సినిమా రివ్యూ : యశోద
రేటింగ్ : 3/5
నటీనటులు : సమంత, ఉన్ని ముకుందన్, వరలక్ష్మి శరత్ కుమార్, రావు రమేశ్, మురళీ శర్మ, సంపత్ రాజ్, సంపత్ రాజ్, శత్రు, మధురిమ, కల్పికా గణేష్, దివ్య శ్రీపాద, ప్రియాంకా శర్మ, ప్రీతి అస్రాణి తదితరులు
మాటలు : పులగం చిన్నారాయణ, డా. చల్లా భాగ్యలక్ష్మి
పాటలు: రామజోగయ్య శాస్త్రి
ఛాయాగ్రహణం : ఎం. సుకుమార్
సంగీతం: మణిశర్మ
సహ నిర్మాత: చింతా గోపాలకృష్ణారెడ్డి
నిర్మాత : శివలెంక కృష్ణప్రసాద్
దర్శకత్వం : హరి శంకర్, హరీష్ నారాయణ్
విడుదల తేదీ: నవంబర్ 11, 2022


'యశోద' (Yashoda) కోసం సమంత (Samantha) ఎంతో కష్టపడ్డారు. ప్రాణం పెట్టి సినిమా చేశారు. డూప్, రోప్స్ లేకుండా యాక్షన్ సీన్స్ చేశారు. సెలైన్ బాటిల్ సహాయంతో వైద్యుల పర్యవేక్షణలో డబ్బింగ్ చెప్పారు. సమంత ఆరోగ్య పరిస్థితి పక్కన పెడితే... 'యశోద' ప్రచార చిత్రాలు ఆకట్టుకున్నాయి. సరోగసీ నేపథ్యంలో రాజకీయాలు, మర్డర్ మిస్టరీ అంశాలతో థ్రిల్లర్ తెరకెక్కించినట్టు తెలుస్తోంది. మరి, సినిమా ఎలా ఉంది? (Yashoda Review)


కథ (Yashoda Story) : యశోద (సమంత - Samantha) కు డబ్బు అవసరం. ఆ సమయంలో సరోగసీ కోసం గర్భాన్ని అద్దెకు ఇస్తే పెద్ద మొత్తంలో డబ్బు ఆశ చూపిస్తారు. యశోద ఓకే అంటుంది. ఆమెను మధు (వరలక్ష్మీ శరత్ కుమార్) కు చెందిన సరోగసీ ఫెర్టిలిటీ సెంటర్‌కు తీసుకు వెళతారు. అక్కడ ఏం జరుగుతోంది? హైదరాబాద్‌లో అనుమానాస్పద రీతిలో మరణించిన హాలీవుడ్ నటికి, ఈ సరోగసీ ఫెర్టిలిటీ సెంటర్‌కు ఏమైనా సంబంధం ఉందా? ప్రపంచంలో ఐశ్వర్యవంతులైన మహిళలు కొందరు రహస్యంగా హైదరాబాద్‌కు ఎందుకు వస్తున్నారు? ఏమైంది? సరోగసీ ఫెర్టిలిటీ సెంటర్‌లో డాక్టర్ గౌతమ్ (ఉన్ని ముకుందన్), కేంద్ర మంత్రి (రావు రమేశ్) తదితరుల పాత్రలు ఏమిటి? యశోద చెల్లెలు బృందా (ప్రీతి అస్రాణి) ఎవరు? అనేది సిల్వర్ స్క్రీన్ మీద చూసి తెలుసుకోవాలి.         


విశ్లేషణ (Yashoda Telugu Review) : 'యశోద' కథ సరోగసీ చుట్టూ తిరుగుతుందని ప్రచార చిత్రాల్లో చెప్పేశారు. మరి, సినిమాలో ఏముంది? అంటే 'అంతకు మించి' అని చెప్పాలి. సరోగసీ నేపథ్యంలో ఎవరూ ఊహించని కాన్సెప్ట్‌తో 'యశోద'ను తెరకెక్కించారు.


'యశోద' కథలో కొత్త కాన్సెప్ట్ ఉంది. అందరూ కనెక్ట్ అయ్యే ఎమోషన్ ఉంది. మరీ ముఖ్యంగా మహిళలు! స్క్రీన్ మీద ప్రేక్షకుల్ని ఆకట్టుకునే స్టార్ కాస్ట్ ఉంది. స్టార్ హీరోల సినిమాల తరహాలో హీరోయిజం ఉంది. తర్వాత ఏం జరుగుతుందో? అనే ఉత్కంఠతో ముందుకు తీసుకువెళ్లే కథనం ఉంది. మరి, ఏమైనా మిస్ అయ్యిందా? అంటే... మధ్య మధ్యలో రిలాక్స్ అయ్యే సీన్స్! మాంచి థ్రిల్ ఇచ్చే సీన్ తర్వాత వచ్చే కొన్ని ఎమోషన్స్ ప్రేక్షకుల దృష్టిని డైవర్ట్ చేసేలా ఉన్నాయి. అవి రొటీన్ అనిపిస్తాయి. సమంతకు, ఆవిడ చెల్లెలు మధ్య సన్నివేశాలు గానీ... వరలక్ష్మీ శరత్ కుమార్ బ్యాక్‌స్టోరీని ఇంకా డెప్త్ ఉండేలా డిజైన్ చేసి ఉంటే బావుండేది. 


సినిమా స్టార్టింగ్ బావుంది. ఆ తర్వాత అసలు కథలోకి వెళ్ళడానికి కొంత సమయం తీసుకున్నారు. ఆ సీన్స్ ల్యాగ్ అనిపిస్తాయి. ఇంటర్వెల్ ముందు కథలో వేగం పెరుగుతుంది. ఆ తర్వాత వచ్చే సీన్స్ మరింత ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తాయి. కొత్త కాన్సెప్ట్, సినిమా చూసిన ఫీలింగ్ ఇస్తాయి.  


ప్రొడక్షన్ వేల్యూస్, టెక్నికల్ అంశాల పరంగా 'యశోద' హై స్టాండర్డ్స్‌లో ఉంది. మణిశర్మ నేపథ్య సంగీతం సినిమాకు ప్లస్ అయ్యింది. ఆర్ట్ వర్క్ (సినిమాలో సెట్స్) అన్నీ రిచ్‌గా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ బావుంది. 'యశోద'లో సంభాషణలు పాత్ర, సన్నివేశాలకు తగ్గట్టుగా రాశారు. పంచ్ కోసం కాకుండా కథలో భావాన్ని ఆవిష్కరించేలా పులగం చిన్నారాయణ, డా. చల్లా భాగ్యలక్ష్మి మాటలు రాశారు. 'ధైర్యం మగాడికి మాత్రమే ఉంటుందా?' అని సమంత చెప్పే డైలాగ్, ఆ సన్నివేశంలో షీరోయిజం ఎలివేట్ చేసింది. దర్శకులు హరి, హరీష్ కొత్త కథను స్క్రీన్ మీదకు తీసుకు వచ్చారు. అయితే... ఎమోషన్స్ అండ్ యాక్షన్ బ్యాలన్స్ చేస్తూ, రేసీ స్క్రీన్ ప్లేతో సినిమాను ముందుకు తీసుకు వెళితే ఇంకా బావుండేది. 


నటీనటులు ఎలా చేశారు? : యశోదగా సమంత సెటిల్డ్ పెర్ఫార్మన్స్ చేశారు. ఆమె క్యారెక్టర్‌లో డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి. నటనలో చక్కగా చూపించారు. యశోద కోసం శారీరకంగా ఆవిడ పడిన కష్టం కూడా స్క్రీన్ మీద కనబడుతోంది. ఫైట్స్‌లో ఫెరోషియస్‌గా చేశారు. సమంత తర్వాత ఎక్కువ మందికి గుర్తు ఉన్ని ముకుందన్, వరలక్ష్మి శరత్ కుమార్ క్యారెక్టర్లు గుర్తుంటాయి. ఉన్నికి సమంత గన్ గురి పెట్టే సన్నివేశంలో ఇద్దరి నటన హైలైట్. ఇంతకు మించి ఎక్కువ చెబితే ట్విస్ట్ రివీల్ అవుతుంది. వరలక్ష్మి శరత్ కుమార్ నటన బావుంది. కానీ, తెలుగు స్పష్టంగా పలకడంలో ఆవిడ ఇంకా ఇబ్బంది పడుతున్నారు. అది కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మురళీ శర్మ, రావు రమేశ్, శత్రు, సంపత్ రాజ్ తదితరులకు ఇటువంటి పాత్రలు చేయడం అలవాటే. అందుకని, ఈజీగా చేసుకుంటూ వెళ్లారు. సరోగసీ ఫెర్టిలిటీ సెంటర్‌లో గర్భవతులుగా కనిపించిన అమ్మాయిల్లో దివ్య శ్రీపాద నటన సహజంగా ఉంది.  


Also Read : 'ఊర్వశివో రాక్షసివో' రివ్యూ : ఆరు ముద్దులు, ఆ తర్వాత అర్థమైందిగా -  అల్లు శిరీష్ సినిమా ఎలా ఉందంటే?


ఫైనల్‌గా చెప్పేది ఏంటంటే? : 'యశోద' ఎమోషనల్ థ్రిల్లర్.  సమంత ఫ్యాన్స్‌కు నచ్చే అంశాలు సినిమాలో చాలా ఉన్నాయి. ముఖ్యంగా ఆవిడ చేసే ఫైట్స్! ఎమోషనల్ సీన్స్! కొత్త కాన్సెప్ట్‌తో  కూడిన సినిమాల కోసం ఎదురు చూసే ప్రేక్షకులకు బెస్ట్ ఆప్షన్ 'యశోద'. సినిమా స్టార్టింగ్ కొంచెం స్లోగా ఉండటం, మధ్య మధ్యలో కొన్ని ఎమోషన్స్ డైవర్ట్ చేసేలా ఉండటం మైనస్ పాయింట్స్. అయితే... తర్వాత ఏం జరుగుతుంది? అని ప్రేక్షకుల్లో ఆసక్తి, ఉత్కంఠ కలిగించేలా కథను చివరి వరకు తీసుకువెళ్ళారు. సమంత షీరోయిజం, కొత్త కాన్సెప్ట్ కోసం హ్యాపీగా చూడొచ్చు. 


Also Read : 'తగ్గేదే లే' రివ్యూ : 'దండుపాళ్యం' గ్యాంగ్ తగ్గారా? లేదంటే మళ్ళీ మొదలు పెట్టారా?