Pragyan Rover Successfully Rolls Out Of Vikram Lander:


అంతరిక్ష రంగంలో కొత్త చరిత్రను సృష్టిస్తూ భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) బుధవారం (ఆగస్టు 3) చంద్రుడి దక్షిణ ధ్రువంపై ల్యాండర్ విక్రమ్ ను సున్నితంగా దింపిన సంగతి తెలిసిందే. తాజాగా అందులో నుంచి రోవర్ ప్రజ్ఞాన్ బయటికి వచ్చింది. ల్యాండర్ దిగిన 2 గంటల 26 నిమిషాల తర్వాత ల్యాండర్ నుంచి రోవర్ బయటకు వచ్చిందని జాతీయ వార్తా సంస్థలు వెల్లడించాయి. అయితే, దీన్ని ఇస్రో అధికారికంగా వెల్లడించలేదు. కానీ, ల్యాండర్ నుంచి రోవర్ ప్రజ్ఞాన్ బయటికి వచ్చిన వీడియోలు మాత్రం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోలు ఇస్రో కమాండ్ సెంటర్ నుంచే బయటికి వచ్చినట్లుగా అర్థం అవుతోంది.






ఇస్రో ప్రతిస్ఠాత్మక మూడో చంద్రయాన్ ద్వారా ల్యాండర్ మాడ్యూల్ ను అత్యంత సున్నితంగా చంద్రుడి ఉపరితలంపై దిగడంతో ఇస్రో శాస్త్రవేత్తల్లో ఆనందం వెల్లివిరిసింది. ఆ క్షణాల కోసం యావత్ దేశం మొత్తం ఉత్కంఠతో ఎదురు చూశారు. ల్యాండర్ దిగిన క్షణం దేశం మొత్తం గర్వపడేలా చేశారని ఇస్రో శాస్త్రవేత్తలను అందరూ కొనియాడారు. దేశమంతా వేడుకలు చేసుకునేందుకు ఈ ప్రయోగం కారణం అయింది. శాస్త్రవేత్తలు చెప్పిన దాని ప్రకారం, ఈ ప్రయోగం చివరి దశ వరకూ ముందుగా నిర్ణయించిన ప్రణాళికల ప్రకారం అన్నీ సరిగ్గానే జరిగాయి. 


కొద్ది రోజుల క్రితం రష్యా అంతరిక్ష నౌక 'లూనా 25' చంద్రుని దక్షిణ ధృవానికి వెళుతుండగా కుప్పకూలిన వేళ భారత్ ఈ ఘనత సాధించింది. జులై 14న మొదలైన ఈ యాత్ర నేడు సాఫ్ట్ ల్యాండింగ్ తో ముగిసింది. ఇక గమ్యాన్ని చేరాక ల్యాండర్ ఇక తన పనిని మొదలుపెట్టనుంది. సోవియట్ యూనియన్, అమెరికా, చైనా మాత్రమే చంద్రుడిపై విజయవంతంగా 'సాఫ్ట్ ల్యాండింగ్' చేయగలిగాయి. కానీ ఈ దేశాలు కూడా చంద్రుడి దక్షిణ ధ్రువం జోలికి వెళ్లలేదు. మన దేశమే ఆ ఘనత సాధించిన తొలి దేశంగా అవతరించింది.


చంద్రునిపై సాఫ్ట్ ల్యాండింగ్ అయిన ల్యాండర్ విక్రమ్ అనంతరం అక్కడి నుంచి తన తొలి సందేశాన్ని పంపించింది. 'భారత్, నేను నా గమ్యస్థానానికి చేరుకున్నా.. మీరు కూడా.. చంద్రయాన్-3' అనే సందేశాన్ని పంపించడం తెలిసిందే. విక్రమ్ ల్యాండర్ జాబిల్లిపై దిగుతున్న సమయంలో హారిజాంటర్ వెలాసిటీ కెమెరా నుంచి కొన్ని ఫొటోలు తీసింది. ఆ ఫొటోలను ఇస్రో ట్విట్టర్ (ఎక్స్) వేదికగా షేర్ చేసి తమ ఆనందాన్ని పంచుకున్నారు శాస్త్రవేత్తలు. ల్యాండ్ అయిన తరువాత విక్రమ్ తీసిన ఫొటో అయితే శాస్త్రవేత్తలకు మరింత సంతోషాన్ని కలిగించింది. విక్రమ్ ల్యాండర్ సరైన ప్రదేశంలో ల్యాండ్ అయిందని, ఫొటోలో ల్యాండర్ కాలు నీడ కనిపిస్తుందని ట్వీట్ లో ఇస్రో పేర్కొంది.  


The Journey of Chandrayaan 3 : ఇస్రో చంద్రయాన్ 3 జర్నీ ఇక్కడ వీక్షించండి


https://news.abplive.com/chandrayaan-moon-landing/amp/amp