సమాజ్‌ వాదీ పార్టీ అధినేత, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. I.N.D.I.A కూటమిలోని ఇతర పార్టీలను కాంగ్రెస్‌ పార్టీ ఫూల్‌ చేస్తోందన్నారు. జాతీయ స్థాయిలో ఆ పార్టీతో పొత్తుపై పునరాలోచిస్తామని స్పష్టం చేశారు. I.N.D.I.A కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న అఖిలేష్ యాదవ్ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. రాష్ట్ర స్థాయిలో పొత్తులు పని చేయవని ముందే చెప్పి ఉంటే, I.N.D.I.A దూరంగా ఉండే వారిమని వెల్లడించారు. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదని లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో చేతులు కలపడంపై పునరాలోచిస్తామంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌, ఎస్పీలు జాతీయ స్థాయిలో పరస్పరం సహకారంతో ముందుకు సాగుతున్నాయి. అఖిలేష్ యాదవ్ వ్యాఖ్యలను చూస్తుంటే I.N.D.I.A కూటమి నుంచి సమాజ్‌ వాదీ పార్టీ బయటకు వచ్చేలా పరిస్థితులు కనిపిస్తున్నాయి.


చిచ్చురేపిన మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు


I.N.D.I.A కూటమిలో ఎలాంటి విభేదాలు లేవని భావిస్తున్న సమయంలో కాంగ్రెస్, ఎస్పీ మధ్య అఖిలేష్ వ్యాఖ్యలు అగ్గిరాజేసినట్లయింది. మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ వైఖరిపై సమాజ్‌ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతీయ స్థాయిలో కూటమిగా ఉన్నప్పుడు, రాష్ట్రానికి కూడా అది వర్తింపజేయాలని అఖిలేష్ యాదవ్ డిమాండ్‌ చేస్తున్నారు. మధ్యప్రదేశ్‌లోని మొత్తం 29 లోక్‌సభ నియోజకవర్గాల్లో 18 స్థానాల్లో పరస్పర అంగీకారంతో అభ్యర్థులను నిలిపేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాయి. బీజేపీ వ్యతిరేక ఓట్లను చీల్చకుండా ఉండేలా పరస్పరం కలిసి పని చేసేలా అంగీకారానికి వచ్చాయి. తాజాగా అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థుల ప్రకటన వ్యవహారంలో కాంగ్రెస్, ఎస్పీల మధ్య విభేదాలు రాజుకున్నాయి. నవరాత్రి ప్రారంభం రోజున మధ్యప్రదేశ్‌లోని 144 స్థానాలకు కాంగ్రెస్‌ అభ్యర్థులను ప్రకటించింది. అదే రోజున 9 మంది అభ్యర్థుల పేర్లను ఎస్పీ వెల్లడించింది. ఇందులో 5 స్థానాల్లో ఇరు పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించడం వివాదానికి ఆజ్యం పోసింది. తాజాగా ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్, మరో 22 నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. ఇందులో 13 స్థానాల్లో కాంగ్రెస్, ఎస్పీ అభ్యర్థులు బరిలో ఉన్నారు. 


వెనుకంజ వేసే ప్రసక్తే లేదు


కాంగ్రెస్ పార్టీ తమతో ఎలా వ్యవహరిస్తుందో, తాము కూడా కాంగ్రెస్ విషయంలో అలాగే ఉంటామన్నారు అఖిలేష్ యాదవ్. ఈ విషయంలో వెనుకంజ వేసే ప్రసక్తే లేదని I.N.D.I.A కూటమిని హెచ్చరించారు. మాజీ ముఖ్యమంత్రి, మధ్యప్రదేశ్‌ పీసీసీ అధ్యక్షుడు కమల్‌నాథ్‌తో అఖిలేష్ యాదవ్ మాట్లాడారు. గతంలో ఎస్పీ ఎమ్మెల్యేలు గెలిచిన స్థానాల, పార్టీ పని తీరుతో పాటు రెండో స్థానంలో నిలిచిన నియోజకవర్గాల గురించి చర్చించారు. ఆరు స్థానాల్లో అభ్యర్థులను ఉపసంహరించుకునేందుకు కాంగ్రెస్‌ హామీ ఇచ్చినట్లు అఖిలేష్ యాదవ్ ప్రకటించారు. కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించే ముందు తమతో ఒక్క మాట కూడా చెప్పలేదన్నారు. రాష్ట్ర స్థాయిలో కూటమి లేదనుకుంటే, జాతీయ స్థాయిలో వాళ్లతో కలిసి ఉండేవాళ్లం కాదని స్పష్టం చేశారు. జాతీయ స్థాయిలో వాళ్లతో పొత్తులో ఉండాలా? లేదా? అన్నదానిపై పునరాలోచిస్తామని తెలిపారు. కాంగ్రెస్, ఎస్పీ మధ్య ఈ వివాదం టీ కప్పులో తుఫాను చల్లారుతుందా ? లేదంటే వేడెక్కుతుందా అన్నది కాలమే సమాధానం చెప్పాలి.