Chandrayaan-4 Launch: చంద్రయాన్‌-3 చారిత్రాత్మక విజయం సాధించిన తర్వాత... చంద్రయాన్‌-4 ప్రయోగానికి సిద్ధమైంది భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో). చంద్రయాన్‌-4 గురించి ఇస్రో చైర్మన్‌ సోమనాథ్‌ ఆసక్తికర విషయాలు తెలిపారు. చంద్రుడి పైకి ఇప్పటి వరకు పంపిన చంద్రయాన్‌ మిషన్‌లు ఒకే దశలో ప్రయోగించబడ్డాయి. కానీ... చంద్రయాన్‌-4 మాత్రం రెండు దశలో ప్రారంభించడుతుందని ఇస్రో చీఫ్‌ తెలిపారు. ఇందు కోసం రెండు వాహన నౌకలు సిద్ధం చేస్తున్నట్టు  చెప్పారాయన. ఇటీవల జరిగిన నేషనల్‌ స్పేస్‌ సైన్స్‌ సింపోజియమ్‌లో చంద్రయాన్‌-4కు సంబంధించిన విషయాలను పంచుకున్నారు. చంద్రుడి పైనుంచి రాళ్లు, మట్టి శాంపిల్స్‌ను భూమి మీదకు తీసుకురావడమే లక్ష్యంగా చంద్రయాన్‌-4ను  ప్రయోగిస్తామన్నారు. 


చంద్రయాన్‌-4 ఎలా పనిచేస్తుంది...?
చంద్రయాన్-3లో మూడు ప్రధాన భాగాలు ఉన్నాయి. అవి ల్యాండర్, రోవర్, ప్రొపల్షన్ మాడ్యూల్. కానీ... చంద్రయాన్-4 మిషన్‌లో ఐదు మాడ్యూల్స్‌ ఉండనున్నాయి. చంద్రుడి పైనుంచి శాంపిల్స్‌ను భూమిపైకి వదలడానికి మరో రెండు  మాడ్యూల్స్‌ను అదనంగా చేర్చారు. చంద్రయాన్‌-4లో మొత్తం ఐదు స్పేస్‌క్రాఫ్ట్‌ మాడ్యూల్స్‌ ఉంటాయని చెప్పారు ఇస్రో చైర్మన్‌ సోమనాథ్‌. ప్రొపల్షన్‌, డిసెండర్‌, అసెండర్‌, ట్రాన్స్‌ఫర్‌, రీ-ఎంట్రీ అనే ఐదు మాడ్యూల్స్‌ ఉంటాయని చెప్పారాయన. మొదటి  మాడ్యూల్‌ ప్రొపల్షన్‌... చంద్రయాన్‌-3లో మాదిరే భూకక్ష్య నుంచి జాబిల్లి కక్ష్యంలోకి వెళ్లే సమయంలో చంద్రయాన్‌-4కు మార్గనిర్దేశం చేస్తుంది. ఇక.. రెండోది డిసెండర్‌.. ఈ మాడ్యూల్‌... ల్యాండర్‌ చంద్రుడిపై దిగడంలో కీలకంగా వ్యవహరిస్తుంది.  మూడో మాడ్యూల్‌ అసెండర్‌... ఇది జాబిల్లిపై తిరుగుతున్న రోవర్‌ రాళ్లు, మట్టి నమూనాలను సేకరించిన తర్వాత వాటిని ల్యాండర్‌ నుంచి భూ కక్ష్యలోకి తీసుకువస్తుంది. నాలుగోది ట్రాన్స్‌ఫర్‌ మాడ్యూల్‌‌. ఇది చంద్రుడి కక్ష్య నుంచి అసెండర్‌  మాడ్యూల్‌ను భూమిపైకి పంపుతుంది. చివరిగా ఐదోది‌... రీఎంట్రీ మాడ్యూల్‌.. ఇది ప్రాజెక్టులో కీలకంగా వ్యవహరిస్తుంది. కాప్య్సూల్‌ ఆకారంలో ఉండే ఇందులోనే నమూనాలు ఉంటాయని ఇస్రో చైర్మన్‌ తెలిపారు. 


చంద్రయాన్-4 రెండు దశల ప్రయోగం వివరాలు
ఐదు మాడ్యూల్స్‌లో.. మొదటి మూడు మాడ్యూల్స్‌ను ఇస్రో భారీ అంతరిక్ష వాహక నౌక ఎల్‌వీఎం-3 ద్వారా పంపనున్నారు. ఈ ప్రయోగం చంద్రయాన్-3 తరహాలోనే ఉంటుంది. LVM-3 భారతదేశపు అత్యంత బరువైన ఉపగ్రహ ప్రయోగ వాహనం. మిగిలిన రెండు మాడ్యూల్స్‌ని పోలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌ (PSLV) తీసుకెళ్తుంది. ఒక మిషన్‌ కోసం రెండు వాహన నౌకలు వాడుతున్న మొదటి ప్రయోగం ఇదే. చంద్రయాన్-4 ఒక ఛాలెంజింగ్‌ మిషన్‌ అని అన్నారు సోమనాథ్‌. సంక్లిష్టమైన లక్ష్యాలను చేధిస్తుందని చెప్పారు. చంద్రయాన్-4 విజయవంతం అయితే.. చంద్రుడి ఉపరితలం నుంచి నమూనాలను తిరిగి తీసుకువచ్చే నాలుగో దేశంగా భారతదేశం నిలుస్తుంది. 


చంద్రయాన్‌-4ను ఎప్పుడు ప్రయోగిస్తారు..?.. ఎలా ప్రయోగిస్తారు..?
2028లో చంద్రయాన్-4ను ప్రయోగించే అవకాశం ఉంది. అధికారికంగా తేదీని ఇంకా ప్రకటించలేదు. గతంలో ప్రకటించిన వివరాల ప్రకారం.. చంద్రయాన్‌-4లో ల్యాండర్‌... 90 డిగ్రీల దక్షిణ అక్షాంశం దగ్గర దిగుతుంది. ఇందులో 350 కేజీల బరువున్న రోవర్‌ను పంపనున్నారు. చంద్రయాన్‌-3లో అయితే రోవర్‌ బరువు 30 కేజీలు మాత్రమే. కానీ.. చంద్రయాన్‌-4లో 350 కేజీల బరువున్న రోవర్‌ను పంపుతున్నారు. ఇది చంద్రుడిపై కిలోమీటరు దూరం వరకు తిరుగుతుంది. చంద్రయాన్‌-3 మిషన్ జీవితకాలం ఒక లునార్‌ డే అంటే భూమిపై 14 రోజులు. కానీ...  చంద్రయాన్‌-4 జీవితకాలం ఏడు లునార్‌ డే అంటే... భూమిపై సుమారు వంద రోజులన్నమాట. ఈ సమయంలో రోవర్‌లోని పరికరాలు చంద్రుడిపై రాళ్లు, మట్టి నమూనాలను సేకరిస్తాయి.