Haryana Assembly Election Results 2024: హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు టీ 20 మ్యాచ్‌ను తలపించాయి. పోస్టల్ బ్యాలెట్‌ లెక్కింపులో దూసుకెళ్లిన కాంగ్రెస్‌ ఒక్కసారిగా పడిపోయింది. ఈవీఎంలు లెక్కింపు తర్వాత వైకుంఠపాళీ ఆటలో మాదిరిగా ఒక్కో సీటు తగ్గుతూ వచ్చింది కాంగ్రెస్‌. 

ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్‌లతో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మొదట్లో కాంగ్రెస్ దూసుకెళ్లింది. దాదాపు అరవైకిపైగా స్థానాల్లో ఆధిక్యం చూపించింది. ఈ దెబ్బకు బీజేపీకి 20 స్థాలైనా  వస్తాయా అన్న అనుమానం కలిగింది. కానీ 10 గంటల తర్వాత ఫలితాలు తారుమారు అవుతూ వచ్చాయి. అప్పటి వరకు విజయం దిశగా దూసుకెళ్తున్న కాంగ్రెస్ ఒక్కసారిగా పడిపోయింది. బీజేపీ సునామీ మొదలైంది. 

ఒకానొక దశలో ఇరు పార్టీల మధ్య హోరాహోరీ పోరు తప్పదేమో అన్నట్టు ఫలితాలు వచ్చాయి. అయినా చివరకు బీజేపీ పై చేయి సాధించింది. యాభైకు పైగా స్థానాల్లో ఆధిక్యం చూపించి హర్యానాలో ఒంటరిగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. హర్యానాలో మొదటి ట్రెండ్స్ చూసిన కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. ఏఐసీసీ కార్యాలయం వద్ద స్వీట్స్ పంచుకున్నాయి. బాణసంచా పేల్చాయి. వాళ్ల సంతోషం ఎంతసేపు నిలవలేదు. అక్కడ బీజేపీ అధికారంలోకి వచ్చేలా ఫలితాలు వస్తున్నాయి.  

ఎగ్జిట్ పోల్స్ కూడా హర్యానాలో కాంగ్రెస్ వస్తున్నట్టు అంచనా వేశాయి. వివిధ సంస్థలు చెప్పిన ఎగ్జిట్ పోల్స్‌ను ఒక్కసారి పరిశీలిస్తే... 

సంస్థ పేరు  బీజేపీ కాంగ్రెస్ ఐఎన్‌ఎల్డీ జేజేపీ  ఇతరులు 
ధృవ రీసెర్చ్  27 57+ - 0 6
సీ ఓటర్ 20-28 50-58 - 0-2 10-14
మాట్రీజ్  18-24 55-62 3-6 0-3 2-8
పీపుల్స్ పల్స్  26 (+/-7) 55 (+/-7) 2-3 - 4-6
దైనిక్‌ భాస్కర్  15-29 44-54 1-5 0-1 6-9
న్యూస్‌ 24 చాణక్య  18-24 55-62 - - 2-5
టైమ్స్‌ నౌ 22-32 50-64 - - 2-8
జేఐఎస్టీ -టీఐఎఫ్‌ రీసెర్చ్  29-37 43-53 0-2 0 4-6

ఒక దశలో పోలింగ్ జరిగిన హర్యానాలో 67.90% ఓటింగ్ నమోదైంది. 90 అసెంబ్లీ సీట్లు ఉన్న హర్యానాలో 46 సీట్లు సాధించిన వాళ్లే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. ఇప్పుడు బీజేపీ ఆ మ్యాజిక్ ఫిగర్‌ను దాటేసి ఐదారు సీట్లు అదనంగా సాధించేలా కనిపిస్తోంది. 

జమ్మూకశ్మీర్‌లో పరిస్థితి ఏంటీ?

అటు జమ్మూకాశ్మీర్‌లో మాత్రం కాంగ్రెస్ కూటమి విజయం సాధించే దిశగా సాగుతోంది. ఆర్టికల్ 370 తర్వాత జమ్మూకశ్మీర్‌లో మొదటిసారిగా జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ కూటమికి పట్టం కడుతున్నట్టు అర్థమవుతోంది. ఇక్కడ కాంగ్రెస్-NCతో కలిసి పోటీ చేసింది. PDP, బీజేపీ ఒంటరిగానే బరిలోకి దిగారు. 90 మంది సభ్యులున్న అసెంబ్లీకి మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించారు. సెప్టెంబర్ 18, సెప్టెంబర్ 25, అక్టోబర్ 1 పోలింగ్ చేపట్టారు. 

ఇక్కడ కూడా ఎగ్జిట్ పోల్స్ అంచనాలు  కాస్త తప్పాయి. కాంగ్రెస్ కూటమి గెలుస్తుందని చెప్పినా అది బొటాబొటి మెజార్టీ ఉంటుందని చాలా సంస్థలు అంచనా వేశారు. కానీ వాటీని కాదని కాంగ్రెస్‌ కూటమికి పూర్తి స్థాయి మెజార్టీని ప్రజలు పట్టం కట్టారు. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఇండీ కూటమికి 35 నుంచి 50 సీట్లు రావచ్చని చెప్పుకొచ్చాయి. పీడీపీకి 4 నుంచి 12 సీట్లు వస్తాయని అంచనా వేశాయి. ఇప్పుడు ఫలితాలు చూస్తుంటే మాత్రం బీజేపీ 28 స్థానాల్లో ఆధిక్యంతో రెండో స్థానంలో ఉంటే పీడీపీ నాలుగు స్థానాల్లో మాత్రమే ఆధిక్యత చూపిస్తోంది. కాంగ్రెస్, ఎస్పీ కూటమి మాత్రం దాదాపు 50 స్థానాల్లో స్పష్టమైన పైచేయి సాధించి ఆధికారం చేపట్టే దిశగా దూసుకెళ్తోంది.