Cricket World Cup 2023:


ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్..


వరల్డ్ కప్ ఫైనల్ (World Cup Final Match) మ్యాచ్‌ ఎప్పుడెప్పుడా అని చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్. నవంబర్ 19న గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ వేదికగా భారత్, ఆస్ట్రేలియా (India Vs Australia) తలపడనున్నాయి. ఇప్పటికే ఈ మ్యాచ్‌పై క్రేజ్ పెరిగిపోయింది. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ఆస్ట్రేలియా ప్రధాని కూడా మ్యాచ్‌కి హాజరుకానున్నారు. వీళ్లతో పాటు పలువురు ప్రముఖులూ రానున్నారు. భద్రతా పరంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు పోలీసులు. ఈ క్రమంలోనే ఇండియన్ రైల్వేస్ (Indian Railways) కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. మ్యాచ్‌కి పెద్ద ఎత్తున అభిమానులు తరలి రానున్నారు. ఈ మేరకు స్పెషల్ ట్రైన్స్‌ వేస్తోంది. ఢిల్లీ, ముంబయి నుంచి వచ్చే క్రికెట్ ఫ్యాన్స్ కోసం ఈ ప్రత్యేక ట్రైన్‌లు షెడ్యూల్ చేసింది. ఢిల్లీ నుంచి ఒకటి, ముంబయి నుంచి మూడు రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. ఇవాళ సాయంత్రం (నవంబర్ 18) ఈ రైళ్లు బయల్దేరి నవంబర్ 19 ఉదయం నాటికి అహ్మదాబాద్‌కి చేరుకుంటాయి. తెల్లవారుజామున 2.30 గంటలకు అహ్మదాబాద్‌కి చేరుకోనున్నాయి. మ్యాచ్ కారణంగా ఫ్లైట్‌ టికెట్ రేట్‌లు ఉన్నట్టుండి పెరిగిపోయాయి. అంత ఖర్చు చేయలేని వాళ్ల కోసం రైల్వే ఈ నిర్ణయం తీసుకుంది. అహ్మదాబాద్‌కి ఒక్కో ఫ్లైట్ టికెట్ ధర రూ.20-40 వేల వరకూ ఉంది. అంతలా డిమాండ్ పెరిగిపోయింది. రైల్ టికెట్ ధరలు తక్కువగానే ఉన్నాయి. స్లీపర్ సీట్‌కి రూ.620గా నిర్ణయించింది. ఫస్ట్ ఏసీ సీట్‌ కి రూ.3,490, 3AC ఎకానమీకి రూ.1,525, 3AC సీట్స్‌కి రూ.1,665 గా నిర్ణయించింది. ఇప్పటికే IRCTC వెబ్‌సైట్‌లో ఈ ట్రైన్స్ టికెట్‌ బుకింగ్ మొదలైంది. 


ఇక ఫ్లైట్‌ల విషయానికొస్తే ప్రతి నిముషానికీ టికెట్ ధరలు పెరుగుతున్నాయి. ఇప్పటికే దీపావళి పండుగ సందర్భంగా విపరీతమైన డిమాండ్ పెరిగంది. ఇప్పుడు మ్యాచ్‌తో అది రెట్టింపైంది. ముంబయి, అహ్మదాబాద్‌ మధ్యలో దాదాపు 18 ఫ్లైట్‌లను నడుపుతున్నాయి ఎయిర్‌ లైన్స్ కంపెనీలు. అహ్మదాబాద్ నుంచి ఢిల్లీకి టికెట్ ధరలు రూ.14 వేల నుంచి రూ.39 వేల వరకూ ఉంది. ముంబయి, అహ్మదాబాద్‌ మధ్య టికెట్ ధరలు రూ.10 వేల నుంచి రూ.32 వేల వరకూ ఉంది. అటు బెంగళూరు నుంచి కూడా దాదాపు టికెట్ ధరలు ఇదే స్థాయిలో ఉన్నాయి. వడోదర, అహ్మదాబాద్‌కి ఎక్కువగా డిమాండ్ ఉంది. చాలా వరకూ కంపెనీలు అదనపు సర్వీస్‌లను నడిపేందుకు సిద్ధమయ్యాయి. ఈ డిమాండ్‌ని వీలైనంత వరకూ క్యాష్‌ చేసుకోవాలని చూస్తున్నాయి.