Family Pension Rules: మన దేశంలో లక్షలాది మంది పదవీ విరమణ ప్రభుత్వ ఉద్యోగులు, పింఛను మీద ఆధారపడి జీవనం గడుపుతున్నారు. వీళ్ల తదనంతరం కుటుంబ సభ్యులకు కూడా ఆర్థిక భరోసా అందుతోంది.


కేంద్ర ప్రభుత్వ కుటుంబ పింఛను పొందడానికి గతంలోలా ఇప్పుడు పెద్ద తతంగం అవసరం లేదు. ఒకవేళ, కుటుంబ పింఛను అందుకోవాల్సిన కుటుంబ సభ్యుడి వ్యక్తి పేరు ప్రభుత్వ పత్రాలలో లేకపోయినా హైరానా పడాల్సిన పని లేదు. సాంకేతికత పెరిగిన ఈ కాలంలో అన్ని పనులు సులువుగా జరిగి పోతున్నాయి. పత్రాల్లో పేరు లేని వ్యక్తి కూడా ఇబ్బంది లేకుండా కుటుంబ పింఛను కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకోసం కొత్త మార్గదర్శకాలు విడుదలయ్యాయి.


డిపార్ట్‌మెంట్ ఆఫ్ పెన్షన్స్ అండ్ పెన్షనర్స్ వెల్ఫేర్ (DoPPW), ఈ ఏడాది అక్టోబర్ 26న ఆఫీస్ ఆఫ్ మెమోరాండం విడుదల చేసింది. అధికారిక రికార్డులో ఒక కుటుంబ సభ్యుడి పేరు లేకపోయినా కుటుంబ పింఛను కోసం ఎలా దరఖాస్తు చేయాలి అన్న ఫారం-4కు సంబంధించిన విషయాన్ని వివరించింది. 


ఫారం-4 అంటే ఏమిటి?
కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిబంధనల ప్రకారం.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫారం 4 తప్పనిసరి. అందులో ఉద్యోగి కుటుంబ సభ్యుల వివరాలు ఉంటాయి. ఈ ఫామ్‌ పూరించిన తర్వాత దానిని డిపార్ట్‌మెంట్ ఆఫ్ పెన్షన్స్ అండ్ పెన్షనర్స్ వెల్ఫేర్ ప్రధాన కార్యాలయంలో సమర్పించాలి.


కుటుంబ పింఛను ప్రయోజనాలను ఎవరు పొందుతారు?
1. ఈ పింఛన్‌ను క్లెయిమ్ చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగి భార్య లేదా భర్త. ఇది కాకుండా, చట్టబద్ధంగా విడిపోయిన ఉద్యోగి భార్య లేదా భర్త కూడా పింఛను ప్రయోజనం పొందవచ్చు.
2. ఉద్యోగి కుమారుడు లేదా కుమార్తె కుటుంబ పింఛను తీసుకోవడానికి అర్హులో కాదో అన్న విషయాన్ని ఫారం 3 సమర్పించిన తేదీ కూడా నిర్ణయిస్తుంది. మరణించిన లేదా విడాకులు తీసుకున్న భార్య అయినా, సంతానం వివరాలు సమర్పించడం కూడా తప్పనిసరి.
3. ఉద్యోగి తల్లిదండ్రులు కూడా ఈ కుటుంబ పింఛను క్లెయిమ్ చేయవచ్చు.
4. వికలాంగులైన ఉద్యోగి తోబుట్టువులు కుటుంబ పింఛను కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.


కేంద్ర ప్రభుత్వ కుటుంబ పింఛను పొందేందుకు, ప్రభుత్వ ఉద్యోగి కుటుంబ సభ్యులకు సంబంధించిన అన్ని వివరాలను అందించాలి. వారు కుటుంబ పింఛనుకు అర్హులా కాదా సంబంధింత ఫారమ్‌లో వివరించాలి. ప్రభుత్వ ఉద్యోగి, తన పిల్లల వివాహం సహా తన కుటుంబ సభ్యుల సంఖ్యలో హెచ్చుతగ్గులను ఎప్పటికప్పుడు ప్రధాన కార్యాలయానికి తెలిజేస్తూ ఉండాలి. నిబంధనల ప్రకారం.. సదరు ఉద్యోగి ఫారమ్‌ను సరిగ్గా పూరించారో లేదో కూడా ప్రధాన కార్యాలయం తనిఖీ చేసి, ధృవీకరిస్తుంది. ఈ ధృవీకరణ తర్వాత మాత్రమే ఉద్యోగి కుటుంబంలోని హక్కుదారులకు కుటుంబ పింఛను అందుతుంది.


ఫారం-4లో కుటుంబ సభ్యుడి పేరు లేకపోతే?
ఒక కుటుంబ సభ్యుడి పేరును ఫారం 4లో చేర్చని సందర్భంలో, ప్రభుత్వ ఉద్యోగి మరణించిన తర్వాత కుటుంబ పింఛనును ఆ కుటుంబ సభ్యుడు అందుకోగలడా అంటే, ముమ్మాటికీ అవకాశం ఉంది. అతను కుటుంబ పింఛను క్లెయిమ్ చేయవచ్చు. కొత్త మార్గదర్శకాల ప్రకారం.. కుటుంబ సభ్యుడి దరఖాస్తు పట్ల DoPPW కార్యాలయం సంతృప్తి చెందితే, ఆ క్లెయిమ్‌ను తిరస్కరించరు. 


ఒక ప్రభుత్వ ఉద్యోగి పదవీ విరమణకు ముందు పింఛను పత్రాలతో పాటు ఫారం 4ను కూడా తాజాగా సమర్పించాలి. ప్రభుత్వ ఉద్యోగి కుటుంబ సభ్యుల వివరాలను సమగ్రంగా ఈ ఫారమ్‌లో సమర్పించాలి. ఒకవేళ పదవీ విరమణ తర్వాత పునర్వివాహం చేసుకున్నా, బిడ్డకు జన్మనిచ్చినా అతను ఈ విషయాన్ని DoPPW కార్యాలయానికి తప్పకుండా తెలియజేయాలి.