India China Border Conflict: 


లోక్‌సభలో చర్చ 


భారత్ చైనా సరిహద్దు వివాదంపై (India China Border Dispute) చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఈ వివాదంపై కేంద్రం మాట్లాడాలంటూ చాలా రోజులుగా కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. లద్దాఖ్‌లో చైనా ఆక్రమణలకు పాల్పడుతోందని, మోదీ సర్కార్ మాత్రం సైలెంట్‌గా ఉంటోందని విమర్శిస్తోంది. కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ కూడా దీనిపై పదేపదే విమర్శలు చేశారు. ఈ క్రమంలోనే రాజ్‌నాథ్ సింగ్‌ లోక్‌సభ సాక్షిగా ఈ ప్రకటన చేశారు. చైనా సరిహద్దు వివాదంపై సభలో తనకు చర్చించే ధైర్యం ఉందని తేల్చి చెప్పారు. చంద్రయాన్ 3 సహా అంతరిక్ష రంగంలో భారత్ సాధించిన విజయాలను ప్రస్తావిస్తూనే సరిహద్దు వివాదాల గురించి మాట్లాడారు రాజ్‌నాథ్ సింగ్. దేశ సరిహద్దుల్ని రక్షించుకునేందుకు తాము ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి చైనా అంశం ప్రస్తావించడాన్ని గుర్తు చేస్తూ సమాధానమిచ్చారు. 


"భారత్ చైనా సరిహద్దు వివాదంపై చర్చించేందుకు నాకు పూర్తి ధైర్యం ఉంది. సరైన విధంగా చర్చించగలను అన్న విశ్వాసం కూడా ఉంది"


- రాజ్‌నాథ్ సింగ్, రక్షణశాఖ మంత్రి


దాదాపు రెండున్నరేళ్లుగా భారత్, చైనా మధ్య సరిహద్దు వివాదం కొనసాగుతోంది.