Chandrayaan 3 Rover: చంద్రుడిపై రోవర్ 'ప్రజ్ఞాన్' గురించి ఇస్రో మరో అప్‌డేట్ ఇచ్చింది. అనుకున్న ప్రకారం రోవర్ ప్రయాణం కొనసాగిస్తోందని తెలిపింది. 26 కిలోల రోవర్ చంద్రుడి ఉపరితలంపై దాదాపు 8 మీటర్ల దూరాన్ని విజయవంతంగా ప్రయాణించిందని ఇస్రో తెలిపింది. రోవర్ పేలోడ్‌లు LIBS, APXS ఆన్ అయ్యాయని సోషల్ మీడియా ఎక్స్(ట్విటర్)లో పేర్కొంది. ప్రొపల్షన్ మాడ్యూల్, ల్యాండర్ మాడ్యూల్, రోవర్‌లోని అన్ని పేలోడ్‌లు మెరుగ్గానే పని చేస్తున్నట్లు తెలిపింది. చంద్రయాన్ గురించి ఎప్పటికప్పుడు ఇస్రో ట్విటర్‌లో పోస్ట్ చేస్తూ అప్‌డేట్లను ఇస్తోంది.
APXS అంటే ఆల్ఫా పార్టికల్ ఎక్స్-రే స్పెక్ట్రోమీటర్, LIBS అంటే లేజర్ ప్రేరిత బ్రేక్‌డౌన్ స్పెక్ట్రోస్కోప్. ఈ పేలోడ్‌లు ల్యాండింగ్ సైట్‌కు సమీపంలోని ఎలిమెంటల్ కంపోజిషన్‌ను పొందేందుకు ఉపయోగపడతాయి. ల్యాండర్ 'విక్రమ్' నుంచి రోవర్ 'ప్రజ్ఞాన్' చంద్రుని ఉపరితలంపైకి దిగుతున్న వీడియోలను ఇస్రో విడుదల చేసింది. ల్యాండర్ ఇమేజర్ కెమెరా ద్వారా ఈ వీడియోలను చిత్రీకరించింది. మొదటి వీడియా రోవర్ ల్యాండర్ నుంచి ర్యాంప్ మీదుగా నెమ్మదిగా చంద్రుడిపైకి దిగడం చూజారడం మరియు చంద్రునిపైకి జారడం చూడవచ్చు. మరో వీడియోలో రోవర్ క్రిందికి దించేందుకు ల్యాండర్ ర్యాంప్ తెరవడం చూడొచ్చు.
చంద్రుడి రహస్యాలు ఛేదించే పనిలో ఉంది చంద్రయాన్-3. జాబిల్లిపై ల్యాండ్ అయిన విక్రమ్ ల్యాండర్, అందులో నుంచి దిగి చంద్రుడి ఉపరితలంపై తిరుగుతున్న రోవర్ శాస్త్రవేత్తలకు కావాల్సిన సమాచారం చేరవేస్తున్నాయి. ఇప్పటికే చంద్రుడి ఉపరితలం ఫొటోలు, వీడియోలు కూడా పంపాయి. అయితే వాటి జీవితకాలం 14 రోజులు మాత్రమే. చంద్రుడిపై దిగిన ల్యాండర్ జాబిల్లిపై తిరుగుతున్న రోవర్ ఏ ప్రయోగాలు చేసినా ఏ ఫొటోలు, వీడియోలు తీసినా ఆ 14 రోజులే. ఏం చేసినా... అప్పడే చేయాలి. 14 రోజులు దాటితే అంతా ప్రతికూలతే.
ఎలా ఎందుకు? అసలు ఈ 14రోజుల టార్గెట్ ఏంటి? చంద్రుడి ఉపరితలంపై ఒక రోజు అంటే భూమిపై సుమారుగా 28 రోజులతో సమానం. అంటే మన లెక్కప్రకారం 14 రోజులు చంద్రుడి ఉపరితలంపై పగలు, 14 రోజులు రాత్రి ఉంటుంది. ఈ లెక్కన ఆగస్టు 23న చంద్రుడిపై పగలు మొదలైంది. ల్యాండర్‌ను సురక్షితంగా దించాలంటే సూర్యరశ్మి అవసరం. అందుకే 23వ తేదీని సాఫ్ట్ ల్యాండ్ చేసేందుకు ఇస్రో ఎంచుకుంది. మన లెక్కన 14 రోజుల పాటు ల్యాండర్, రోవర్ చంద్రుడిపై పనిచేస్తాయి. అందుకే చంద్రుడిపై పగలు ఉండే 14 రోజులే వీటి జీవితకాలం అని ఇస్రో ప్రకటించింది. ఆ తర్వాత రాత్రి అవగానే ప్రతికూల పరిస్థితులు ఏర్పడి ల్యాండర్, రోవర్‌లోని వ్యవస్థలు పని చేయవు.
ల్యాండర్ గాని, రోవర్ గాని పనిచేయడానికి.. సేకరించిన సమాచారాన్ని భూమికి పంపడానికి విద్యుత్ అవసరం. వాటికి కావాల్సిన విద్యుత్ సూర్యకాంతి నుంచి సేకరించుకుంటాయి. అందుకే చంద్రునిపై సూర్యోదయం అయ్యే సమయానికి ల్యాండర్‌ను ఇస్రో విజయవంతంగా ల్యాండ్ చేసింది. ల్యాండర్, రోవర్‌కు అమర్చిన సోలార్ ప్యానల్ సౌర శక్తిని స్వీకరించి విద్యుత్ శక్తిగా మార్చుకుంటాయి. ఆ శక్తి ద్వారా ల్యాండర్, రోవర్ పనిచేస్తాయి.