Civils Results 2022:  ఢిల్లీ పోలీసు శాఖలో హెడ్ కానిస్టేబుల్ గా పని చేస్తున్న రామ్ భజన్ కుమార్ సివిల్స్ లో 667వ ర్యాంకు సాధించి అందరికీ ఆదర్శంగా నిలిచాడు. ఆయన వయసు 34 సంవత్సరాలు. ఎనిమిదో ప్రయత్నంలో ఆయన ఈ ర్యాంకు సాధించాడు. ప్రస్తుతం సైబర్ సెల్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వర్తిస్తున్నారు.


సివిల్స్ ఫలితాలు వెలుబడిన తర్వాత రామ్ భజన్ కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు, సహచరులు, సీనియర్ అధికారులు ఆయనను అభినందించారు. ఓబీసీ కేటగిరీకి చెందిన రామ్ భజన్ కు తొమ్మిది సార్లు సివిల్స్ రాసేందుకు అనుమతి ఉంది. ఎట్టకేలకు ర్యాంకు సాధించడం ద్వారా తన కల నెరవేర్చుకున్నానని... ఆయన చెప్పారు. ఒకవేళ ఈసారి విఫలమైనా తొమ్మిదో సారి పరీక్ష రాయాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. అప్పటి దాకా ఏడు ప్రయత్నాలు సఫలం కాకపోయినా నిరాశ పడలేదని అన్నారు. తన భార్య అందించిన అండదండలతోనే ఇది సాధ్యమైందని ఆయన చెప్పుకొచ్చారు. 









రామ్ భజన్ రాజస్థాన్ నుంచి వచ్చినట్లు... అక్కడ తన తండ్రి కూలీగా పని చేస్తున్నట్లు వివరించారు. కష్టాల్లోనే పుట్టి పెరిగానని పేర్కొన్నారు. అంకితభావం, కఠొర శ్రమ, సహనంతో అనుకున్న లక్ష్యం సాధించడం సులువేనని వివరించారు. కానిస్టేబుల్ గా పనిచేస్తూ 2019లో యూపీఎస్సీ పరీక్షలో ర్యాంకు సాధించిన ఫిరోజ్ ఆలం తనకు స్ఫూర్తిగా నిలిచారని చెప్పారు. రామ్ భజన్ 2009లో పోలీసు శాఖలో కానిస్టేబుల్ గా చేరారు. 


Also Read: Adilabad News: వంట కార్మికురాలి కొడుకు సివిల్స్‌లో 410వ ర్యాంకర్‌ - అదరగొట్టిన దళిత బిడ్డ


యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(UPSC) మే 23న సివిల్ సర్వీసెస్ పరీక్ష (UPSC CSE 2022) తుది ఫలితాలను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలో యూపీకి చెందిన ఇషితా కిశోర్ అగ్రస్థానంలో నిలిచింది. అదే సమయంలో బిహార్‌కు చెందిన గరిమా లోహియా రెండో స్థానంలో నిలిచింది. ఇక తెలంగాణకు చెందిన ఎన్ ఉమా హారతి మూడో స్థానం కైవసం చేసుకుంది. యూపీకి చెందిన స్మృతి మిశ్రా నాలుగో స్థానంలో నిలవగా.. అసోంకి చెందిన మయూర్ హజారికా ఐదో స్థానం, కొట్టాయంకు చెందిన గెహనా నవ్య జేమ్స్ ఆరోస్థానం దక్కించుకున్నారు. 


మొదటి 4 ర్యాంకులు అమ్మాయిలవే.. 
సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో అమ్మాయిలు మరోసారి సత్తాచాటారు. మొదటి నాలుగు ర్యాంకులను అమ్మాయిలే సాధించడం విశేషం. వీరిలో ఇషితా కిశోర్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకుతో మెరవగా.. గరిమ లోహియా, ఉమా హారతి ఎన్. స్మృతి మిశ్రా తర్వాతి నాలుగు ర్యాంకుల్లో నిలిచి సత్తాచాటారు.


సివిల్స్ టాపర్‌గా ఇషితా కిశోర్.. 
ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఇషిత కిషోర్.. సివిల్ సర్వీసెస్ తుది ఫలితాల్లో టాపర్‌గా నిలిచింది. ఇషిత తన మూడో ప్రయత్నంలోనే విజయం సాధించారు. మొదటి రెండు ప్రయత్నాల్లో ప్రిలిమినరీ పరీక్ష కూడా అర్హత సాధించలేకపోంది. అయితే మూడో ప్రయత్నంలో మాత్రం ఏకంగా ఇంటర్వ్యూ వరకు వెళ్లి, సివిల్స్ టాపర్‌గా నిలవడం విశేషం. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా తొలి ర్యాంకు సాధించడం పట్ల ఇషిత కిషోర్ తన ఆనందాన్ని ట్విటర్ వేదికగా వ్యక్తం చేశారు. అయితే సివిల్స్‌లో క్వాలిఫై అవుతాననే ధీమా ముందు నుంచే ఉందన్న ఇషితా.. కానీ తొలి ర్యాంకు వస్తుందని అసలు ఊహించలేదని తెలిపారు.


Also Read: కోచింగ్ లేకుండా 35వ ర్యాంకు - సివిల్స్ లో సత్తా చాటిన గిరిజన విద్యార్థి