Atal Bihari Vajpayee Birth Anniversary | న్యూఢిల్లీ: నేడు భారతరత్న వాజ్‌పేయి శత జయంతి. భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి 100వ జయంతి సందర్భంగా ఢిల్లీలోని ఆయన స్మారక చిహ్నం 'సదైవ్ అటల్' వద్ద రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధంఖర్ నివాళులర్పించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీతో పాటు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, పలువురు ఎంపీలు, సీనియర్ నేతలు  దివంగత నేత వాజ్‌పేయికి నివాళుర్పించారు.






సుపరిపాలన దినోత్సవ వేడుకలు..


మాజీ ప్రధాని వాజ్‌పేయి శత జయంతి సందర్భంగా ప్రధాని మోదీ సుపరిపాలన దినోత్సవ వేడుకలపై స్పందించారు. బీజేపీ మూలస్తంభమైన వాజ్‌పేయి వారసత్వాన్ని ప్రస్తావించారు. "ఈ రోజు దివంగత నేత వాజ్‌పేయి జయంతిని పురస్కరించుకుని మనం 'సుపరిపాలన దినోత్సవం' జరుపుకుంటున్నాం. సుపరిపాలన అంటే కేంద్రానికి అధికారం అని కాదు, సేవ చేసే అవకాశంగా భావిస్తాం" అని వీడియో సందేశంలో పేర్కొన్నారు. వాజ్‌పేయి, ఎల్‌కే అద్వానీలు బీజేపీకి మూల స్తంభాలుగా నిలిచి 2 సీట్లు ఉన్న పార్టీని అనంతర కాలంలో దేశంలో పటిష్టమైన పార్టీగా నిలిపారు. బీజేపీ అభివృద్ధికి దారులు వేసిన ఘనత వారిదే.






ప్రధాని మోదీ వాజ్‌పేయి విధానాలు, రాజకీయాలను ప్రశంసిస్తూ ఓ కథనం రాశారు. "వాజ్‌పేయి ప్రభుత్వం ఆర్థిక వృద్ధిని సాధించడంతో పాటు సుదూర ప్రాంతాలను మరింత చేరువ చేసింది. ఆయన విజన్ ఐక్యత,  సమైక్యతను పెంపొందించింది" అని మోదీ పేర్కొన్నారు.


నిబంధనలకు మారుపేరు వాజ్‌పేయి 
వాజ్‌పేయి అవకాశవాద రాజకీయాల ద్వారా అధికారం కోసం తపించే వ్యక్తి కాదని ప్రధాని మోదీ పేర్కొన్నారు. నేతల్ని కొనడం లాంటివి చేయకుండా 1996 లో రాజీనామా చేయడానికి ప్రాధాన్యత ఇచ్చిన గొప్పనేత వాజ్‌పేయి. 1999లో సైతం ఆయన ప్రభుత్వం కేవలం ఒక్క ఓటుతో ఓడిపోయింది. అనైతిక రాజకీయాలను సవాలు చేయాలని ఎంతో మంది ఆయన రూల్స్ పాటించారు.


రాజ్యాంగానికి కట్టుబడి ఉన్న వాజ్‌పేయి
వాజ్‌పేయి రాజ్యాంగానికి కట్టుబడి నడుచుకుంటూ, ఎన్నో తరాలకు ఆదర్శంగా నిలిచారని ప్రధాని మోదీ అన్నారు. ఎమర్జెన్సీ వ్యతిరేక ఉద్యమానికి మూలస్తంభంగా నిలిచారు. ఎమర్జెన్సీ తర్వాత 1977 ఎన్నికలకు ముందు తన పార్టీ జనసంఘ్ ను జనతా పార్టీలో విలీనం చేశారు. ఆ విషయం ఆయనను కచ్చితంగా బాధించి ఉండవచ్చు. కానీ రాజ్యాంగ పరిరక్షణపై యోచించి వాజ్‌పేయి ఆ నిర్ణయం తీసుకున్నారని ప్రధాని మోదీ అన్నారు.


Also Read: CM Chandrababu: దేశగతిని మార్చిన వాజ్‌పేయి దూరదృష్టి, ఆయన ఆలోచన తీరు విలక్షణమైనది: చంద్రబాబు