Supreme Court: ప్రజాస్వామ్యంలో ఎన్నికలపై కోర్టులు స్టే విధించలేవని దేశ అత్యున్నత ధర్మాసనం సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఆర్టికల్ 329 కింద ఉన్న కేసు అయితే కోర్టులు పూర్తిగా శక్తిహీనులేనని విచారణ సందర్భంగా వ్యాఖ్యానించింది. ఆర్టికల్ 329 ప్రకారం సీట్ల కేటాయింపు లేదా నియోజకవర్గాల విభజనలో కోర్టుల జోక్యానికి వ్యతిరేకంగా న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం ఆంక్షలు విధించింది. ఎన్నికల పిటిషన్ల ద్వారా మాత్రమే పోల్ ఫలితాలను సవాలు చేయవచ్చని పేర్కొంది.


ప్రజాస్వామ్యంలో ఎన్నికలను అడ్డుకోవాలనుకుంటున్నారా.. ఎన్నికలను నిలిపివేస్తే ప్రజాస్వామ్యం గురించి ఏం చెప్పగలం అంటూ దక్షిణ భారత్ హిందీ ప్రచార సభకు సంబంధించిన ఎన్నికల వ్యవహారంలో సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను కోర్టు ప్రశ్నించింది. ఓటర్ల జాబితా, ఇతర వ్యవహారాల్లో అవకతవకల దృష్ట్యా దక్షిణ భారత హిందీ ప్రచార సభ కర్ణాటక డివిజన్ ఎన్నికలపై స్టే విధించాలని సొలిసిటర్ జనరల్ వాదనలు వినిపించారు. దీనిపై స్పందించిన సుప్రీం కోర్టు.. ఎన్నికలపై స్టే ఇవ్వలేమి అత్యున్నత ధర్మాసనం స్పష్టం చేసింది. 'ఎన్నికలపై స్టే ఇవ్వలేము. అది ఆర్టికల్ 329 కింద ఉన్న కేసు అయితే కోర్టులు పూర్తిగా శక్తిహీనులే. 1950లలో పొన్నుస్వామి కేసులో తీర్పు నుంచి 1978 లో మొహిందర్ సింగ్ గిల్ కేసు వరకు.. సుప్రీం కోర్టు ఎప్పుడూ ఇదే మాట చెబుతూ వస్తోంది' అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. 


ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల మధ్య అనుసంధాన భాషగా దేశంలోని దక్షిణాది రాష్ట్రాల్లో హిందీ ప్రచారం చేసేందుకు దక్షిణ భారత హిందీ ప్రచార సభను 1918 లో ప్రారంభించారు. మహాత్మా గాంధీ సహకారంతో అనీ బిసెంట్ ఈ ప్రచార సభను స్థాపించారు. దీని ప్రధాన కార్యాలయంలో చెన్నైలో ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం 1964 కేంద్ర చట్టం ద్వారా ఈ సభను జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థగా ప్రకటించింది. అలాగే ఈ సభ ద్వారా డిగ్రీలు, డిప్లొమాలు, ఇతర ధ్రువపత్రాలనూ ప్రధానం చేయగలిగేలా డీమ్డ్ వర్సిటీ హోదాను కూడా మంజూరు చేసింది కేంద్ర సర్కారు. ఈ ప్రచార సభను ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు ఒక్కొక్కటి చొప్పున నాలుగు విభాగాలుగా విభజించారు. ధార్వాడ్ లోని కర్ణాటక ప్రావిన్షియల్ సభ మేనేజింగ్ కమిటీ, జీతభత్యాల ఉద్యోగులకు త్వరలో జరగబోయే ఎన్నికలు సంబంధించి కేసు ప్రస్తుతం సుప్రీం కోర్టులో విచారణ నడుస్తోంది.