Cyclone Hamoon: 


హమూన్ తుఫాన్..


బంగాళాఖాతంలో ఏర్పడిన హమూన్ తుఫాన్ (Hamoon Cyclone) మరి కొద్ది గంటల్లోనే బలపడనుందని వాతావరణ శాఖ వెల్లడించింది. తీర ప్రాంతాలపై తుఫాన్ ప్రభావం కనిపిస్తుందని స్పష్టం చేసింది. 12 గంటల్లో ఈ ఎఫెక్ట్‌ మొదలవుతుందని, ఆ తరవాత ఇది బంగ్లాదేశ్ తీర ప్రాంతాల వైపు మళ్లే అవకాశముందని అంచనా వేసింది. అక్టోబర్ 25 సాయంత్రం నాటికి బంగ్లాదేశ్‌లో ఈ తుఫాన్ బలపడుతుందని తెలిపింది. IMD హెచ్చరికలతో ఇప్పటికే ఒడిశా అప్రమత్తమైంది. అన్ని జిల్లాల కలెక్టర్‌లకి ఆదేశాలిచ్చింది. ఎలాంటి పరిస్థితులకైనా సిద్ధంగా ఉండాలని తేల్చి చెప్పింది. దిగువ ప్రాంతాల్లోని ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశాలు జారీ చేసింది. మత్స్యకారులెవరూ సముద్రంలోకి వెళ్లొద్దని హెచ్చరించింది. తీర ప్రాంతాల్లో మరి కొద్ది గంటల్లోనే వర్షాలు మొదలయ్యే అవకాశముందని IMD తెలిపింది. రెండ్రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఒడిశాతో పాటు నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, అసోం, మేఘాలయా, పశ్చిమబెంగాల్‌లోనూ ఇవే పరిస్థితులుంటాయని ప్రకటించింది. అటు అరేబియా సముద్రంలో తేజ్ తుఫాన్ (Cyclone Tej) కూడా క్రమంగా బలపడుతోంది. యెమెన్-ఒమన్ తీరాన్ని దాటి అక్టోబర్ 24 నాటికి బలపడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.