2024 లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. మార్చి 7న జరిగిన కాంగ్రెస్‌ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో పేర్లను ఖరారు చేశారు. తాజాగా నేడు (మార్చి 8) దీన్ని ఆమోదించుకొని తొలి అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. ఈ తొలి జాబితా ప్రకారం కేరళలోని వయనాడ్‌ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ బరిలోకి దిగనున్నారు.


కాంగ్రెస్ తొలి జాబితాలో 39 మంది పేర్లు వచ్చాయి. వీరిలో వయనాడ్‌ నుంచి రాహుల్‌ గాంధీ, తిరువనంతపురం నుంచి శశి థరూర్‌, రాజ్‌నంద్‌గావ్‌ నుంచి భూపేశ్‌ బఘెల్‌, మేఘాలయ నుంచి విన్సెంట్‌ పాలా, త్రిపుర పశ్చిమ నుంచి ఆశిష్‌ సాహా పేర్లు వెలువడ్డాయి.




కాంగ్రెస్ తొలి జాబితాలో 39 మంది పేర్లు ఉండగా.. ఇందులో ఛత్తీస్‌గఢ్‌ నుంచి ఆరుగురు, కర్ణాటక నుంచి ఏడుగురు, కేరళ నుంచి 16 మంది, తెలంగాణ నుంచి నలుగురు, మేఘాలయ నుంచి ఇద్దరు, లక్షద్వీప్‌ నుంచి ఒకరు, నాగాలాండ్‌ నుంచి ఒకరు, సిక్కిం నుంచి ఒకరు, త్రిపుర నుంచి ఒకరు అభ్యర్థులు బరిలో నిలిచారు.


తెలంగాణ నలుగురు వీరే


తెలంగాణలో మొత్తం 17 ఎంపీ స్థానాలకు గాను.. 4 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. జహీరాబాద్ నుంచి సురేష్ షెట్కార్, నల్గొండ స్థానానికి కుందూరు రఘువీర్ రెడ్డి, మహబూబ్ నగర్ స్థానానికి వంశీచంద్ రెడ్డి, మహబూబాబాద్ నుంచి పోరిక బలరాం నాయక్ లను అభ్యర్థులు కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసింది.