లాటరీ టికెట్లు ఒక్కోసారి కొంత మంది జీవితాలను అనుకోని మలుపులు తిప్పుతుంటాయి. తాజాగా జర్మనీకి చెందిన ఓ యువకుడికి కనీవినీ ఎరుగని లాటరీ తగిలించింది. ఏకంగా రూ. 81 కోట్ల లాటరీ గెల్చుకున్నాడు. డార్ట్‌మండ్‌కు చెందిన కుర్సాట్ యిల్డిరిమ్ స్టీల్ ఫ్యాక్టరీలో ఉద్యోగం చేసే వాడు. కొద్ది రోజుల కిందట లాటరీ టికెట్ కొనుగోలు చేశాడు. తాజాగా వాటి ఫలితాలు వెల్లడి అయ్యాయి. ఇందులో ఏకంగా 9,927,511,60 యూరోలు అంటే భారత కరెన్సీలో రూ. 81 కోట్లు గెలుచుకున్నాడు.


విలాస వంతమైన కార్లు కొనుగోలు చేస్తున్న కుర్సాట్


ఒక్కసారిగా ఊహించని రీతిలో డబ్బులు రావడంతో ఏం చేయాలో కుర్సాట్ కు అర్థం కాలేదు. ఈ డబ్బును ఎలా ఖర్చు చేయాలా? అని రకరకాలుగా ఆలోచించాడు. ముందుగు తను పని చేసే స్టీల్ ఫ్యాక్టరీలో ఉద్యోగాన్ని వదిలేశాడు.  రూ. 3.6 కోట్ల ఫెరారీ 448 పిస్తాను కొనుగోలు చేశాడు. దాంతో పాటు  రూ. 2 కోట్లతో పోర్షే టర్బో ఎస్ క్యాబ్రియోలెట్‌ కొన్నాడు.  ఒక ఖరీదైన వాచ్, అతనికి ఇష్టమైన బూజర్‌ను కూడా కొనుగోలు చేశాడు.


భార్య కోసం అణ్వేషణ, పత్రికల సాయం


అనుకున్నవన్నీ కొనుక్కున్నాడు. ఇక అతడికి ఓకే ఒక్క కోరిక మిగిలింది. అదేంటంటే.. నచ్చిన జీవిత భాగస్వామిని ఎంచుకోవడం.  "నేను ఇప్పటికీ ఒంటరిగానే ఉన్నాను. నాకో భార్య కావాలి. ఆమె అందగత్తె కావచ్చు,  లేదంటే నల్లటి జుట్టు గల స్త్రీ కావచ్చు, నేను పట్టించుకోను. నేను తనతో  ప్రేమలో పడాలనుకుంటున్నాను. ప్రయాణాలను ఇష్టపడే,  నాతో కుటుంబ జీవితాన్ని గడిపేందుకు సిద్ధంగా ఉన్న ఓ మహిళ కోసం ఎదురుచూస్తున్నాను.  ఏం జరిగినా నేను ఎల్లప్పుడూ నమ్మే స్త్రీ నాకు భాగస్వామిగా రావాలని కోరుకుంటున్నాను” అని చెప్పాడు. ఇక జర్మనీలోని పలు పత్రికలు ఈయన కోరికను ప్రచురించాయి. ఆయనకు భార్యగా ఉండాలి అనుకునే వారు సంప్రదించాలి అంటూ జర్మన్ టాబ్లాయిడ్ ఓ ఇమెయిల్ ను కూడా క్రియేట్ చేసింది.


చాలా మంది అసూయ పడుతున్నట్లు ఆవేదన


“వాస్తవానికి నాకు డబ్బు రావడం పట్ల చాలా మంది పక్కవారు. స్నేహితులు అసూయగా చూస్తున్నారు. వచ్చిన డబ్బు పట్ల నేను జాగ్రత్తలు తీసుకున్నాను. చేతిలోకి డబ్బు రావడంతో  అకస్మాత్తుగా అందరూ స్నేహితు అవుతున్నారు. నాకు తెలియని వ్యక్తులు కూడా తెలిసిన వ్యక్తులుగా పరిచయం చేసుకుంటూ.. డబ్బులు అడగడానికి ప్రయత్నిస్తున్నారు. చాలా మంది నేను లాటరీ ద్వారా వచ్చిన డబ్బుకు అర్హుడిని కాదని భావిస్తున్నారు. నేను ఎక్కడి నుంచి వచ్చానో, ఆ దారిని ఎప్పుడూ మర్చిపోలేను. నేను శ్రామిక వర్గం నుంచి వచ్చాను. ఎప్పటికీ అహంకారిగా మారను” అని కుర్సాట్ తెలిపారు. తనకు లాటరీ తగలగానే తన తల్లిదండ్రులతో పాటు, సోదరులకు డబ్బులు పంపినట్లు తెలిపారు. తనకు వచ్చిన డబ్బుతో కొంత మందికి సాయం చేయబోతున్నట్లు ఆయన వెల్లడించారు.


Read Also: స్నానమంటే బద్దకమా? ఈ మిషన్‌లో పడుకుంటే చాలు, అదే స్నానం చేయించేస్తుంది.