Why Modi Meet Pawan : ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీతో మిత్రపక్షం జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమావేశం అయ్యారు. ప్రధాని మోదీతో రాజకీయ అంశాలపై పవన్ మాట్లాడారు. ఏం మాట్లాడారన్నది రహస్యంగానే ఉంటుంది. బయటకు చెప్పే వాటి కన్నా.. లోపల జరిగే చర్చలు ఎక్కువగా ఉంటాయి. అందుకే పపన్ పొడిపొడిగానే చెప్పారు. ఆయన చెప్పిన విషయాలను బట్టి లోపలేం చర్చించారో విశ్లేషించారో చెప్పడం కష్టం. అయితే ఇంత కాలం ప్రధాని మోదీ.. పవన్ కల్యాణ్‌ను కలవలేదు. పవన్ అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నించినా సాధ్యం కాలేదు. మరి ఇప్పుడే ఎందుకు కలిశారు? ప్రత్యేకంగా కలవాలని అపాయింట్మెంట్ అడగకపోయినా సమయం ఇచ్చి మరీ రావాలని ఎందుకు పిలిచారు ? రాజకీయంగా ఎలాంటి కీలక నిర్ణయాలు రెండు పార్టీలు తీసుకోబోతున్నాయి ?
పిలిచి మరీ సమయం ఇచ్చిన ప్రధానమంత్రి మోదీ !
మోదీని కలవాలని పవన్ అనుకోలేదు. కలుస్తానని అపాయింట్మెంట్ అడగలేదు. కానీ ప్రధానమంత్రి కార్యాలయం నుంచి జనసేన అధినేతకు సమాచారం వచ్చింది. శుక్రవారం సాయ్తంత్రం విశాఖలో కలుద్దామని సమాచారం పంపారు. ప్రధాని పిలిచారు కాబట్టి... తిరస్కరించే అవకాశం లే్దు. పవన్ వెళ్లారు. సమావేశం అయ్యారు. కానీ మోదీకి పవన్ ఇప్పుడే ఎందుకు గుర్తొచ్చారన్నది ఇప్పుడు కీలకమైన ప్రశ్న. ప్రధాని మోదీ గత నాలుగైదేళ్ల కాలంలో చాలా సార్లు ప్రధానితో భేటీ కావాలనుకున్నారు. తన కోసం కాదు.. జనసేన కోసం కూడా కాదు.. చేనేత కళాకారుల కోసం.. ఇతర వర్గాల సమస్యల కోసం కలుద్దామనుకున్నారు. వారందరికీ తాను ప్రధాని దగ్గరకు తీసుకెళ్తానని మాటిచ్చారు. కానీ అపాయింట్‌మెంట్ లభించకపోవడంతో తీసుకెళ్లలేకపోయారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్న తర్వాత చాలా సార్లు పవన్ కల్యాణ్ ఢిల్లీ వెళ్లారు. ప్రధాని అపాయింట్ కోసం ప్రయత్నించారు. కానీ ప్రయోజనం లేదు. తర్వాత పవన్‌కే విరక్తి పుట్టి అడగడం మానేశారు. కానీ ఇప్పుడు అనూహ్యంగా మోదీ పిలిచి మాట్లాడారు.
జనసేనను ఇప్పటి వరకూ కలుపుకునే ప్రయత్నం చేయని ఏపీ, తెలంగాణ బీజేపీ శాఖలు !
ఒక్క ప్రధాని మాత్రమే కాదు.. తెలుగు రాష్ట్రాలకు ఏ బీజేపీ ముఖ్య నేత వచ్చినా పవన్ కల్యాణ్‌ను పట్టించుకోలేదు. కనీస ప్రస్తావన తీసుకు రారు. బీజేపీ కార్యక్రమం అయినా పొత్తులో ఉన్నందున.. కనీసం ఆహ్వానించాలన్న ఆలోచన మాత్రం చేయరు. జేపీ నడ్డా వచ్చినా.. అమిత్ షా వచ్చినా.. మోదీ వచ్చినా అదే తీరు. దీంతో పవన్ కల్యాణ్‌ను ఉద్దేశపూర్వకంగా బీజేపీ అవమానిస్తోందన్న అభిప్రాయానికి జనసైనికులు ఎప్పుడో వచ్చారు.కానీై ఇప్పుడు మాత్రం అనూహ్యంగా పవన్ కల్యాణ్‌కు ఆహ్వానం పంపారు. తెలంగాణ పార్టీ నేతలు అయితే గ్రేటర్ ఎన్నికల్లో మద్దతు కోసం వచ్చి.. మొత్తం అభ్యర్థుల్ని ఉపసంహరించుకునేలా చేశారు. తీరా ఎన్నికలైన తర్వాత అవమానించారు. దీంతో గౌరవం లేని చోట ఉండలేనని తెలంగాణలో పొత్తును తెంపేసుకున్నారు. కొన్ని చోట్ల పోటీ చేసేందుకు ప్రణాళికలు సిద్దం చేసుకున్నారు. ఏపీలో కూడా దాదాపుగా అదే పరిస్థితి. సీఎం అభ్యర్థిగా తిరుపతి ఉపఎన్నికల సమయంలో ప్రకటించి.. తీరా తర్వాత మాత్రం అలాంటిదేమీ లేదన్నారు. అదే సమయంలో వైసీపీని గద్దె దించే విషయంలో పవన్ చూపిస్తున్న పట్టుదల బీజేపీలో కనిపించడం లేదు. దీంతో పవన్ దూరం జరిగే ఆలోచనలో ఉన్నారు. ఇలాంటి సమయంలో మోదీతో పిలుపు పవన్‌కు వచ్చింది.
దూరం జరుగుతున్న జనసేనను దగ్గరగా ఉంచుకునే ప్రయత్నమేనా ?
వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వాన్ని ఓడించడానికి ఓట్లు చీలకుండా చేస్తానని పవన్ కల్యాణ్ ప్రకటించారు. అంటే టీడీపీతో పొత్తు పెట్టుకుంటారన్న ప్రచారం ఊపందుకుంది. అయితే బీజేపీ నేతలు మాత్రం .. జనసేన తమతోనే ఉంటుందని గట్టిగా చెబుతున్నారు. జనసేనతో కలిసే ఎన్నికల్లో పోటీ చేస్తామని చెబుతున్నారు. కానీ రాష్ట్ర నేతల వ్యవహారంపై పవన్ కల్యాణ్‌కు అంత నమ్మకం లేదు. అందుకే మోదీ చెబితేనే వింటారని.. ఆయనతో చెప్పించేందుకు బీజేపీ నేతలు ఇలా పవన్ కల్యాణ్‌తో భేటీ ఏర్పాటు చేయించారన్న ప్రచారం కూడా జరుగుతోంది.
కారణం ఏదైనా .. పవన్ కల్యాణ్.. బీజేపీ ప్రధాని అభ్యర్థిగా మోదీని ఎంపిక చేసిన తర్వాత అహ్మదాబాద్ వెళ్లి కలిశారు. ఆ తర్వాత ఎన్నికల ప్రచారాల్లో కలిసి పాల్గొన్నప్పటికీ మళ్లీ కలవలేదు. ఎనిమిదేళ్ల తర్వాతే కలిశానని పవన్ చెబుతున్నారు. ఇలా కలవడం ఆషామాషీ కాదని.. అంతకు మించి నబ్జెక్ట్ ఉంటుందని .. అదేదో త్వరలో బయటకు వస్తుందని అంచనా వేస్తున్నారు.