Delhi Elections : దేశ రాజధాని ఢిల్లీలో ఎన్నికలు కోసం రాజకీయ పార్టీలు సమాయత్తం అవుతున్నారు. ఈ తరుణంలో ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సోషల్ మీడియాలో ఓ ఇంట్రస్టింగ్ పోస్ట్ చేశారు. తన పార్టీ సహచరురాలు, ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషిని త్వరలో అరెస్టు చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. అంతకంటే ముందు ఆప్ సీనియర్ నేతలపై దాడులు నిర్వహించే అవకాశం ఉందని ఆయన అంచనావేశారు. సీఎం అతిషి ఇటీవల ముఖ్యమంత్రి సంజీవని యోజన, మహిళా సమ్మాన్ యోజన పథకాలు ప్రకటించడం కొందరికి నచ్చడం లేదన్నారు. అంతే కాదు పలువురు ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నేతల ఇళ్లల్లోనే సోదాలు జరిగే అవకాశముందని చెప్పారు.


ఢిల్లీలోని 18 ఏళ్లు పైబడిన మహిళలందరికీ రూ. 2100 ఇస్తానని, ఆ పైన ఉన్న వ్యక్తులకు ఉచిత చికిత్స అందించే సంజీవిని యోజన ద్వారా ఢిల్లీ ప్రభుత్వ మహిళా సమ్మాన్ యోజనతో కొందరు కలత చెందారని కేజ్రీవాల్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. "మహిళా సమ్మాన్ యోజన, సంజీవని యోజనతో ఈ వ్యక్తులు తీవ్రంగా కలత చెందారు. ఫేక్ కేసు పెట్టి అతిషీ జీని మరికొద్ది రోజుల్లో అరెస్టు చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అంతకంటే ముందు, సీనియర్ ఆప్ నాయకులపై దాడులు నిర్వహిస్తారు" అని కేజ్రీవాల్ పోస్ట్ లో రాశారు.





 ఢిల్లీలో 2025లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఆప్ ను మరోసారి గెలిపిస్తే మహిళా సమ్మాన్ యోజన, సంజీవని యోజన పతకాలు అమలు చేస్తామని ఢిల్లీ ప్రజలకు కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. మహిళా సమ్మాన్ యోజన పథకం అప్లై చేసుకునేందుకు మహిళలు ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదని, తమ వాలంటీర్లే మహిళల దగ్గరకు వచ్చి రిజిస్ట్రేషన్ పూర్తి చేయిస్తామన్నారు. మరోపక్క ఆప్ ఇలా ప్రచారం చేస్తుండడంపై బీజీపే భగ్గుమంటోంది. ఇవి ఢిల్లీ ప్రభుత్వ పథకాలు కావని, ఎన్నికల్లో ఓట్ల కోసమే ఈ తరహా హామీలు ఇస్తూ, ప్రచార చేస్తున్నారని ఆరోపిస్తోంది. కేజ్రీవాల్, అతిషి మధ్య సంబంధాలు దెబ్బతినడం వల్లే ఆప్ ఈ పథకాలను తీసుకురానున్నట్టు చెబుతోందని తెలిపింది. ఇకపోతే వచ్చే ఎన్నికల్లో మాజీ సీఎం కేజ్రీవాల్ ఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయనుండగా.. సీఎం అతిషి మరోసారి కాల్కాజీ నుంచి బరిలో నిలవనున్నారు.


శాంతాక్లాజ్ వేషధారణలో కేజ్రీవాల్


క్రిస్మస్ సందర్భంగా ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ శాంతాక్లాజ్ వేషధారణలో కనిపించారు. ప్రజలకు బహుమతుల రూపంలో పలు ప్రభుత్వ పథకాలను అందిస్తున్నట్టు వీడియో రూపొందించిన ఆప్.. దీన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇందులో కేజ్రీవాల్ శాంతాక్లాజ్ వేషంలో కనిపించారు. దీంతో పాటు ఢిల్లీ ప్రజలకు సొంత శాంతా ఏడాది పొడవునా గిఫ్ట్స్ ఇస్తున్నారంటూ ఆప్ రాసుకొచ్చింది. అయితే ఇది ఏఐ క్రియేటెడ్ వీడియోనా.. లేదంటే కేజ్రీవాలే స్వయంగా శాంతాక్లాజ్ వేషం వేసుకున్నరా.. అన్న విషయం మాత్రం తెలియలేదు.






Also Read : Vajpayee 100th Birth Anniversary: రాజ్యాంగానికి కట్టుబడి అధికారాన్ని వదులుకున్న గొప్ప నేత వాజ్‌పేయి: ప్రధాని మోదీ