అన్ని సీజన్లలో అందరికీ అందుబాటులో ఉండేది అరటి పండ్లు. ఇది ఎంతో ఆరోగ్యకరమైనది, పోషకాలు నిండినది. తక్షణ శక్తి లభించేందుకు దీన్ని తరచూ తింటూ ఉంటారు. అయితే కొంతమంది పని హడావుడి, ఆఫీసు వర్క్ లో పడి అల్పాహారం తీసుకోకుండా ఒక అరటి పండు తినేస్తారు. ఆకలిని తగ్గిస్తుంది, జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది. ఇందులో పొటాషియం, ఫైబర్, మెగ్నీషియం ఉంటాయి. అయితే ఇది ఆల్ఫాహారంగా తీసుకోవడం మంచి ఎంపిక కాదని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. మనం తీసుకునే చెత్త అల్పాహార వస్తువుల్లో అరటి పండు ఒకటని అంటున్నారు. అందుకు కారణం అందులో 25 శాతం సహజ చక్కెరతో నిండి ఉండటమే.


అరటి పండు తినడం వల్ల తాత్కాలికంగా మాత్రమే పొట్ట నిండిన ఫీలింగ్ కలిగిస్తుంది. తర్వాత నిద్రగా అనిపించేలా చేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ అల్పాహారాన్ని ఆరోగ్యకరమైన కొవ్వుతో సమతుల్యం చేయకుండా ఇబ్బందులు తప్పవు. ఉదయాన్నే దీన్ని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి పెరిగే ప్రమాదం ఉందని అంటున్నారు. అలాగే ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థని నిర్వహించేందుకు కూడా ఇవి దోహదపడవని చెప్తున్నారు.


అందుకే పరగడుపున తినకూడదు


నిజానికి అరటి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. విటమిన్ బి 6 పొందేందుకు గొప్ప మూలం ఇది. మీడియం సైజు అరటి పండు తినడం వల్ల శరీరానికి కావలసిన విటమిన్ సి 10 శాతం పొందవచ్చు. అరటిపండులో మూడు సహజ చక్కెరలు ఉన్నాయి. సుక్రోజ్, ఫ్రక్టోజ్, గ్లూకోజ్.. ఇవి కొవ్వు, కొలెస్ట్రాల్ రహిత శక్తిని అందిస్తాయి. ఇందులో చక్కెర సహాజమైనప్పటికి ఆమ్ల స్వభావం కలిగి ఉండటం వల్ల శరీరానికి హాని చేస్తుంది. ఇందులోని షుగర్ వల్ల ఇతర ఆహారాలు తీసుకోవాలి అనే కోరికలు కలిగేలా చేస్తుంది. దీని వల్ల ఎక్కువగా తినాలని అనిపిస్తుంది. అప్పుడు ఊబకాయం బారిన పడిపోతారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం అరటి పండ్లని ఖాళీ కడుపుతో ఎప్పుడు తినకూడదు.


ఆరోగ్య ప్రయోజనాలు


అలా అని అరటి పండ్లు తినకూడదని అర్థం కాదు. దీని వల్ల బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇవి శరీరానికి ఆరోగ్యకరమైన కొవ్వులు, పోషకాలని అందిస్తాయి. తద్వారా రోజంతా యాక్టివ్ గా ఉంటారు. ఒక గ్లాసు పాలు, పీనట్ బటర్ లేదా ఉడికించిన గుడ్లుతో కలిపి అరటి పండ్లు తినొచ్చు.


ఎన్ని తినాలి?


మోతాదుకి మించి అరటి పండ్లు తినడం కూడా ఆరోగ్యానికి చేటు చేస్తుంది. రోజుకి ఒకటి లేదా రెండు పండ్లు తింటే సరిపోతుంది. అలాగే తిన్న తర్వాత గోరు వెచ్చని నీటిని తాగితే మంచిది. జలుబు చేయకుండా ఉంటుంది. అతిగా తినడం వల్ల మలబద్ధకం సమస్య వచ్చే అవకాశం ఉంది. మధుమేహులు వీటికి దూరంగా ఉండటమే మంచిది. పొటాషియం సమృద్ధిగా ఉండటం వల్ల హైపర్ కలేమియా అనే వ్యాధి వచ్చేలా చేస్తుంది. అంతే కాదు పొట్ట ఉబ్బరం, గ్యాస్ సమస్య వచ్చే సమస్యకి దారి తీస్తుంది. దంత క్షయ సమస్యలు రావొచ్చు. అందుకే మితంగా మాత్రమే దీన్ని తీసుకోవాలి.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.


Also Read: బరువు తగ్గేందుకు కూరగాయలు, పండ్లు తీసుకుంటే సరిపోదంటున్న నిపుణులు