Dengue Vaccine: వర్షాకాలం వచ్చిందంటే చాలు జ్వర బాధితులు పెరిగిపోతారు. జలుబు, దగ్గు, జ్వరంతో సతమతం అవుతుంటారు చాలా మంది. ఇందులో ఎక్కువ మందిని వేధించేది, ఎక్కువ ప్రాణాంతకమైనది డెంగ్యూ జ్వరం. ప్లేట్‌లెట్ల సంఖ్యను తగ్గించే డెంగ్యూ జ్వరం చాలా ప్రమాదకరం. డెంగ్యూ బారిన పడితే కొన్ని రోజుల పాటు ఆస్పత్రి పాలుకావాల్సి వస్తుంది. అలాంటి డెంగ్యూపై కేంద్ర ప్రభుత్వం వార్ ప్రకటించిన విషయం తెలిసిందే. దేశంలో డెంగ్యూ కేసులను పూర్తి స్థాయిలో తగ్గించడమే లక్ష్యంగా వివిధ రకాల కార్యక్రమాలు చేస్తోంది. అందులో భాగంగా వ్యాక్సిన్ తయారీకి సిద్ధమవుతోంది.


హైదరాబాద్ కు చెందిన ఇండియన్ ఇమ్యూనాలాజికల్స్ లిమిటెడ్ కంపెనీ డెంగ్యూ వ్యాక్సిన్ తయారీకి ముందుకొచ్చింది. డెంగ్యూ ఫీవర్ కి విరుగుడు వ్యాక్సిన్ ను 2026 నాటికి అందుబాటులోకి తీసుకువస్తామని ఆ కంపెనీ వెల్లడించింది. ఈ టీకాకు సంబంధించిన ప్రాథమిక దశ ప్రయోగాలు ఇప్పటికే ముగిశాయని, ఈ ప్రయోగాల్లో ఎలాంటి ప్రతికూల ఫలితాలు రాలేదని ఇండియన్ ఇమ్యూనాలాజికల్స్ లిమిటెడ్ కంపెనీ పేర్కొంది.


వ్యాక్సిన్ ను అభివృద్ధి చెందిన ఇండియన్ ఇమ్యూనాలాజికల్స్ లిమిటెడ్ కంపెనీ.. 90 మందిపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించింది. 18 నుంచి 50 ఏళ్ల మధ్య ఉన్న వారిపై ట్రయల్స్ నిర్వహించగా.. వారిలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కనబడలేదని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ క్లినికల్ ట్రయల్స్ రెండు మూడేళ్లలో రెండో దశ జరగనున్నాయి. జనవరి 2026 నాటికి దేశ ప్రజలకు డెంగ్యూ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని ఇండియన్ ఇమ్యూనాలాజికల్స్ లిమిటెడ్ కంపెనీ చెబుతోంది. అమెరికాకు చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సహకారంతో ఈ వ్యాక్సిన్ ను తయారు చేస్తోంది ఇండియన్ ఇమ్యూనాలాజికల్స్ లిమిటెడ్ కంపెనీ. IIL తో పాటు సీరం ఇన్‌స్టిట్యూట్, పనేషియా బయోటిక్ కూడా డెంగ్యూ వ్యాక్సిన్లను తయారు చేసే పనిలో ఉన్నాయి. IIL కంపెనీ 50 దేశాలకు వివిధ రకాల టీకాలనను ఎగుమతి చేస్తోంది. రాబిస్ వ్యాక్సిన్ తయారీలో ఈ సంస్థ అగ్రగామిగా ఉంది.


Also Read: BRICS Summit 2023: తెలంగాణ కళాఖండం, నాగాలాండ్ శాలువా - బ్రిక్స్ సమ్మిట్‌లో దేశాధినేతలకు మోదీ బహుమతులు


ఈ ఏడాది ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 31 వేల 464 డెంగ్యూ కేసులు నమోదు అయ్యాయి. అలాగే 36 మంది డెంగ్యూ తీవ్రమై మృతి చెందినట్లు గణాంకాలు చెబుతున్నాయి. దోమల కారణంగా డెంగ్యూ ప్రబలుతుంది. ఈ వ్యాధితో దేశంలో చాలా ప్రాంతాల్లోని ప్రజలు తీవ్రంగా అవస్థలు పడుతున్నారు. అపరిశుభ్రమైన వాతావరణం, నీరు నిలిచి ఉండే ప్రాంతాల్లో దోమల వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. దోమలు ఎక్కువగా ఉన్న చోట డెంగ్యూ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అయితే కరోనా సమయంలో దేశవ్యాప్తంగా డెంగ్యూ కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. అయితే ఆ తర్వాత ప్రజల కార్యకలాపాలు పెరిగిపోవడం, బయట తిరగడం, పరిశుభ్రత మర్చిపోవడం వల్ల మళ్లీ డెంగ్యూ విజృంభిస్తోంది.