Russia-Ukraine War: కొంత మంది భారతీయుల్ని బలవంతంగా రష్యా ఉక్రెయిన్ యుద్ధంలోకి పంపుతున్నారన్న వార్తలు అంతర్జాతీయంగా సంచలనం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే ఓ భారతీయుడు అక్కడ జరిగిన దాడిలో ప్రాణాలు కోల్పోయాడు. దీనిపై భారత విదేశాంగ శాఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కొన్ని సంస్థలు హ్యూమన్ ట్రాఫికింగ్ పాల్పడుతున్నాయని స్పష్టం చేసింది. ఆయా ఏజెన్సీలపై CBI దాడులు సోదాలు నిర్వహించిందని వెల్లడించింది. అక్కడి బాధితులందరినీ గుర్తించి వీలైనంత త్వరగా భారత్‌కి రప్పించేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నట్టు తెలిపింది. భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ ఈ విషయం వెల్లడించారు.
"రష్యా ఆర్మీలో కొంతమంది భారతీయులతో బలవంతంగా యుద్ధం చేయిస్తున్నారు. ఈ విషయాన్ని మేం చాలా తీవ్రంగా పరిగణిస్తున్నాం. ఇలా వాళ్లను తప్పుదోవ పట్టించిన ఏజెన్సీలపై కఠిన చర్యలకు ఆదేశించాం. రష్యన్ ఆర్మీకి సపోర్టింగ్ స్టాఫ్‌గా ఉన్న భారతీయుల్ని వీలైనంత త్వరగా ఆ చెర నుంచి విడిపించి ఇండియాకి భద్రంగా రప్పించేందుకు ప్రయత్నిస్తున్నాం"
- రణ్‌ధీర్ జైస్వాల్, విదేశాంగ శాఖ ప్రతినిధి
దేశవ్యాప్తంగా జరిపిన సోదాలు, దాడుల్లో మానవ అక్రమ రవాణా నెట్‌వర్క్ బయటపడిందని జైస్వాల్ వెల్లడించారు. పలువురు ఏజెంట్లపై సీబీఐ కేసులు సైతం నమోదు చేసిందని స్పష్టం చేశారు. ఇలాంటి ఏజెంట్ల మోసపూరిత ప్రకటనలు నమ్మవద్దని భారతీయులను కోరుతున్నట్టు తెలిపారు. ఇది అత్యంత ప్రమాదం, ప్రాణాలకు ముప్పుతో కూడిన వ్యవహారమని హెచ్చరించారు. రష్యన్ సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయులను వెనక్కి పంపించే ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నట్టు తేల్చి చెప్పారు. 20 మంది భారతీయులు ఇప్పటికే తమను సంప్రదించినట్టు తెలిపారు. హ్యూమన్ ట్రాఫికింగ్ వలలో చిక్కుకున్నట్టు వివరించారు. విదేశాంగ శాఖ చెప్పిన లెక్కల ప్రకారం..ఇప్పటికే ఇద్దరు భారతీయులు మృతి చెందారు. ఇటీవల మరో వ్యక్తి ఇజ్రాయేల్ దాడిలో ప్రాణాలు కోల్పోయాడు.
హైదరాబాద్ వాసి మృతి..
రష్యా - ఉక్రెయిన్ యుద్ధంలో హైదరాబాద్ (Hyderabad)కు చెందిన యువకుడు మృతి చెందాడు. పాతబస్తీకి చెందిన మహ్మద్ అఫ్సాన్ (30) (Mohammad Afsaan) అనే వ్యక్తి ఉక్రెయిన్ తో జరుగుతున్న యుద్ధంలో రష్యా తరఫున పోరాడుతూ ప్రాణాలు కోల్పోయినట్లు అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. అఫ్సాన్ మృతి విషయాన్ని అధికారులు బుధవారం వెల్లడించారు. అఫ్సన్ ను హెల్పర్ ఉద్యోగం కోసం ఏజెంట్లు హైదరాబాద్ నుంచి రష్యా తీసుకెళ్లారు. అక్కడ ఉద్యోగం విషయంలో మోసపోవడంతో అఫ్సన్ రష్యన్ ఆర్మీలో బలవంతంగా చేరాల్సి వచ్చినట్లు తెలుస్తోంది.
Also Read: బెంగళూరు పేలుడు కేసు - అనుమానితుడి వీడియోలు విడుదల చేసిన NIA