Delhi MCD Elections:


బీజేపీవి అబద్ధపు హామీలు..


ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేశారు ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్. "కేజ్రీవాల్ 10 హామీలు" పేరిట ఈ జాబితాను ప్రకటించారు. "ఇచ్చే హామీలు కచ్చితంగా నెరవేరుస్తాం. మా మాట ఫెవికాల్ లాంటిది. అంత సులువుగా ప్రామిస్‌ను బ్రేక్ చేయం" అని స్పష్టం చేశారు కేజ్రీవాల్. బీజేపీ ప్రామిసరీ నోట్‌ విడుదల చేసినప్పటికీ...అందులో ఓ క్లారిటీ లేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌కు ఒక్క పైస కూడా ఇవ్వలేదని మండి పడ్డారు. కేవలం తనను నిందించటం తప్ప కేంద్రానికి మరో పని లేదని అన్నారు. ఈ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి 20 కన్నా తక్కువ సీట్లు వస్తాయని జోస్యం కూడా చెప్పారు. "ఈ ఎన్నికల్లో బీజేపీ 20 కి మించి సీట్లు రావు. కావాలంటే రాసిస్తాను" అని మీడియా సమావేశంలో వెల్లడించారు కేజ్రీవాల్. కేవలం ఢిల్లీ అభివృద్ధిని అడ్డుకునేందుకు అవినీతి ఆరోపణలు చేస్తున్నారని బీజేపీని విమర్శించారు. ఢిల్లీలో కుప్పలుగా పేరుకుపోతున్న చెత్త కొండల్ని తొలగిస్తామని బీజేపీ నేతలు హామీ ఇచ్చినా..
అవేవీ నెరవేరలేదని గుర్తు చేశారు. బీజేపీ ఇచ్చేవన్నీ అబద్ధపు హామీలని...మార్కెట్లలో ఎక్కడ వేసిన చెత్త అక్కడే ఉంటోందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం డబ్బులివ్వకపోవటం వల్లే చెత్త సమస్యను పరిష్కరించలేకపోయామని కేంద్రం చెప్పటం సిగ్గు చేటు అని మండి పడ్డారు. భారత దేశ చరిత్రలో ఇలాంటి వ్యాఖ్యలు చేసిన ప్రభుత్వం ఇదేనని అన్నారు. 


కేజ్రీవాల్ ఇచ్చిన 10 హామీలివే..


1. ఢిల్లీని సుందరంగా తీర్చిదిద్దడం
2. చెత్త కొండలను కరిగించడంతో పాటు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌ను అవినీతి రహితంగా మార్చడం
3. పార్కింగ్ సమస్యలు పరిష్కరించడం. 
4. వీధి కుక్కల బెడద తీర్చడం
5. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న రోడ్లన్నింటినీ బాగు చేయడం
6. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అన్ని పార్క్‌లను అందంగా మార్చడం 
7. స్కూల్స్‌, ఆసుపత్రుల్లో వసతులను సమీక్షించడం
8. తాత్కాలిక ఉద్యోగులను పర్మినెంట్ చేయడం
9. వ్యాపారులకు ఆన్‌లైన్‌లోనే లైసెన్స్‌లు జారీ 
10. వీధి వ్యాపారుల కోసం ప్రత్యేకంగా స్వచ్ఛమైన వెండింగ్ జోన్స్‌ల ఏర్పాటు