Israel Palestine Attack:
గాజాలో భారతీయులు..
గాజాలో చిక్కుకున్న భారతీయుల్ని సురక్షితంగా వెనక్కి రప్పించడం సవాలుగా మారిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇప్పటికిప్పుడు వాళ్లను తీసుకురావడం కొంచెం కష్టంగానే ఉందని తెలిపింది. నలుగురు పౌరులున్నారని..వీలైనంత త్వరగా వాళ్లను ఇండియాకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని స్పష్టం చేసింది. విదేశాంగ శాఖ (Ministry of External Affairs ) ప్రతినిధి అరిందం బగ్‌చీ ఈ విషయం వెల్లడించారు. సరైన అవకాశం కోసం చూస్తున్నామని, పరిస్థితులు కుదురుకోగానే వెంటనే వెనక్కి తీసుకొస్తామని తెలిపారు. ఈ నలుగురు భారతీయుల్లో ఒకరు వెస్ట్ బ్యాంక్‌లో చిక్కుకున్నట్టు వివరించారు. ఇక గాజాలోని భారతీయుల్ని హత్య చేస్తున్నారన్న ఆరోపణల్ని కొట్టి పారేశారు అరిందం బగ్‌చీ. అలాంటి ఘటనలేమీ జరగడం లేదని తేల్చి చెప్పారు. భారత్‌కి చెందిన ఓ మహిళ సౌత్ ఇజ్రాయేల్‌లో ఉన్నట్టు చెప్పారు. ఇజ్రాయేల్, హమాస్ యుద్ధంలో ఆమె గాయపడిందని తెలిపారు. భర్తతో వీడియో కాల్ మాట్లాడుతుండగా ఉన్నట్టుండి రాకెట్ దాడి జరిగింది. అక్టోబర్ 7వ తేదీన ఈ దాడి జరిగిందని, ఆ దాడిలోనే ఆమె గాయపడిందని విదేశాంగ శాఖ వెల్లడించింది. వేలాది మంది పౌరులు ప్రాణాలు కోల్పోవడంపై భారత్ తీవ్ర విచారం వ్యక్తం చేసింది.
"ప్రధాని నరేంద్ర మోదీ గాజాలోని పరిస్థితులు విచారం వ్యక్తం చేశారు. ట్వీట్ కూడా చేశారు. బాధితుల కుటుంబ సభ్యులకూ ప్రగాఢ సానుభూతి తెలిపారు. హింస ఎక్కడ జరిగినా భారత్ దాన్ని ఖండించేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. పాలస్తీనా సమస్యపై మా స్టాండ్ ఏంటో ఇప్పటికే చాలా స్పష్టంగా చెప్పాం. ఇరు వర్గాల మధ్య చర్చలు జరగాల్సిన అవసరముంది. అంతర్జాతీయ సమాజమూ ఈ యుద్ధంపై జోక్యం చేసుకుని పరిష్కారం చూపించాలి"
- అరిందం బగ్‌చీ, విదేశాంగ శాఖ ప్రతినిధి