మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విద్యార్థులకు ఉపయోగకరంగా ఉండే విధంగా ఇంటర్మీడియేట్ విద్యలో గణనీయమైన మార్పులు తేవాలని తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు నిర్ణయించింది. జాతీయ పరీక్షల సిలబస్‌ను ఇంటర్ సిలబస్‌లో మార్పులు తీసుకురావడంతోపాటు బోధన ప్రణాళికను సమూలంగా మార్చేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేయాలని తీర్మానించింది. సిలబస్ మార్పు, కొత్త సిలబస్ ఖరారుకు పాలకమండలి ఆమోదం లభించింది. నవంబరు 11న జరిగిన ఇంటర్ బోర్డ్ సమావేశానికి విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, కాలేజీ విద్య కమిషనర్ నవీన్ మిత్తల్, ఉస్మానియా, జేఎన్‌టీయూహెచ్, కాకతీయ, తెలంగాణ విశ్వవిద్యాలయాల ఉప కులపతులు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
ఈ సమావేశంలో మొత్తం 111 అంశాలపై చర్చించారు. ప్రధానంగా ప్రైవేటు కాలేజీల అనుబంధ గుర్తింపు, కోర్సుల్లో తీసుకు రావాల్సిన మార్పులు, పాలనపరమైన ఆలస్యాలను నివారించడంపై సమావేశం దృష్టి పెట్టింది. ఈ సందర్భంగా కోవిడ్ పరిణామాల నేపథ్యంలో ఇంటర్ విద్యలో చోటు చేసుకున్న మార్పులపై మంత్రి అధికారుల ద్వారా తెలుసుకున్నారు. ఈ ఏడాది ఇంటర్ ఫలితాల మెరుగుకు తీసుకోవాల్సిన చర్యలను సూచించారు.
సమావేశం అనంతరం మంత్రి సబితా ఇంద్రారెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ..
➛ ఇంటర్ పాఠ్య పుస్తకాలను సకాలంలో అందించేందుకు వెంటనే టెండర్లు పిలవాలని నిర్ణయించామన్నారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా గృహ, వాణిజ్య సముదాయాల్లోని( మిక్స్‌డ్ ఆక్యుపెన్సీ) ప్రైవేట్ కళాశాలలకు ఒకటీ రెండేళ్ల పాటు అగ్నిమాపక శాఖ ఎన్‌ఓసీ నుంచి మినహాయింపు ఇవ్వాలని భావిస్తున్నామని, దీనిపై హోంమంత్రితో మాట్లాడామన్నారు.
➛ ఇక నుంచి ప్రతి ఏటా మే నెలాఖరు నాటికి అనుబంధ గుర్తింపు ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. పరీక్ష ఫీజును పెంచడం లేదని స్పష్టంచేశారు. ప్రయోగాత్మకంగా ఆన్‌లైన్ మూల్యాంకనాన్ని ప్రారంభిస్తామని ద్వితీయ భాష సబ్జెక్టులైన తెలుగు, హిందీ, ఉర్దూలకు అమలు చేస్తామని చెప్పారు. ఆఫ్‌లైన్‌లోనూ పరిశీలించి లోటుపాట్లను సరిదిద్ది వచ్చే సంవత్సరం నుంచి పూర్తి స్థాయిలో అమలు చేస్తామన్నారు.
పాఠ్యాంశాల్లో మార్పులు..
➛ కాలానికి అనుగుణంగా ఇంటర్ విద్య కోర్సుల్లో మార్పులు తేవాల్సిన అవసరం ఉందని మంత్రితో సహా, అధికారులూ భావించారు. ఈ దిశగా చేపట్టాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించారు. ఇప్పటికీ ఇంటర్ కోర్సుల్లో సంబంధం లేని సబ్జెక్టులున్నాయని, వీటిని మార్చాల్సిన అవసరం ఉందని ఇంటర్ బోర్డ్ అధ్యయన నివేదికల్లో వెల్లడైన అంశాలపై చర్చించారు. ఈ క్రమంలో వచ్చే ఏడాది నుంచి ఇంటర్‌లోని గ్రూపుల నవీనీకరణకు నిపుణులతో కూడిన కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
➛ ఇంటర్‌లో ఉండే తెలుగు, హిందీ ఇతర భాషల్లో నైతిక విలువలు పెంపొందించే దిశగా మార్పులు తేవాలని తీర్మానించారు. ఎంఈసీ, ఎంపీసీ గ్రూపులకు ఒకే విధమైన గణిత సబ్జెక్టులున్నాయని, వాస్తవానికి మ్యాథ్స్ విద్యార్థులతో సమానంగా ఎంఈసీ విద్యార్థులకు మ్యాథ్స్ ఉండాల్సిన అవసరం లేదని బోర్డ్ భావించింది.
➛ కామర్స్‌కు ఉపయోగపడే మ్యాథమెటిక్స్‌కు సబ్జెక్టులో ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని గుర్తించారు. సీఈసీ గ్రూపులో సివిక్స్ కన్నా అకౌంటెన్సీకి ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు. హెచ్‌ఈసీలో సివిక్స్ స్థానంలో పొలిటికల్ సైన్స్ సబ్జెక్టులో లోతైన అవగాహన పెంచేలా మార్పు చేయాలని బోర్డ్ ప్రతిపాదించింది.
మే లోగా కాలేజీలకు అఫిలియేషన్లు..
ప్రైవేటు ఇంటర్మీడియెట్ కాలేజీలకు బోర్డ్ గుర్తింపు ప్రక్రియ కొన్నేళ్ళుగా విమర్శలకు గురవ్వడంపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. కాలేజీలు తెరిచి నెలలు గడుస్తున్నా అనుబంధ గుర్తింపు పెండింగ్‌లో పెట్టడం, ఆ తర్వాత అన్ని కాలేజీలకు ఇవ్వడం సర్వసాధారణమైందని సమావేశంలో పలువురు ప్రస్తావించారు. అనుబంధ గుర్తింపు ఇచ్చే క్రమంలో గతంలో పెద్ద ఎత్తున ముడుపులు చేతులు మారాయన్న విమర్శలపైనా చర్చించారు. వీటన్నింటికీ పరిష్కారంగా కాలేజీలు తెరిచే నాటికే అనుబంధ గుర్తింపు ప్రక్రియ పూర్తి చేయాలని, మేలోనే గుర్తింపు ఇచ్చేదీ లేనిదీ స్పష్టంగా తెలపాల్సిన అవసరం ఉందని మంత్రి అధికారులకు సూచించారు. వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో బయోమెట్రిక్ హాజరు విధానాన్ని తప్పనిసరిగా అమలు చేసేందుకు చర్యలు చేపట్టాలని బోర్డ్ నిర్ణయించింది. దివ్యాంగ విద్యార్థులకు పరీక్ష రాసే అదనపు సమయాన్ని అరగంట నుంచి గంటకు పెంచాలని బోర్డ్ తీర్మానించింది. వచ్చే ఏడాది నుంచి ఆ్లనన్‌లో జవాబు పత్రాల మూల్యంకనం చేపట్టాలని, తొలుత లాంగ్వేజెస్‌ను ప్రయోగాత్మకంగా మూల్యంకన చేయాలని నిర్ణయించారు.
కాలేజీలు తెరిచే నాటికే పుస్తకాలు..
ఇంటర్ కాలేజీలు తెరిచే నాటికే విద్యార్థులకు పుస్తకాలు అందుబాటులో ఉండాలని బోర్డ్ నిర్ణయం తీసుకుందని మంత్రి సబిత ఇంద్రారెడ్డి తెలిపారు. బోర్డ్ సమావేశం ముగిసిన తర్వాత ఆమె మీడియాతో మాట్లాడారు. పేపర్ సకాలంలో అందని కారణంగా పాఠ్యపుస్తకాల ముద్రణ ఈ ఏడాది ఆలస్యమైందని తెలిపారు. వచ్చే ఏడాదికి కావాల్సిన పుస్తకాలకు టెన్త్ పరీక్షలు ముగిసిన వెంటనే ఆర్డర్లు ఇవ్వాలని నిర్ణయించామన్నారు. ప్రైవేటు అనుబంధ గుర్తింపుల విషయంలోనూ ఆలస్యం తగదని సూచించినట్టు తెలిపారు. కొన్ని కాలేజీల కోసం ఈ ప్రక్రియ కొనసాగించడం సరికాదని ఆమె అభిప్రాయపడ్డారు.
మరిన్ని నిర్ణయాలు ఇవీ...
➔ వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ ఇంగ్లిష్ సబ్జెక్టులోనూ 20 శాతం మార్కులను ప్రాక్టికల్స్‌కు కేటాయించనున్నట్లు పాలకమండలి తెలిపింది. రాత పరీక్షను 80 మార్కులకే పరిమితం చేస్తామని పేర్కొంది. విద్యార్థుల్లో కమ్యూనికేషన్ నైపుణ్యాలు పెంచేందుకు ఇంగ్లిష్ లాంగ్వేజ్ ల్యాబ్‌లను ఏర్పాటు చేసి ప్రాక్టికల్స్‌ను అమలు చేస్తామని చెప్పింది.
➔ ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో సిబ్బంది, విద్యార్థులకు బయోమెట్రిక్ హాజరును ఈ విద్యా సంవత్సరమే అమలు చేయాలని నిర్ణయించింది.
➔ ఎంపీసీ గ్రూపు రెండో ఏడాది గణితం- 2బిలో ఎక్కువ మంది విద్యార్థులు తప్పుతున్నారు. సిలబస్ అధికంగా, కఠినంగా ఉందనే భావన ఉంది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది కొంత మేర సిలబస్ తగ్గిస్తారు. అందుకు ఓ కమిటీని నియమిస్తారు.
➔ ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్‌కు అనుగుణంగా నీట్, క్లాట్ తదితర పోటీ పరీక్షలకు ఉపయోగపడేలా సిలబస్ రూపొందిస్తారు.
➔ వచ్చే విద్యా సంవత్సరం(2023-24) ప్రథమ, 2024-25లో ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ద్వితీమ భాష సబ్జెక్టుల సిలబస్ మారుస్తారు. నైతికతను పెంచే పాఠాలకు అధిక ప్రాధాన్యం ఇస్తారు.
➔ ఇంటర్ బోర్డులో 52 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటిని టీఎస్‌పీఎస్‌సీ ద్వారా భర్తీ చేస్తారు. ఒక్కో చోట మూడు ఉద్యోగాల చొప్పున 15 జిల్లాల్లోని నోడల్ అధికారుల కార్యాలయాల్లో జూనియర్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఆఫీస్ సబార్డినేట్ పోస్టులను భర్తీ చేస్తారు.
➔ కామర్స్‌ను కామర్స్ అండ్ అకౌంటెన్సీగా పిలుస్తారు.
➔ అంధులు, మూగ, చెవిటి విద్యార్థులకు ఇప్పటివరకు పరీక్షల్లో సాధారణ విద్యార్థుల కంటే 30 నిమిషాల సమయం అధికంగా ఇచ్చేవారు. దాన్ని 60 నిమిషాలకు పెంచుతారు. ఈ విద్యాసంవత్సరం నుంచే అమలు చేస్తారు.
నిబంధనలు మీరితే జరిమానా మూడు రెట్లకు పెంపు..
అనుబంధ గుర్తింపు పొందని కళాశాలల్లోని విద్యార్థులను ప్రైవేట్‌గా పరీక్షలు రాయించే అంశాన్ని బోర్డు తిరస్కరించింది. ఆ విధానంలో బైపీసీ చదివే విద్యార్థులకు నీట్ రాసేందుకు అర్హత ఉండదని, ప్రాక్టికల్స్ చేయడం కూడా సమస్య అవుతుందని సమావేశం భావించినట్లు తెలిసింది. ప్రభుత్వ అనుమతి లేకుండా కళాశాలలను ఒక చోట నుంచి మరో చోటకు తరలించినా, అధిక సెక్షన్లు ప్రవేశపెట్టినా ఇప్పటివరకు ఉన్న జరిమానాను మూడు రెట్లు పెంచేందుకు బోర్డు ఆమోదం తెలిపింది. వచ్చే ఏడాదికి అనుబంధ గుర్తింపు, తనిఖీల ఫీజులను కూడా పెంచడానికి సమావేశం పచ్చజెండా ఊపింది.
Also Read:
TAFRC: ఇంజినీరింగ్ కాలేజీలకు స్ట్రాంగ్ వార్నింగ్, అలాచేస్తే ఫైన్ కట్టాల్సిందే!!
ఇంజినీరింగ్ కాలేజీలను తెలంగాణ అడ్మిషన్స్ అండ్ ఫీ రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్‌ఆర్‌సీ) హెచ్చరించింది. టీఏఎఫ్‌ఆర్‌సీ నిర్ణయించిన ఫీజుల కన్నా ఎక్కువ వసూలు చేస్తే జరిమానా తప్పదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. జీవో నంబర్ 37 ప్రకారం అందులో సూచించిన ఫీజుల కన్నా ఎక్కువ వసూలు చేయకూడదని, ఏ ఇతర రూపాల్లోనూ డబ్బులు వసూలు చేయకూడదని కాలేజీలకు తేల్చి చెప్పింది.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి..
మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..