Contempt Case: కింగ్‌ఫిషర్ యజమాని విజయ్‌ మాల్యాకు సుప్రీం కోర్టు షాకిచ్చింది. రూ.9 వేల కోట్ల మేర బ్యాంకు రుణాలు ఎగవేసి విదేశాలకు పరారైన మాల్యాకు కోర్టు ధిక్కార కేసులో నాలుగు నెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. రూ. 2వేల జరిమానా కూడా విధించింది. 






కోర్టు ధిక్కారం


విజయ్‌ మాల్యా కోర్టు ధిక్కారానికి పాల్పడినట్లు జస్టిస్‌ యు.యు.లలిత్‌ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం తేల్చింది. 2017లో క‌ర్ణాట‌క హైకోర్టు ఆదేశాల‌ను ఉల్లంఘించి విదేశాల్లో ఉన్న త‌న కుమారుడు సిద్ధార్థ్ మాల్యా, కుమార్తెలు లియానా మాల్యా, తాన్యా మాల్యాల‌కు 40 మిలియ‌న్ డాల‌ర్లను ఎస్‌బీఐ బ్యాంక్ నుంచి మాల్యా బ‌దిలీ చేశారు.


నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా న‌గ‌దు బ‌దిలీ చేశార‌ని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ విషయాన్ని కోర్టు వద్ద దాచినట్లు సుప్రీం కోర్టు తేల్చింది.






వడ్డీతో సహా


దీంతో 40 మిలియన్ డాలర్లు (సుమారు రూ.317 కోట్లు) వడ్డీతో సహా విజయ్‌ మాల్యా డిపాజిట్ చేయాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఈ మొత్తాన్ని నాలుగు వారాల్లోపు డిపాజిట్ చేయాలని ఆదేశించింది. అలా చేయకపోతే మాల్యా ఆస్తులను జప్తు చేయాల్సి ఉంటుందని హెచ్చరించింది. ప్రస్తుతం మాల్యా.. విదేశాల్లో తలదాచుకుంటున్నారు.


Also Read: Covid Update: దేశంలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు- 26 మంది మృతి


Also Read: Tamilnadu Politics: పన్నీర్‌ సెల్వంకు కోర్టు షాక్! జనరల్‌ మీటింగ్‌కు మద్రాస్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్