Tamil Nadu: తమిళనాడులోని ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహార పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి 5వ తరగతి వరకు చదువుతున్న బాలబాలికలకు మధ్యాహ్న భోజనంతో పాటు ఉదయం అల్పాహారం కూడా అందిస్తారు. మధ్యాహ్న భోజనంతో పాటు అల్పాహారం అందిస్తున్న తొలి రాష్ట్రం తమిళనాడు కావడం విశేషం.
నాగపట్టణం జిల్లాలోని తిరుక్కువళై ప్రాథమిక పాఠశాలలో ఈ పథకాన్ని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రారంభించారు. చిన్నారులకు అందించే అల్పాహారాన్ని పరిశీలించిన సీఎం... అనంతరం చిన్నారులకు స్వయంగా అల్పాహారాన్ని వడ్డించారు. వారితో పాటు బంతిలో కూర్చొని అల్పాహారాన్ని రుచి చూశారు. చెన్నైలో స్టాలిన్ కుమారుడు, రాష్ట్ర మంత్రి ఉదయనిధి స్టాలిన్ ఈ పథకాన్ని ప్రారంభించారు. అయితే, ఈ అల్పాహార పథకం గత సంవత్సరం సెప్టెంబరు నెలలోనే స్టాలిన్ ప్రభుత్వం ప్రారంభించింది. ప్రయోగాత్మకంగా 1545 పాఠశాలల్లో అమలు చేసింది. రక్త హీనత, పోషకాహార లోపం, ఆకలి బాధలు లేకుండా చూడటం కోసం, అలాగే పాఠశాలలో చిన్నారుల హాజరు శాతాన్ని పెంచడం కోసం సర్కారు ఈ పథకాన్ని తీసుకువచ్చింది. తొలి దశలో ప్రయోగాత్మకంగా ఈ పథకాన్ని అమలు చేయగా సత్ఫలితాలు వచ్చాయి. సర్కారు చేసిన ఆలోచనతో పాఠశాలల్లో పిల్లల హాజరు శాతం పెరగడంతో పాటు.. వారు ఉదయం అల్పాహారం తిన్న తర్వాత చాలా చలాకీగా ఉన్నట్లు ఉపాధ్యాయులు, అధికారులు గుర్తించారు. దీంతో శుక్రవారం నుంచి ఈ అల్పాహార పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయించారు.
తమిళనాడు రాష్ట్రంలోని 31,008 ప్రభుత్వ పాఠశాలలకు ఈ పథకాన్ని విస్తరించారు. 31 వేలకు పైగా ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో మొత్తం 15,75,900 మంది విద్యార్థులు చదువుతుండగా.. వారిందరికీ ఇకపై ఉదయం అల్పాహారం అందించనుంది రాష్ట్ర ప్రభుత్వం. డీఎంకే సర్కారు తీసుకువచ్చిన ఈ అల్పాహారం పథకంపై చాలా మంది ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే వారిలో ఎక్కువగా పేద విద్యార్థులే ఉంటారు. వీరి కుటుంబాల్లో ఉదయం పూట అల్పాహారం వండుకోవడం చాలా వరకు ఉండదు. చాలా మంది విద్యార్థులు ఉదయం ఖాళీ కడుపుతోనే పాఠశాలకు వస్తారు. మధ్యాహ్నం వరకు వేచి ఉన్న తర్వాతే ఆహారం తీసుకుంటారు. తాజాగా తీసుకువచ్చిన అల్పాహార పథకం వల్ల ఉదయం పూట పిల్లలకు ఆహారం అందుతుంది. పోషకాహారం అందివ్వడం వల్ల విద్యార్థులు రోజంతా హుషారుగా ఉండే అవకాశం ఉంటుందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చిన్నారులకు పాఠశాలల్లోనే అల్పాహారం అందించడంపై విద్యార్థుల తల్లిదండ్రులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ పథకం ద్వారా తాము అనుకున్న లక్ష్యాలను సాధిస్తామని డీఎంకే ప్రభుత్వం భావిస్తోంది. పిల్లల్లో రక్త హీనత, పోషకాహార లోపం, ఆకలి బాధలు తొలగిపోతాయని, ప్రాథమిక పాఠశాలల్లో చిన్నారుల హాజరు శాతం కూడా పెరుగుతుందని నాయకులు అంటున్నారు.