Sanjay Raut:
హింసించారు: సంజయ్ రౌత్
సాఫ్ట్‌గా మారిపోయారనుకున్న సంజయ్ రౌత్ మరోసారి ఫైర్ అయ్యారు. తనను జైల్‌లో దారుణంగా టార్చర్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని కచ్చితంగా ప్రధాని మోడీని కలిసి చెబుతానని వెల్లడించారు. "నన్ను జైల్లో చిత్రహింసలు పెట్టారు. త్వరలోనే ప్రధాని మోడీ, కేంద్రమంత్రి అమిత్‌షా, డిప్యుటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్‌ను కలుస్తాను. నాకు ఎలాంటి చేదు అనుభవాలు ఎదురయ్యాయో వివరిస్తాను" అని స్పష్టం చేశారు. ABP Newsకి ప్రత్యేకంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు వెల్లడించారు సంజయ్ రౌత్. పత్రా చాల్ స్కామ్ గురించి కూడా ఈ సందర్భంగా ప్రస్తావించారు. "నన్ను అన్యాయంగా అరెస్ట్ చేశారు. పత్రా చాల్ స్కామ్‌కి నాకు ఎలాంటి సంబంధం లేదు. కోర్టు నిర్ణయాన్ని నేను స్వాగతిస్తున్నాను" అని చెప్పారు. "నా తప్పేమీ లేదు. కేవలం మహారాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న ఉద్దేశంతోనే నన్ను జైల్లో పెట్టారు" అని అన్నారు. "జాయింట్ పార్లమెంటరీ కమిటీ లేదా మాజీ సీజేఐ యూయూ లలిత్ నేతృత్వంలోని ప్యానెల్ ఈ అక్రమ అరెస్ట్‌లపైతప్పకుండా విచారణ చేపట్టాలి. ఈ మధ్య కాలంలో రాజకీయ విభేదాల కారణంగా అరెస్ట్‌లు జరుగుతున్నాయి" అని తెలిపారు. వచ్చే శీతాకాలం సమావేశంలో ఈ అరెస్ట్‌లపై చర్చించేందుకు ప్రతిపక్షం సిద్ధంగా ఉందని వెల్లడించారు. "రాజ్యాంగాన్ని గౌరవిస్తూ దేశం నడుచుకోవాలి. దాన్ని పరిరక్షించుకోవడం అందరి బాధ్యత. కానీ..ఈ మధ్య రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారు" అని వ్యాఖ్యానించారు.
సాఫ్ట్ కామెంట్స్..
నిజానికి..జైలు నుంచి బయటకొచ్చిన వెంటనే శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ కేంద్రంపై విరుచుకు పడతారని భావించారంతా. ఈడీ తనపై అక్రమంగా అభియోగాలు మోపిందని విమర్శిస్తారనీ అనుకున్నారు. కానీ ఆయన మాత్రం..చాలా కూల్‌గా మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వాన్ని పల్లెత్తు మాట కూడా అనలేదు. పైగా తనకు ఎవరిపైనా కోపం లేదని శాంతంగా మాట్లాడారు. ఇదంతా ఒక ఎత్తైతే...డిప్యుటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్‌ను పొగడటమే కాకుండా ఆయనను కలుస్తానని కూడా చెప్పటం మరో ట్విస్ట్. ఠాక్రే ప్రభుత్వాన్ని కుప్ప కూల్చింది బీజేపీయేనని అంతలా విరుచుకు పడిన సంజయ్ రౌత్, ఇప్పుడింత సాఫ్ట్‌గా ఎందుకు మారారన్నదే ఆసక్తికర ప్రశ్న. నిజానికి...ఠాక్రే వర్గంలో బీజేపీపై గట్టిగా విమర్శలు చేసింది సంజయ్ రౌత్ మాత్రమే. ఠాక్రే కన్నా ఎక్కువగా స్పందిస్తూ తన స్వరం వినిపించారు. కానీ...జైలుకెళ్లొచ్చాక మాత్రం ఈ వైఖరిలో మార్పు వచ్చిందని ఆయన మాటల్లోనే స్పష్టమవుతోంది. కానీ..ఇప్పుడు మరోసారి తన స్వరం పెంచారు. తనను కుట్ర పన్ని ఈ స్కామ్‌లో ఇరికించారని ఆరోపించారు. ఎవరిపైనా నేరుగా విమర్శలు చేయనని, ప్రభుత్వం మారాకే ఇదంతా జరిగిందని గుర్తు చేశారు. ప్రభుత్వం కొన్ని మంచి నిర్ణయాలు తీసుకుందని, వాటిని తప్పకుండా ఆహ్వానిస్తానని చెప్పారు. ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవార్‌ను కూడా కలుస్తానని వెల్లడించారు. పత్రా చాల్ స్కామ్ కేసులో భాగంగా ఆయనను ఈడీ అధికారులు మూడు నెలల క్రితం అరెస్ట్ చేశారు.
Also Read: Delhi MCD Elections: రాసి పెట్టుకోండి బీజేపీకి 20 కన్నా తక్కువే సీట్లు వస్తాయి - అరవింద్ కేజ్రీవాల్