ఆంధ్రప్రదేశ్ లో విద్యాప్రమాణాలు పెంపొందించడానికి ముఖ్యమంత్రి జగన్ సర్కార్ చర్యలు చేపట్టింది. అంతర్జాతీయ స్థాయిలో విద్యార్థులు రాణించేలా ప్రముఖ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుంటోంది. ఇప్పటికే నాడు నేడు కార్యక్రమం ద్వారా పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించింది. ఇందు కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసింది జగన్ సర్కార్. పేద విద్యార్థులను గ్లోబల్‌ స్థాయిలో సగర్వంగా నిలబెట్టేందుకు మహత్తర యజ్ఞాన్ని తలపెట్టింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంటర్నేషనల్‌ బక్‌లారియెట్‌ సిలబస్‌ అమలు చేసేందుకు రెడీ అవుతోంది.  ఐబీ సంస్థతో పాఠశాల విద్యా శాఖ ఒప్పందం కుదుర్చుకుంది. దీనికి మంత్రి వర్గం ఆమోదముద్ర వేసింది. ఇప్పటికే ఆంగ్ల భాషలో పరిజ్ఞానం పెంపొందించేందుకు మూడో తరగతి విద్యార్థులకు టోఫెల్‌ శిక్షణ ఇస్తోంది. తాజా ఒప్పందంతో ఒకటవ తరగతి నుంచి ఐబీ సిలబస్‌ను ప్రవేశపెడుతోంది. దశలవారీగా ఉన్నత తరగతులకు విస్తరించనుంది. 


అమెరికా, ఇంగ్లాండ్  వంటి దేశాల్లో మాత్రమే ఐబీ సిలబస్‌ అందుబాటులో ఉందన్నారు ముఖ్యమంత్రి జగన్. ఇప్పుడు మన పిల్లలకు అందిస్తున్నామని, రాష్ట్రంలో ‘ఐబీ’ సిలబస్‌ను ప్రవేశపెట్టడం చారిత్రక ఘట్టమన్నారు. ఐబీలో చదువుకున్న విద్యార్థులకు ప్రపంచ వ్యాప్తంగా ఏ యూనివర్సిటీకి వెళ్లినా మంచి అవకాశాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రశ్నలు వేసే విధానం, వాటికి సమాధానాలు నేర్చుకునే విధానం నిజ జీవితాలకు దగ్గరగా ఉంటుందన్నారు జగన్. ఇప్పటికే మూడో తరగతి నుంచి విద్యార్థులకు వారానికి ఆరు రోజులు, రోజూ గంట పాటు టోఫెల్‌ శిక్షణ ఇప్పిస్తున్నామని వెల్లడించారు. వీరంతా 8, 9 తరగతులకు వచ్చే సరికి మంచి నైపుణ్యం సాధిస్తారని, ఇంగ్లిషులో పరిజ్ఞానం బాగా పెరుగుతుందన్నారు.


కేబినెట్ లో మరికొన్ని నిర్ణయాలు
సీపీఎస్‌ ఉద్యోగులు, కాంట్రాక్టు ఉద్యోగులకు మేలు చేకూరుస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రిటైర్మెంట్‌ సీపీఎస్‌ ఉద్యోగులకు ఆర్థిక భద్రత కల్పించేందుకు ప్రతిపాదించిన గ్యారెంటీడ్‌ పెన్షన్‌ స్కీమ్‌ అమలుకు ముందడుగు వేసింది. ఏపీజీపీఎస్‌ బిల్లు–2023ను ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రవేశపెట్టనుంది. ప్రభుత్వ శాఖల్లో 2014 జూన్‌ 2వ తేదీ కంటే ముందు కాంట్రాక్టు పద్ధతిలో నియమితులైన సుమారు 10 వేల మందికిపైగా ఉద్యోగులను క్రమబద్ధీకరించేందుకు ఆంధ్రప్రదేశ్‌ కాంట్రాక్ట్‌ ఎంప్లాయీస్‌ బిల్లు అసెంబ్లీ ముందుకు తీసుకురానుంది. ఆంధ్రప్రదేశ్‌ భూదాన్‌–గ్రామదాన్‌ యాక్టు 1965 సవరణలతో కూడిన డ్రాప్ట్‌ బిల్లుకు కేబినెట్‌ ఆమోదించింది. బలహీన వర్గాలు, పేద ప్రజలకు ఇళ్ల స్థలాల కోసం భూమిని మంజూరు చేసే అధికారాన్ని బోర్డు కల్పించేలా చట్టంలో మార్పు చేశారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే చట్ట సవరణకు సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించనున్నారు.


యూపీఎస్సీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థుల కోసం జగనన్న సివిల్‌ సర్వీసెస్‌ ప్రోత్సహం పేరుతో అవార్డులను అందజేయనున్నారు. యూపీఎస్సీ పరీక్షల్లో ప్రిలిమనరీ, మెయిన్స్‌ రెండు విభాగాల్లో ఉత్తీర్ణులై సామాజిక, ఆర్థిక, విద్యాపరంగా వెనుకబడిన పేద అభ్యర్థులకు ఆర్థిక సాయం అందించనున్నారు. ప్రిలిమ్స్‌లో క్వాలిఫై అయితే రూ.లక్ష,  మెయిన్స్‌కు అర్హత సాధిస్తే అదనంగా మరో రూ.50 వేలు నగదు ప్రోత్సాహకం అందించనుంది ఏపీ సర్కార్. ఆంధ్రప్రదేశ్‌ ప్రైవేటు వర్సిటీస్‌ యాక్టు–2016 చట్ట సవరణకు అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టనుంది. ఇప్పుడున్న ప్రైవేటు కాలేజీలను వర్సిటీలుగా మారిస్తే వచ్చే అదనపు సీట్లలో 35 శాతం సీట్లు కన్వీనర్‌ కోటాలోకి వస్తాయి. దీనివల్ల పేద విద్యార్థులకు ఎంతో మేలు చేకూరుతుంది.