Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన లక్ష కోట్ల అవినీతిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలంగాణ వైఎస్సార్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రధాని నరేంద్ర మోదీకి బహిరంగ లేఖ రాశారు. కాళేశ్వరం ప్రాజెక్టు భారత దేశంలోనే అతిపెద్ద కుంభకోణం అని ఆమె ఆరోపించారు. వెంటనే ఒక విచారణ కమిషన్‌ను వేయమని కోరారు. నిజానిజాలు దేశ ప్రజల ముందు ఉంచాలన్నారు. మోదీని కలిస్తే అవినీతి గురించి అడుగుతారని సీఎం కేసీఆర్‌కి భయం అంటూ ఎద్దేవా చేశారు. కేసీఅర్ తెలంగాణను సొంత ఎస్టేట్ అనుకుంటున్నారని ఆరోపించారు. 97,500 కోట్లు సెంట్రల్ ఫైనాన్స్ సంస్థల నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు కోసం అప్పు తెచ్చి భారీ కుంభకోణానికి పాల్పడ్డారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వంగా వాచ్ డాగ్‌ల ఉండాలి కాదా అంటూ ఘాటు విమర్శలు చేశారు.
ఒక రాష్ట్రంలో ఇంత అవినీతి జరిగింది అని మీకు, మీ మంత్రులకు, ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ కు, కేంద్ర జల శక్తి శాఖకి కూడా తెలుసన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును ఒక ఏటీఎంలా వాడుకుంటున్నారని మీరే చెబుతున్నప్పటికీ.. చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని వైఎస్ షర్మిల ప్రధాని మోదీని ప్రశ్నించారు. తెలంగాణలో జరిగిన అతి పెద్ద కుంభకోణంపై దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేస్తున్నట్లు వివరించారు. విచారణకు వెంటనే ఆదేశాలు ఇవ్వమని కోరారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కేసీఆర్ ఒక అద్బుతం అన్నారని, మెగా అద్భుతం అని చెప్పి మెగా మోసం చేశారని పేర్కొన్నారు. 18 లక్షల ఎకరాల వరకు నీళ్లు ఇస్తామని చెప్పి 50 వేల ఎకరాలకు మాత్రమే నీళ్లు ఇచ్చారంటూ విమర్శించారు. 18 లక్షల ఎకరాలు ఎక్కడ, మీరు ఇచ్చిన 50 వేల ఎకరాలు ఎక్కడ అంటూ ధ్వజమెత్తారు.
మూడేళ్లలో మునిగిపోయిన ప్రాజెక్టు ఇదొక్కటే..
ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టుతో వైఎస్సార్ 38 వేల కోట్లతో పూర్తి చేద్దాం అనుకున్నారని.. కానీ సీఎం కేసీఆర్ రీ డిజైన్ చేసి లక్షా 20 వేల కోట్లకు పెంచారని ఆమె చెప్పుకొచ్చారు. నా తలకాయ, నా చెమట అని ఎక్కడ లేని సొల్లు చెప్పారంటూ ఎద్దేవా చేశారు. గోదావరి నదిపై కాళేశ్వరం అనే సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యిందన్నారు. కట్టిన 3 ఏళ్లలో మునిగిపోయిన ప్రాజెక్టు ప్రపంచంలో ఒక్కటే ఉంటుందని.. అది కూడా కాళేశ్వరం ప్రాజెక్టు మాత్రమే అని తెలిపారు. ఇది ప్రజల డబ్బు అని లక్షా 20 వేల కోట్లు అని చెప్పుకొచ్చారు. కేసీఅర్ సర్కార్ మీద దర్యాప్తు చేయాలని, ఒక దర్యాప్తు కమిషన్ కావాలని వైఎస్ షర్మిల అన్నారు. టెండరింగ్ దగ్గర నుంచి మొత్తం అక్రమాలు జరిగాయన్నారు. ఒక దర్యాప్తు కమిషన్ వేసి వెంటనే నిజాలు నిగ్గు తేల్చండని మోదీని డిమాండ్ చేశారు.
కాంట్రాక్టర్లను పిలుచుకొని కమీషన్లు మాట్లుడుకొని..
దేశ ప్రజలకు నిజాలు తెలియాల్సిన అవసరం ఉందని ఆమె చెప్పుకొచ్చారు. రోజుకు రెండు టీఎంసీలు ఎత్తి పోసే అనుమతి ఉందని.. కానీ కానీ మూడేళ్లలో 50 టీఎంసీలు కూడా ఎత్తి పోయలేదని తెలిపారు. రెండు టీఎంసీలుగా ఉన్న ప్రాజెక్టుకు మూడో టీఎంసీ ఎందుకన్నారు. అక్కరకు రాని ప్రాజెక్టుకి మూడు టీఎంసీలు ఎత్తి పోయడం ఎందుకంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఅర్ కి డబ్బు అవసరం కాబట్టి ఇప్పుడు 3 వ టీఎంసీ అంటూ ప్రతిపాదన పెట్టారన్నారు. మూడో టీఎంసీకి టెండరింగ్ ఎక్కడ జరిగిందని, గ్లోబల్ టెండరింగ్ ఎందుకు జరగలేదని ఆమె కేసీఆర్ ను ప్రశ్నించారు. ప్రగతి భవన్ లోనే టెండర్లు వేశారా అంటూ కామెంట్లు చేశారు. కాంట్రాక్టర్లను పిలిచి కమీషన్ లు మాట్లాడుకొని అనుమతి ఇచ్చారా అని అన్నారు. మీ నంబర్లు రాసుకొని అధికార దుర్వినియోగానికి పాల్పడిన మాట వాస్తవమన్నారు.
రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఏమయ్యాయి అని సీఎం కేసీఆర్ ను అడగండంటూ గోదావరి ఖని ప్రజలకు తెలిపారు. సీఎం కేసీఆర్ కు ఏది చేతకాదు కానీ.. తప్పించుకు తిరగడం మాత్రం చేతనవుతుందంటూ విమర్శించారు. ప్రజల డబ్బుతో ఇప్పుడు బంది పోట్ల రాష్ట్ర సమితి పార్టీ పెట్టాడన్నారు. డొక్కు స్కూటర్ లో తిరిగే కేసీఅర్... విమానాలు కొనే స్థాయికి ఎలా చేరుకోగలిగాడన్నారు. మోడీ రాష్ట్రానికి వస్తె అవినీతిపై అడుగుతాడని కేసీఅర్ కి భయం అంటూ వ్యాఖ్యానించారు. కేసీఅర్ ఒక అహంకారి అని, ఒక నియంత అంటూ నోటికొచ్చినట్లు మాట్లాడారు. ముందు జాగ్రత్తగా కేసీఆర్ సీబీఐను సైతం నిషేదించారంటూ తీవ్ర విమర్శలు చేశారు.