పంచ్ కోసం డైలాగ్ రాయాలా? సన్నివేశంలో భావాన్ని చెప్పే డైలాగ్‌లో పంచ్ ఉంటే బావుంటుందా? కంటెంట్ కన్వే చేసే మాటలో పంచ్ ఉంటే బావుంటుంది. 'యశోద' (Yashoda Movie)లో మాటలు అలాగే ఉన్నాయని ప్రేక్షకులు, విమర్శకులు చెబుతున్నారు. సమంత తాజా సినిమాలో సంభాషణలకు సర్వత్రా ప్రశంసలు లభిస్తున్నాయి. ఈ సినిమాలో డైలాగులను సీనియర్ జర్నలిస్టులు పులగం చిన్నారాయణ, డా. చల్లా భాగ్యలక్ష్మి రాశారు. 


గీత దాటని 'యశోద' మాట
సాధారణంగా థ్రిల్లర్ సినిమాల్లో సంభాషణలకు పేరు రావడం చాలా అంటే చాలా అరుదు. సినిమా చూసే ప్రేక్షకుడికి గానీ, తీసే దర్శక - నిర్మాతలకు గానీ థ్రిల్ మీద ఎక్కువ కాన్సంట్రేషన్ ఉంటుంది. మాట మీద కాదు. 'యశోద' లాంటి ఎమోషనల్ థ్రిల్లర్‌లో మాటలు ప్రేక్షకుల మనసుల్లో బలమైన ముద్ర వేశాయి. అలాగని, ఏ సన్నివేశంలోనూ డైలాగులు డామినేట్ చేయలేదు. కథ, కథలో పాత్రలతో పాటు మాటలు ముందుకు వెళ్లాయి. 


'యశోద'లో... ఓ సన్నివేశంలో ఉన్ని ముకుందన్ మీద సమంత (Samantha) గన్‌తో గురి పెడతారు. 'ధైర్యం ఉంటే ముందుకు రారా' అని మరో నటుడు అంటే... సామ్ 'ధైర్యం మగాడికి మాత్రమే ఉంటుందా?' అని చెబుతారు. థియేటర్లలో ఆ మాటకు విజిల్స్ పడ్డాయి. గన్ గురి పెట్టింది మహిళ అనే విషయంతో పాటు ఆమె ధైర్యాన్ని హైలైట్ చేసేలా ఆ మాట ఉంది.
 
మరో సన్నివేశంలో వరలక్ష్మీ శరత్ కుమార్ ''రాజు కావాలంటే యుద్ధం చేయాలి. రాణి కావాలంటే రాజును గెలిస్తే చాలు'' అని చెబుతారు. ఇప్పుడు ఆ మాట గురించి వివరంగా చెబితే... ట్విస్ట్ రివీల్ అవుతుంది. సినిమా చూసిన వాళ్ళకు అందులో ఎంత లోతైన భావం ఉందో తెలుస్తుంది. ఐఫోన్ కోసం కిడ్నీలు అమ్ముకున్న వ్యక్తుల గురించి వార్తల్లో చదివే ఉంటాం. యువతలో ఐఫోన్ మీద ఉన్న క్రేజ్‌ను సినిమాలో సందర్భోచితంగా చెప్పిన విధానం సమాజంలో పరిస్థితులను కళ్ళకు కట్టినట్టు చెబుతుంది. సినిమా చివర్లో పోలీస్ స్టేషన్ ఓపెనింగ్‌కు వెళ్లిన రావు రమేశ్, ఆ తర్వాత చెప్పే డైలాగుల్లో చిన్న ఫన్ ఉంటుంది. 


గీత దాటకుండా, డైలాగులు డామినేట్ చేశాయనే కంప్లైంట్ లేకుండా... ప్రతి మాట సన్నివేశానికి, సినిమాకు ఉపయోగపడేలా ఉన్నాయని ప్రేక్షకులు, పరిశ్రమలో ప్రముఖులు పులగం చిన్నారాయణ, డా. చల్లా భాగ్యలక్ష్మిని ప్రశంసిస్తున్నారు. 


మూడు నందులు...
ఎనిమిది పుస్తకాలు!
సీనియర్ జర్నలిస్టుగా పులగం చిన్నారాయణ (Pulagam Chinnarayana) పరిశ్రమకు సుపరిచితులే. ఇంతకు ముందు నట సింహం నందమూరి బాలకృష్ణ 'పైసా వసూల్'లో 'పద మరి' పాట రాశారు. గోపీసుందర్, అనూప్ రూబెన్స్, యువన్ శంకర్ రాజా, ఆర్పీ పట్నాయక్ సంగీతంలో 'మహేష్', 'జనతా హోటల్', 'మనలో ఒకడు', 'శుభలేఖ + లు' సినిమాల్లో పాటలు రాశారు. ఛార్మి కౌర్ ప్రధాన పాత్రలో నటించిన 'ప్రేమ ఒక మైకం'కు ఆయన మాటలు రాశారు. సత్యదేవ్ 'బ్లఫ్ మాస్టర్'లో డైలాగులు రాశారు. ఆ రెండు సినిమాల్లో మాటలకు మంచి పేరు వచ్చింది. ఇప్పటివరకు చిన్నారాయణ ఎనిమిది పుస్తకాలు రాశారు. 'ఆనాటి ఆనవాళ్లు', 'పసిడి తెర' పుస్తకాలకు ఆయన నంది అవార్డులు అందుకున్నారు. 2014లో ఉత్తమ విమర్శకుడిగా మరో నంది అందుకున్నారు. 


Also Read : 'యశోద' రివ్యూ : అసలు కథ వేరే బాస్ - సమంత షీరోయిజం ఎలా ఉందంటే?


డా. చల్లా భాగ్యలక్ష్మి (Dr Challa Bhagyalakshmi) ఇప్పటివరకు వందకు పైగా పాటలు రాశారు. ఉపేంద్ర 'ఐ లవ్ యు', విశాల్ 'ఒక్కడొచ్చాడు', ధనుష్ 'మిస్టర్ కార్తీక్', ప్రభుదేవా 'మై డియర్ భూతం' సినిమాల్లో అన్ని పాటలూ ఆవిడే రాశారు. సింగిల్ కార్డ్ లిరిసిస్ట్ అన్నమాట. విశాల్ 'డిటెక్టివ్'లో పాట ఆమెకు మంచి పేరు తీసుకొచ్చింది. మాటల రచయితగా 'యశోద' ఆవిడకు తొలి సినిమా. ఇంతకు ముందు 'వర్కవుట్ అయ్యింది' వెబ్ సిరీస్‌కు మాటలు రాశారు. తెలుగు, తమిళ సినిమా పాటల్లో బాంధవ్యాలు అంశంపై డాక్టరేట్ చేశారు. నంది అవార్డు కమిటీ సభ్యుల్లో లేడీ లిరిసిస్ట్‌గా స్థానం పొందిన తొలి మహిళ భాగ్యలక్ష్మి.