Cyclone Asani 2022 Rains: ఆగ్నేయ బంగాళాఖాతం, దక్షిణ అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం మరో 24 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా మారుతుందని భారత వాతావరణ కేంద్రం (India Meteorological Department) ఆదివారం తెలిపింది. అల్పపీడనం వాయుగుండంగా మారే క్రమంలో తీరం వెంట బలమైన గాలులు వీస్తున్నాయి. దక్షిణ అండమాన్ సముద్రం మీదుగా కదులుతూ శనివారం తూర్పు ఈశాన్య దిశగా కదులుతూ అల్పపీడనం మరింతగా బలపడింది. ఈ అల్పపీడనం ఉత్తర దిశగా కదులుతూ అండమాన్ సముద్రం, దాని పరిసర ప్రాంతంలో నేడు (ఆదివారం) వాయుగుండంగా మారనుంది.
ఓ వైపు బలమైన గాలులు వీచనుండగా, మరోవైపు అకాల వర్షాలతో ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. అసని తుఫాను కారణంగా నేడు అండమాన్ & నికోబార్‌లోని కొన్ని ప్రాంతాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని అధికారులు తెలిపినట్లు పీటీఐ రిపోర్ట్ చేసింది. అండమాన్ మరియు నికోబార్ దీవులలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురనున్నాయి. ఈ ఏడాది సంభవిస్తున్న మొదటి తుఫాను ప్రభావంతో ద్వీపసమూహంలో సేవలు నిలిపివేశారు. మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని అధికారులు హెచ్చరించారు.
అప్రమత్తమైన ఎన్డీఆర్ఎఫ్ టీమ్..
వాయుగుండం సోమవారం తుఫాన్ తీవ్ర రూపం దాల్చనుంది. ఉత్తర ఈశాన్య దిశగా కదులుతూ మార్చి 22 ఉదయం నాటికి బంగ్లాదేశ్, దానిని అనుకుని ఉన్న ఉత్తర మయన్మార్ తీరానికి మార్చి 23న చేరుకునే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గత రెండు రోజులుగా చెబుతోంది. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF)కి చెందిన సుమారు 100 మంది సిబ్బందిని ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆరు సహాయక శిబిరాలను ఏర్పాటు చేసి దీవుల సమీప ప్రాంతాల్లో మోహరించారు. .
ఉత్తర, మధ్య అండమాన్‌లలో బలమైన గాలులు వీచడంతో పాటు అకాల వర్షాలు కురిసే అవకాశం ఉంది. పోర్ట్ బ్లెయిర్‌లో ఇప్పటివరకూ జనజీవనం సాధారణంగా ఉందని, ఏ క్షణంలోనైనా అసని తుఫాను ప్రభావం వీరిపై సైతం పడుతుందని ఆ ప్రజలను వాతావరణ కేంద్రం హెచ్చరికల ద్వారా అప్రమత్తం చేసింది. అసని తుఫాను బంగ్లాదేశ్-మయన్మార్ తీరాల వైపు కదులుతుందని అంచనా వేశారు.
అక్కడ భారీ వర్షాలు..
అండమాన్ మరియు నికోబార్ దీవులలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దాని పరిసర ప్రాంతాల్లో కొన్ని చోట్ల ఓ మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది. సోమవారం కొన్ని చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. అండమాన్ సముద్రం, దాని సమీప ప్రాంతాల్లో, ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్లకల్లోలంగా ఉండే అవకాశం ఉందని వాతావరణ పేర్కొంది.
Also Read: Special Trains: తెలుగు రాష్ట్రాల్లో రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్! 104 కొత్త రైళ్లు, ఈ నగరాల మధ్యే