Assembly Election Results 2024 :హర్యానా, జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఫలితాలపై కాంగ్రెస్ పార్టీ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఫలితాల వెల్లడి ఆలస్యం కావడంతోపాటు అనూహ్యంగా బీజేపీ విజయం సాధించడంపై కాంగ్రెస్ సీనియర్ లీడర్‌ జైరాం రమేష్‌ సందేహం వ్యక్తం చేశారు. ముందుగా ఆయన సోషల్ మీడియాలో తన అనుమానాలను వ్యక్తం చేస్తూ పోస్టు పెట్టారు. తర్వాత ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. 


ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో 9 గంటల నుంచి 11 మధ్య ఫలితాలు చాలా ఆలస్యంగా అప్‌లోడ్ అయ్యాయని అందులో ఆరోపించారు. దీని వల్ల కొందరు వ్యక్తులు ఫలితాలను తమకు అనుకూలంగా మార్చుకునే వీలుందని అన్నారు. ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంశాలను చూడాలని రిక్వస్ట్ చేశారు. కౌంటింగ్ కొనసాగుతున్నప్పటికీ అక్రమాలకు అలవాటు పడిన వాళ్లు ఫలితాలను ప్రభావితం చేస్తారని ఆందోళన వ్యక్తం చేశారు. కచ్చితమైన ట్రెండ్స్‌తో వెబ్‌సైట్‌ను అప్‌డేట్ చేసేలా అధికారులకు ఆదేశించాలని కోరారు. 



అంతక ముందు సోషల్ మీడియా ఎక్స్‌లో తీవ్ర ఆరోపణలు చేస్తూ ఓ ట్వీట్ చేశారు. "లోక్‌సభ ఎన్నికల మాదిరిగానే హర్యానాలో  జరుగుతోందా. ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో ట్రెండ్స్‌ను అప్‌లోడ్ చేయడం ఆలస్యాన్ని మళ్లీ చూస్తున్నాము. ఇలా చేయాలనే ఒత్తిడి ఎన్నికల సంఘంపై ఉందా" అంటూ ప్రశ్నించారు.


కాంగ్రెస్ నాయకురాలు సుప్రియా శ్రీనెత్ మాట్లాడుతూ, "పిక్చర్ అతి త్వరలో మారుతుంది. దీన్ని మార్చడానికి ఎక్కువ సమయం పట్టదు. హర్యానా, జమ్మూకశ్మీర్ నుంచి గుడ్ న్యూస్ వింటాం. చాలాసేపు ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌ చూస్తున్నాను. డేటా అప్‌డేట్ కావడం లేదు. గ్రౌండ్ రిపోర్ట్‌ల ప్రకారం మా ఓట్ షేర్ బిజెపి కంటే చాలా ముందుంది, అది కచ్చితంగా సీట్లుగా మారతాయి. అని చెప్పుకొచ్చారు. 


హర్యానాలో బీజేపీ ముందంజలో ఉంది
హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నెమ్మదిగా వెలువడుతున్నాయి. చాలా స్థానాల్లో దాదాపు నాలుగు రౌండ్ల కౌంటింగ్ పూర్తైంది. ఇప్పటి వరకు బీజేపీ 51 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ కేవలం 33 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉంది. ఓట్ల లెక్కింపు ప్రారంభమైన కాసేపటికే కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో దూసుకెళ్లింది. ఒకానొక సందర్భంలో కాంగ్రెస్ 60కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో కనబరిచింది. అయితే ఈవీఎంల ఓట్ల లెక్కింపు ప్రారంభమైన వెంటనే కాంగ్రెస్ ఆధిక్యం పడిపోయి బీజేపీ ఆధిక్యంలోకి దూసుకొచ్చింది.


జమ్మూకశ్మీర్‌లోని 90 అసెంబ్లీ స్థానాల ఫలితాలు కూడా నెమ్మదిగా వెలువడుతున్నాయి. ఎన్నికల సంఘం ప్రకారం JK NC-కాంగ్రెస్ కూటమి మెజారిటీ మార్కు దాటింది. ప్రస్తుతం జేకేఎన్‌సీ 39 స్థానాల్లో ఆధిక్యంఉంది. బీజేపీ 28 స్థానాల్లో, కాంగ్రెస్ 8 స్థానాలతో మూడో స్థానంలో ఉంది. పీడీపీ 3 స్థానాల్లో జేపీసీ 2 స్థానాల్లో సీపీఐ(ఎం), డీపీఏపీ ఒక్కో స్థానంలో ఆధిక్యంలో ఉన్నాయి. స్వతంత్ర అభ్యర్థులు 8 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. 


ఎన్నికల సంఘంపై నమ్మకం లేదు
హర్యానా ఫలితాలపై కాంగ్రెస్ మద్దతుదారులు ఎన్నికల సంఘంపై అనుమానం వ్యక్తం చేస్తన్నారు. బీజేపీకి ఏజెంట్ అని ఆరోపిస్తున్నారు. గతసారి లోక్‌సభ ఎన్నికల్లో ఏం జరిగిందో ఏడీఆర్ నివేదికలో స్పష్టమైందని గుర్తు చేస్తున్నారు. ఎన్నికల కమిషన్‌ను విశ్వసించలేమంటున్నారు. హర్యానా ప్రజలు మాత్రం కాంగ్రెస్‌తోనే ఉన్నారని అంటున్నారు. హర్యానా ప్రజలు మార్పు కోరుకుంటున్నారని కచ్చితంగా కాంగ్రెస్‌కు పట్టం కట్టారని, పూర్తి మెజారిటీతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్న నమ్మకం ఉందన్నారు.


Also Read: పడిలేచిన కెరటంలా బీజేపీ- హర్యానాలో హ్యాట్రిక్‌ దిశగా కమలం - అనూహ్యంగా పడిపోయిన కాంగ్రెస్‌!