Ramagundam Fertilizers and Chemicals Limited: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రామగుండం పర్యటనకు అంతా సిద్ధమైంది. ఉదయం ఏపీలో పలు కార్యక్రమాలలో పాల్గొన్న అనంతరం హైదరాబాద్‌కు రానున్నారు ప్రధాని మోదీ. మధ్యాహ్నం దాదాపు రెండు గంటల అనంతరం బేగంపేట విమానాశ్రయం నుంచి ఎయిర్ ఫోర్స్ కి చెందిన ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరి 3.05 నిమిషాలకు రామగుండం ఎన్టీపీసీ లోని హెలిపాడ్ ల్యాండింగ్ ప్రదేశానికి మోదీ చేరుకోనున్నారు. అక్కడి నుంచి ఆర్ ఎఫ్ సి ఎల్ (RFCL) కి నేరుగా బయలుదేరి 3.45కు ఎన్టీపీసీ క్రీడా మైదానంలో జరిగే సభా ప్రాంగణానికి ప్రధాని చేరుకుంటారు. ఆ తరువాత 4.40 వరకు అక్కడ నిర్వహించిన కార్యక్రమంలో రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని జాతికి అంకితం చేయనున్నారు. తిరిగి  సాయంత్రం 4.55 నిమిషాలకు బేగంపేట విమానాశ్రయానికి తిరుగు ప్రయాణం అవుతారు.


కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు
ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన అడ్డుకుంటామంటూ పలు పార్టీలు.. సంఘాలు ప్రకటించడంతో భద్రత అధికారులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. మొత్తం టౌన్షిప్ తో పాటు రాజీవ్ రహదారిపై పోలీసులు ప్రత్యేక బలగాలతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఇక ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బాంబ్ స్క్వాడ్ బృందం ఇప్పటికే తనిఖీలు సైతం నిర్వహించింది. వచ్చి పోయే ప్రజలు నేరుగా చూసే విధంగా భారీ ఎత్తున స్క్రీన్‌లను ఏర్పాటు చేశారు. సాధారణ ప్రజలు సైతం పెద్ద సంఖ్యలో సభకు హాజరయ్యేలా ఏర్పాట్లను పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. అన్ని జిల్లాల నుండి దాదాపుగా 3,000 మంది పోలీసులు భద్రతా విధులలో పాల్గొంటున్నారు. 
ఇక దేశ ప్రధాని కావడంతో ఇప్పటికే ఎస్పీజీకి చెందిన ప్రత్యేక బృందం (SPG Special Team) పలుమార్లు రూట్ మ్యాప్ ని పరిశీలించి తగిన సూచనలు చేసింది. మూడు గంటల్లో కార్యక్రమం ముగియనుండడంతో దానికి తగ్గట్టుగానే భద్రత ఏర్పాట్లు చేశారు. మొత్తం ఆరుగురు ఎస్పీలు, ఆరుగురు అదనపు ఎస్పీలు, 25 మంది డీఎస్పీలతో పాటు సీఐలు, ఎస్సైలు.. పోలీసులు హోంగార్డులు బందోబస్తులో పాల్గొనున్నారు. వీరికి ఇప్పటికే రామగుండం పోలీస్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి పర్యవేక్షణలో విధులను కేటాయించారు. ముఖ్యంగా సభా ప్రాంగణానికి రెండు ప్రధాన ద్వారాలు ఏర్పాటు చేయగా... పాసులు ఉన్నవారిని ఏ- గేటు నుండి పాసులు లేని వారిని బి-గేట్ నుండి అనుమతించనున్నారు. ఇక వచ్చే వాహనాలకు ఎన్టీపీసీ టౌన్ షిప్‌లో పార్కింగ్ కి స్థానాన్ని కేటాయించారు. 
ప్రధాని మోదీ పర్యటన రోడ్ మార్గంలోనూ ఉండడంతో ఏలాంటి నిరసన కార్యక్రమాలు చేపట్టిన కఠిన చర్యలు ఉంటాయని ఇప్పటికే ప్రధాన ప్రతిపక్ష పార్టీల నాయకులకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఏదైనా అవాంఛనీయ ఘటనలకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఆ నోటీసులలో పేర్కొన్నారు. సిపిఐ సిపిఎం పార్టీల నాయకులతోపాటు మరిన్ని సంఘాలకు వీటిని అందజేశారు. అయితే వారిపై నిఘా ఉంచి వారిని ముందస్తుగా అదుపులోకి తీసుకోవాలని పోలీసులు భావిస్తున్నట్లు సమాచారం. మరోవైపు ఎన్టీపీసీ టౌన్షిప్ ఆర్ఎస్సీఎల్ మార్గాన్ని ఇప్పటికే పూర్తిగా తమ అదుపులోకి తెచ్చుకున్నారు.