Gujarat Congress Manifesto:


మేనిఫెస్టో విడుదల..


గుజరాత్ కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. అహ్మదాబాద్‌లో రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోట్ ఈ మేనిఫెస్టోను విడుదల చేశారు. పలువురు సీనియర్ అధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆరోగ్యం, విద్యా రంగాల ప్రైవేటీకరణకు స్వస్తి పలకడమే తమ పార్టీ లక్ష్యమని స్పష్టం చేసింది కాంగ్రెస్. మేనిఫెస్టోలో ఈ అంశానికే అధిక ప్రాధాన్యతనిచ్చింది. "గుజరాత్ ప్రజలు విద్య, ఆరోగ్య రంగాలను ప్రైవేటీకరణ చేయటాన్ని అంగీకరించరు. మనమంతా కలిసి మార్పు తీసుకొద్దాం. కాంగ్రెస్‌కు ఓటు వేయండి" అని కాంగ్రెస్ ట్వీట్ చేసింది. "జన్ ఘోష్ పత్ర" పేరిట విడుదల చేసిన మేనిఫెస్టోలో రాహుల్ గాంధీ ఇచ్చిన 8 హామీలను చేర్చింది. "గుజరాత్ యువత గౌరవంగా బతికేందుకు 10 లక్షల మందికి ఉపాధి కల్పించేందుకు సిద్ధంగా ఉన్నాం" అని స్పష్టం చేసింది కాంగ్రెస్ పార్టీ. పాత పెన్షన్ స్కీమ్‌ను అమలు చేయడంతో పాటు జనతా మెడికల్ స్టోర్స్‌ ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటు ధరలో మందులు అందిస్తామని హామీ ఇచ్చింది. ఈ ఎన్నికల్లో పార్టీ కచ్చితంగా 124 స్థానాల్లో విజయం సాధిస్తుందన్న నమ్మకముందని అశోక్ గహ్లోట్ ధీమా వ్యక్తం చేశారు. "గుజరాత్ ప్రజలు ఆమ్ఆద్మీ పార్టీకి మద్దతుగా నిలవరు" అని తేల్చి చెప్పారు.










8 అంశాలతో కూడిన మేనిఫెస్టోని రాహుల్ గాంధీ ఇటీవలే ప్రకటించారు. ట్విటర్ వేదికగా ఈ జాబితాను వెల్లడించిన రాహుల్..భాజపాపై విరుచుకుపడ్డారు. "భాజపా డబుల్ ఇంజిన్‌ సర్కార్ వంచన నుంచి మనల్ని కాపాడుకుందాం. రాష్ట్రంలో సరికొత్త మార్పులను తీసుకొద్దాం" 
అని స్పష్టం చేశారు. రూ.500 కే ఎల్‌పీజీ సిలిండర్, యువతకు 10 లక్షల ఉద్యోగాలు, రూ.3 లక్షల వరకూ రైతులకు రుణమాఫీ లాంటి హామీలను ట్వీట్ చేశారు రాహుల్. 


ఇవీ ఆ హామీలు..


1. గృహ వినియోగ సిలిండర్‌ను రూ.500కే అందించటం, 300 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ 
2. ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ పథకం అమలు
3. కేజీ నుంచి పీజీ వరకూ బాలికలందరికీ ఉచిత విద్య, రాష్ట్రంలో 3 వేల ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఏర్పాటు
4. యువతకు 10 లక్షల ఉద్యోగాలు, రూ.3000 నిరుద్యోగ భృతి
5. కరోనాతో మృతి చెందిన వాళ్ల కుటుంబానికి రూ.4 లక్షల ఆర్థిక సహకారం 
6. అత్యాధునిక వసతులతో కొత్త ప్రభుత్వ ఆసుపత్రుల నిర్మాణం, రూ.10 లక్షల వరకూ ఉచిత వైద్యం. 
7. రైతులకు రూ.3 లక్షల వరకూ రుణమాఫీతో పాటు, విద్యుత్ బిల్లుల మాఫీ
8. డ్రగ్ మాఫియాపై కఠిన చర్యలు


Also Read: ATS Raids in Gujarat: గుజరాత్‌లో భారీ ఎత్తున సోదాలు, పలువురి అరెస్ట్ - పీఎఫ్‌ఐతో లింక్‌లున్నాయా?