PM Modi on Mini Skirt Fashion: ప్రధాని నరేంద్ర మోదీ మినీ స్కర్ట్ ఫ్యాషన్ గురించి ప్రస్తావించారు. తొలిసారి National Creators Award కార్యక్రమంలో భాగంగా పలువురు కంటెంట్ క్రియేటర్స్‌కి అవార్డులు ప్రదానం చేశారు మోదీ. ఈ సమయంలోనే వస్త్రధారణ గురించి మాట్లాడారు. ఇప్పుడు మినీ స్కర్ట్‌లు వేసుకుంటే ఫ్యాషన్‌గా భావిస్తున్నారని, కానీ భారతీయ సంస్కృతిలో ఇది ఎప్పుడో ఉందని అన్నారు. మినీ స్కర్ట్‌లను ఆధునికతకు చిహ్నంగా చూస్తున్నారని, కానీ కొన్ని ఆలయాలపై చెక్కిన శిల్పాలను చూస్తే అప్పట్లోనే మినీ స్కర్ట్‌లున్నాయని అర్థమవుతుందని వివరించారు. 


"మినీ స్కర్ట్‌లు వేసుకోవడాన్ని ఆధునికతకు చిహ్నంగా భావిస్తున్నారు. అదే ఫ్యాషన్ అనుకుంటున్నారు. కానీ మన భారతీయ కళని పరిశీలిస్తే ఈ ఫ్యాషన్ ఎప్పుడో ఉందని అర్థమవుతుంది. కోణార్క్ ఆలయాన్ని చూడండి. అక్కడ శతాబ్దాల క్రితం నాటి శిల్పాలు మినీ స్కర్ట్‌లలో కనిపిస్తాయి. పైగా చేతులకు పర్స్‌లు కూడా ఉంటాయి. వందల ఏళ్ల క్రితమే అప్పటి శిల్పులు ఫ్యాషన్‌కి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో ఎంత కొత్తగా ఆలోచించారో తెలుస్తుంది"


- ప్రధాని నరేంద్ర మోదీ


ప్రపంచానికి ఫ్యాషన్ రంగంలో భారత్ ఎప్పుడో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిందని ప్రశంసలు కురిపించారు ప్రధాని మోదీ. 19 ఏళ్ల జాహ్నవి సింగ్‌కి Heritage Fashion Icon Awardని ప్రదానం చేసిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రెడీమేడ్ దుస్తులకు పెరుగుతున్న డిమాండ్ గురించీ ప్రధాని ప్రస్తావించారు. భారతీయత ఉట్టిపడే దుస్తులని అంతర్జాతీయంగా ప్రమోట్ చేయాల్సిన బాధ్యత యువతపైనే ఉందని అన్నారు. గ్లోబల్ మార్కెట్‌లో ఫ్యాషన్ రంగంలో పోటీని తట్టుకుని నిలబడగలిగే సామర్థ్యం భారత్‌కి ఉందని స్పష్టం చేశారు. భారత్‌కి మాత్రమే సొంతమైన సంస్కృతి సంప్రదాయాలను ఇలా దుస్తుల ద్వారా ప్రపంచానికి పరిచయం చేయాలని సూచించారు.