైంది. దీంతో, 8 డాలర్ల సబ్‌స్క్రిప్షన్‌ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోక తప్పలేదు.


గతంలో.. ఎంటర్‌టైన్‌మెంట్‌, పాలిటిక్స్‌, జర్నలిజం, ఇలా వివిధ రంగాల్లోని ప్రముఖ వ్యక్తులు, సంస్థలు, ప్రతినిధుల ఖాతాలకు బ్లూ టిక్ వెరిఫికేషన్ ఉచితంగా అందుబాటులో ఉంది. టెస్లా కంపెనీ ఓనర్‌ అయిన ఎలాన్ మస్క్, 44 బిలియన్ డాలర్లతో టిట్టర్‌ను టేకోవర్ చేశాక పరిస్థితులు మారాయి. $8 చెల్లించడానికి సిద్ధంగా ఉన్న ఎవరికైనా బ్లూ టిక్ అందించాలని నిర్ణయించుకుంది.


రెండు రకాల వెరిఫైడ్‌ ఖాతాలు
ప్రస్తుతం, ట్విట్టర్‌లో రెండు రకాల వెరిఫైడ్‌ ఖాతాలు ఉన్నాయి. ఒకటి... మస్క్ స్వాధీనం చేసుకునే ముందు వెరిఫై చేసిన అకౌంట్లు. "ఈ ఖాతా వెరిఫై జరిగింది. ప్రభుత్వం, వార్తలు, వినోదం లేదా మరొక అధికారిక కేటగిరీలో దీనిని గుర్తించాం." అన్నది ఆ వెరిఫైడ్‌ ఖాతాల అర్ధం. మరొకటి.. మస్క్‌ వచ్చిన తర్వాత ప్రవేశపెట్టింది. 8 డాలర్లు కడితే ఎవరికైనా ట్విట్టర్‌ బ్లూ సర్వీస్‌ అందుతుంది.


44 బిలియన్‌ డాలర్ల ట్విట్టర్‌ కొనుగోలు డీల్ చాలా ఖరీదైనదని నిపుణులు చెబుతున్నారు. ఆ డబ్బును తిరిగి తెచ్చుకునే ప్రయత్నాల్లో భాగంగానే బ్లూ టిక్ బ్యాడ్జ్‌కి ఛార్జీ విధించాల్సిన అవసరం ఏర్పడిందని అంటున్నారు.