Bengaluru Blast Case Updates: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో అనుమానితుడి వీడియోని అధికారికంగా విడుదల చేసింది NIA.ప్రస్తుతం ఈ వ్యక్తి ఆచూకీ తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ వీడియోలో అనుమానితుడు మాస్క్ పెట్టుకుని కనిపించాడు. మొత్తం రెండు వీడియోలు విడుదల చేసింది. ఒక వీడియోలో అనుమానితుడు క్యాప్ పెట్టుకుని బ్యాగ్‌తో కనిపించాడు. అదే వ్యక్తి బస్‌ ఎక్కుతున్న వీడియోనీ NIA రిలీజ్ చేసింది. ఇప్పటికే ఈ కేసుతో సంబంధం ఉందన్న అనుమానంతో ఓ ఉగ్రవాదిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

  






ఓ అనుమానిత ఉగ్రవాదిని అదుపులోకి తీసుకుంది NIA. ఐసిస్‌తో లింక్‌లున్నాయా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. అనుమానిత ఉగ్రవాది మినాజ్ అలియాస్ సులేమాన్‌ని బళ్లారి సెంట్రల్ జైల్‌కి తరలించారు. ప్రస్తుతం మినాజ్‌ని NIA పూర్తి స్థాయిలో విచారిస్తోంది. బళ్లారిలోనే కౌల్ బజార్‌లో ఉంటున్న సులేమాన్‌కి ఐసిస్‌కి చెందిన ఇద్దరు ఉగ్రవాదులతో సంబంధం ఉన్నట్టు తెలుస్తోంది. గతేడాది డిసెంబర్‌లో మినాజ్‌ అరెస్ట్ అయ్యాడు. ఇప్పుడు రామేశ్వరం పేలుడు కేసుకి మినాజ్‌కి లింక్ ఉండొచ్చని NIA అనుమానిస్తోంది. అందుకే అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తోంది. మార్చి 9వ తేదీ వరకూ ఈ కస్టడీ ఉంటుంది. ఈ కేసుపై ప్రభుత్వం ఎప్పటికప్పుడు కీలక వివరాలు వెల్లడిస్తోంది. అన్ని కోణాల్లోనూ విచారణ జరుపుతున్నట్టు స్పష్టం చేసింది.


బెంగళూరు బాంబు పేలుడు కేసులో ప్రధాన నిందితుడికి సంబంధించిన ఆచూకీ గానీ వివరాలు గానీ తెలియజేసిన వారికి రూ.10 లక్షల నజరానా ఇస్తామని NIA ప్రకటించింది. ఈ సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చింది. ఇప్పటికే నలుగురిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతోంది. మార్చి 1వ తేదీన బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో బాంబు పేలుడు సంభవించింది. మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ పేలుడులో పది మంది గాయపడ్డారు. కేఫ్‌లోని ఓ బ్యాగ్‌లో IEDని గుర్తించారు. కేఫ్‌లోని సీసీ కెమెరాలో నిందితుడి విజువల్స్ రికార్డ్ అయ్యాయి. మాస్క్‌, టోపీ, గ్లాసెస్ పెట్టుకుని పూర్తిగా ఫేస్‌ని కవర్ చేసుకున్నాడు. కేఫ్‌కి వచ్చిన నిందితుడు ఇడ్లీ ఆర్డర్ ఇచ్చాడు. ఆ తరవాత తన వెంట తెచ్చుకున్న బ్యాగ్‌ని అక్కడే చెట్టు దగ్గర వదిలేసి వెళ్లిపోయాడు. ఆ తరవాత కాసేపటికే బాంబు పేలింది. కేఫ్‌లోనే దాదాపు 9 నిముషాల పాటు నిందితుడు ఉన్నట్టు సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలను బట్టి తెలుస్తోంది.