Bagiwalu:
చీతాను కట్టేశాడు..
కర్ణాటకలో హసన్ జిల్లాలోని బగివలు గ్రామంలో ఓ యువకుడు ఊహకు కూడా అందని సాహసం చేశాడు. తనపై అటాక్ చేసిన చీతాతో పోరాడాడు. చివరకు దాన్ని పట్టుకుని కాళ్లు కట్టేసి బైక్‌పైనే తీసుకెళ్లి ఫారెస్ట్ అధికారులకు అప్పగించాడు. చిరుత కనిపిస్తేనే గడగడ వణికిపోతాం. ఈ యువకుడు మాత్రం వెనక్కి తగ్గకుండా చీతాతోనే తలపడ్డాడు. ఆహారం కోసం వచ్చి దాడి చేసిన చీతాను ఎలాంటి ఆయుధాలు లేకుండానే కట్టేశాడు. కర్ణాటకలో ఈ మధ్య కాలంలో వన్య మృగాలు జనావాసాల్లోకి వస్తున్న ఘటనలు పెరుగుతున్నాయి. అడవులు అంతరించిపోతుండటం వల్ల ఆహారం కోసం ఊళ్లలోకి వస్తున్నాయి. ముఖ్యంగా బగివలు గ్రామంలో (Bagiwalu village) ఈ ఆందోళన ఎక్కువగా ఉంటోంది. 35 ఏళ్లు ముత్తు తన పొలం పనులకు వెళ్తుండగా చిరుత కంట పడింది. ఉన్నట్టుండి దాడి చేయడం మొదలు పెట్టింది. ముందు కాస్త భయపడినా ఆ తరవాత తానూ ఎదురు దాడికి దిగాడు. ఆ సమయంలో చేతిలో కనీసం కర్ర కూడా లేదు. చాలా సేపు అలానే పోరాటం చేశాడు. ఈ క్రమంలో గాయపడ్డాడు. రక్తమోడుతున్నా పోరాటం ఆపలేదు. పొలం పనుల కోసం తన బైక్‌కి ఓ తాడు కట్టుకుని తీసుకొచ్చాడు. వెంటనే ఆ తాడుని అందుకున్నాడు.
అధికారులకు అప్పగింత..
ఒక్కసారిగా చీతా దూకింది. చాలా ఒడుపుగా దాన్ని పట్టుకుని తాడుతో నాలుగు కాళ్లు కట్టేశాడు. ఆ తరవాత దాన్ని తీసుకొచ్చి బైక్ బ్యాక్‌సీట్‌పై పెట్టాడు. అలాగే ఊళ్లోకి వెళ్లాడు. అక్కడి వాళ్లంతా ముత్తుని చూసి ఆశ్చర్యపోయారు. తన ధైర్యానికి మెచ్చుకున్నారు. "రియల్ హీరో" అని ఆకాశానికెత్తేశారు. చిరుతను గాయపరచకుండానే జాగ్రత్తగా పట్టుకుని అటవీ అధికారులకు అప్పగించాడు. ప్రస్తుతానికి దానికి చికిత్స అందిస్తున్నారు. కొన్ని రోజులు అబ్జర్వేషన్‌లో ఉంచాక అడవిలోకి వదులుతామని అధికారులు వెల్లడించారు. 9 నెలల ఈ ఆడ చీతా చాలా రోజులుగా ఏమీ తినలేదని, అందుకే చాలా వీక్‌గా కనిపిస్తోందని వివరించారు.
Also Read: Tomato Price Hike: నెల రోజుల్లో లక్షాధికారి అయిపోయిన రైతు, టమాటా పంటతో జాక్‌పాట్